మధ్యప్రదేశ్ లో మామూలుగా లేదే....?

Update: 2018-10-21 16:30 GMT

సెమీ ఫైనల్స్ గా పరిగణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి మధ్యప్రదేశ్ పైనే కేంద్రీకృతమైంది. ఇందుకు కారణాలు అనేకం. దేశంలోని పెద్దరాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇదొకటి. వైశాల్యం రీత్యా దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రమిది. మధ్య భారతంలో 230 స్థానాలు, 29 లోక్ సభ స్థానాలతో విస్తరించి ఉంది. రాష్ట్రాన్ని విభజించి ఛత్తీస్ ఘడ్ ఏర్పాటు చేయకముందు మధ్యప్రదేశ్ ఇంకా అతిపెద్ద రాష్ట్రం, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో (ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణా) కన్నా అతి పెద్దది. అందువల్ల సహజంగా అందరి చూపూ దానిపైనే ఉంది. ఇక్కడి ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొనడం అత్యంత సహజ పరిణామం.

కీలక రాష్ట్రం కావడంతో.....

ఇక రాజకీయంగా చూసినా అత్యంత కీలక రాష్ట్రం. 2003 నుంచి వరుసగా మూడు దఫాలుగా భారతీయ జనతా పార్టీ భోపాల్ పీఠాన్ని ఏలుతోంది. అదిగాక ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తర్వాత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రెండో సీఎంగా చౌహాన్ రికార్డు సృష్టించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే సహజంగా ఈ రాష్ట్రం ఎన్నికపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఇటీవల సర్వేలు కూడా ఈ రాష్ట్రం ఫలితంపై ఆసక్తి పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అధికార పార్టీని ఓడించి విపక్షానికి అధకారం కట్టబెట్టే సంప్రదాయం గల రాజస్థాన్ ఫలితం దాదాపు ముందే తెలిసిపోయింది. వసుంధర రాజే సర్కార్ పై నెలకొన్న అసంతృప్తి కూడా తెలిసిందే. అన్ని సర్వేలు కూడా కమలం పార్టీ ఓటమి, హస్తం పార్టీ విజయంపై ఒకే ఫలితాన్ని వెల్లడించాయి. ‍ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం ఫలితాలపై సర్వేల్లో ఒకింత స్పష్టత ఏర్పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ విజయాలను ప్రస్తావించాయి. చిన్న రాష్ట్రమైన మిజోరాం ఫలితం పెద్దగా ప్రభావితం చేయలేదు.

కాంగ్రెస్ ఒకింత ఊపు.....

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫలితం ఆసక్తి నెలకొనడం సహజం. జాతీయ పార్టీలు కూడా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా , ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయి. అర్జున్ సింగ్, దిగ్విజయ్ సింగ్ వంటి దిగ్గజ నాయకుల తర్వాత మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. దిగ్విజయ్ సింగ్, కమల్ నాధ్, జ్యోతిరాదిత్య సింధియా వంటి కీలక నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కడు దయనీయంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో 58 స్థానాలు గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి ఒకింత ధీమాగా ఉంది. సర్వేల ఫలితాలతో కాస్తంత ఊపు లభించింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, వ్యాపం కుంభకోణం వంటి తమకు కలసి వస్తాయని విశ్వసిస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో రెండే రెండు స్థానాలు (బింద్వారా-కమల్ నాథ్, గుణ -జ్యోతిరాదిత్య సింధియా) గెలుచుకున్నప్పటికీ జాతీయ స్థాయిలో మోదీ పట్ల వ్యతిరేకత, జీఎస్టీ, పెట్రోలు ధరల పెంపు వంటి అంశాలు ప్రభుత్వంపై దాడికి ఉపయోగపడతాయని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. అదేసమయంలో హస్తం పార్టీకి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. సీఎం పదవి కోసం పీసీసీ చీఫ్ కమలనాథ్, రాజకుటుంబీకుడు జ్యోతిరాదిత్య సింథియాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య వివాదం వస్తే రాజీ అభ్యర్థిగా తన పేరు తెరపైకి వస్తుందన్నది దిగ్విజయ్ సింగ్ ఆశ. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల పరిశీలకుడిగా వ్యవహరించిన ఈ పాతకాపు ఇంతకు ముందు ఆరు నెలల పాటు "నర్మద పరివర్తన యాత్ర" కూడా నిర్వహించారు.

చౌహాన్ అంతా తానే అయి......

అధికార బీజేపీలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. 2008, 2013లో వరుసగా విజయ దుందుభి మోగించిన చౌహాన్ వ్యక్తిగతంగా మృదుస్వభావి. వివాదాలకు అతీతుడు. గత పదమూడేళ్లుగా విజయవంతంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 165 స్థానాలు రావడానికి చౌహాన్ కృషి కారణం. గెలుపోటములపై పార్టీల సర్వేలు ఎలా ఉన్నప్పటికీ సీఎంగా ఎక్కువ మంది ప్రజలు ఓటేయడం విశేషం. మళ్లీ మామూలుగా చౌహానే ముఖ్యమంత్రి కావాలని 41 శాతం మంది కోరుకోగా, జ్యోతిరాదిత్య సింధియాకు 22 శాతం, కమల్ నాథ్ కు 18 శాతం మంది ఓటేశారు. వ్యక్తిగతంగా చౌహాన్ కు, పార్టీగా బీజేపీకి కచ్చితంగా ఇది సానుకూల అంశమే. ఠాకూర్లు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు వంటి అగ్రవర్ణాల ఓట్లపై ఆధారపడి ఇంతకాలం పార్టీ కథ నడిపిస్తోంది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుదోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తం 230 స్థానాల్లో ఎస్సీలకు 35, ఎస్టీలకు 47స్థానాలు రిజర్వు చేశారు. ఈ ఎన్నికలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి చౌహాన్ కు, ప్రధాని మోదీలకు అగ్ని పరీక్షే. పార్టీ ఓటమిని వారి ఓటమిగానే పరిగణించాల్సి వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ విజయం ఆ పార్టీ విజయంగా పరిగణించలేం. అది బీజేపీ పై వ్యతిరేకతగా పరిగణించాల్సి ఉంటుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News