అనుకున్నట్లుగానే జరుగుతుందా? అయితే గెహ్లాత్?

అనుకున్నట్లుగానే జరుగుతుందా? అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం కూలిపోనుందా? తమ అధీనంలో ఉన్న ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి పెరిగిందా? సచిన్ పైలట్ కు మద్దతు పెరుగుతుందా? ఈ సమాధానాలన్నింటికి మరో [more]

Update: 2020-08-08 17:30 GMT

అనుకున్నట్లుగానే జరుగుతుందా? అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం కూలిపోనుందా? తమ అధీనంలో ఉన్న ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి పెరిగిందా? సచిన్ పైలట్ కు మద్దతు పెరుగుతుందా? ఈ సమాధానాలన్నింటికి మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుందంటున్నారు. అశోక్ గెహ్లాత్ పోకడలు ఇష్టపడని కొందరు ఎమ్మెల్యేలు బలపరీక్షలో సచిన వైపే మొగ్గు చూపుతారంటున్నారు.

మరో ఆరు రోజుల్లో…..

రాజస్థాన్ రాజకీయానికి ఇప్పట్లో తెరపడేటట్లు లేదు. ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కరోనా వైరస్, మిగిలిన బిల్లులపై ఉద్దేశించి పెట్టిందే అని పైకి చెబుతున్నప్పటికీ అశోక్ గెహ్లాత్ తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. తన బలపరీక్షకు ముందుగానే సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ బలపరీక్షలో అశోక్ గెహ్లాత్ నెగ్గుతారన్న నమ్మకం రోజురోజుకూ దిగజారిపోతోంది.

క్యాంప్ లలో ఎమ్మెల్యేలు….

సచిన్ పైలట్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా క్యాంప్ లో ఉన్నారు. తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని సచిన్ పైలట్ చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యం పెరిగింది. అశోక్ గెహ్లాత్ తన క్యాంప్ ను జైసల్మేర్ లోని ఒక హోటల్ లో నిర్వహిస్తున్నారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఈ క్యాంప్ లో ఉన్నారు. వీరంతా తన వైపే ఉన్నారని అశోక్ గెహ్లాత్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ ఆరోగ్యం బాగా లేక క్యాంపు నుంచి బయటకు వచ్చిన గెహ్లాత్ వర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ బైర్వా బాంబు పేల్చారు.

సచిన్ కు పెరుగుతున్న….

సచిన్ పైలట్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతుందని ప్రశాంత్ బైర్వా చెప్పారు. ఆయనకు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికే అవకాశముందని ఆయన తెలిపారు. దీంతో అశోక్ గెహ్లాత్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలే ఆయనకు అండగా నిలబడరని అర్ధమయింది. దీంతో గెహ్లాత్ ప్రతి ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సచిన్ పైలట్ మద్దతు పెరుగుతుండటం అశోక్ గెహ్లాత్ లో ఆందోళన కల్గిస్తుంది. ఈ ఆరు రోజుల్లో మరిన్ని పరిణామాలు రాజస్థాన్ లో చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News