ఇదేంది గోవిందా…?

రాష్ట్రాల వారీ రాజకీయ బ్యాలెన్సు సరిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు నియామకం లో గత ప్రభుత్వాల విధానాలనే వైసీపీ సర్కార్ కూడా అమలు చేసేసింది. రాజకీయ [more]

Update: 2019-09-20 15:30 GMT

రాష్ట్రాల వారీ రాజకీయ బ్యాలెన్సు సరిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు నియామకం లో గత ప్రభుత్వాల విధానాలనే వైసీపీ సర్కార్ కూడా అమలు చేసేసింది. రాజకీయ ఆశ్రితులు, అసంతృప్తులకు పునరావాసం అనే సంప్రదాయాన్ని తూ.చ.తప్పకుండా పాటించారు. మరోవైపు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వాణిజ్య,వ్యాపార,పారిశ్రామిక వేత్తలకూ పెద్ద పీట వేశారు. పొరుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాముఖ్యమివ్వడమనే కొత్త ఆనవాయితీకి సైతం ముఖ్యమంత్రి జగన్ తెర తీశారు. రాజకీయ పునరావాసంగా, సంఘంలో పరపతికి ఒక అధికారిక హోదాగా అలంకార ప్రాయంగా మారుతున్న ట్రస్టుబోర్డు నిజంగా భక్తులకు సేవలందిస్తుందా? లేకపోతే దర్శనం, వసతి, సేవల వంటి ప్రివిలేజెస్ తో తాము హోదా అనుభవించడంతోనే సరిపెట్టుకుంటారా? అన్నదే తేలాల్సి ఉంది.

తెలంగాణకు పెద్ద పీట…

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల బోర్డులో ఆంధ్రప్రదేశ్ తో సమానంగా తెలంగాణకు వాటా కేటాయించారు. రాజకీయ ప్రాధాన్యాలే ఇందుకు ముఖ్య కారణంగా చెప్పాలి. మొత్తం బోర్డులో ఎనిమిది మంది ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఏడుగురు తెలంగాణ వారున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సులు, గతం నుంచీ వైసీపీతో సన్నిహితంగా ఉన్న కొందరు పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరచడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి టీఆర్ఎస్ నుంచి సంపూర్ణ సహాయసహకారాలు లభించాయి. అంతకుముందు టీడీపీ హయాంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల సర్కారులు ఉప్పునిప్పుగా ఉండేవి. ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయంగా కొంత విమర్శలు వస్తాయని తెలిసినా జగన్ మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రానికి న్యాయం చేయాలనుకున్నారు. టీడీపీకి తెలంగాణలో గతంలో మంచి ఓటు షేర్ ఉన్నప్పటికీ ఇద్దరికి మించి స్థానం కల్పించలేదు. వైసీపీకి తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యం దాదాపు శూన్యం. కేవలం అక్కడి సీఎంతో ఉన్న సత్సంబంధాలు, వైసీపీ అధినేతకు ఉన్న సాన్నిహిత్యాలతోనే టీటీడీ బోర్డులో అగ్రస్థానం దక్కింది. అందర్నీ సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనే బోర్డు సభ్యుల సంఖ్యను 15 నుంచి 25 కి పెంచారు. దీనికి అదనంగా మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఎలానూ చేరతారు. మంత్రి మండలి కూర్పుకంటే టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికపైనే ఎక్కువ కసరత్తు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

సర్కారు దయాదాక్షిణ్యాలే…

‘వివాదాలు, వాణిజ్య అంశాలు, పరపతి, పలుకుబడులు ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తున్నప్పటికీ ప్రభ తరగని దైవ సన్నిధి తిరుమల. అటువంటి ఆనంద నిలయంలో మానవ సేవ, మాధవ సేవ లు కలగలిపి తనను తాను అర్పించుకునే అవకాశం అందరికీ దక్కదు. ఆ అదృష్ట వంతులే ధర్మకర్తల మండలి సభ్యులు. ఒకవైపు భక్తి పెరుగుతోంది. మరోవైపు పరపతికి పోటీ పెరుగుతోంది. స్వామి సన్నిధిలో ఉన్నత హోదాలో స్వచ్ఛందంగా పనిచేయడాన్ని గతంలో గౌరవంగా భావించేవారు. స్వయంగా శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఉంటే తప్ప ఆ అవకాశం రాదని భావించేవారు. గడచిన ఇరవై సంవత్సరాలుగా ఇది ప్రభుత్వ దయాదాక్షిణ్యంగా మారింది. బోర్డు రాజకీయాల పునరావాసమైపోయింది. భక్తి కంటే కూడా పైరవీలు చేసుకోవచ్చనే తాపత్రయమూ పెరిగిపోయింది. దీనిపై పీఠాధిపతులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హోదా…పరపతి…శేష ప్రశ్నలు..

ధర్మకర్తల మండళ్లకి పోటీ పడే వారిలో మెజారిటీ సభ్యులు ఇదొక హోదాగా భావిస్తున్నారు. సంఘంలో తమ పరపతికి చిహ్నంగా తాపత్రయపడుతున్నారు. ఇందువల్లనే సేవాభావం , దైవభక్తి స్థానంలో పోటీ తత్వం, తమను తాము ప్రదర్శించుకోవాలనుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయి. నిజానికి ఇవి రాజకీయ పదవులు కావు. సేవామయులకు పెద్ద పీట వేస్తే సార్థకత చేకూరుతుంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ రంగాల్లోని వారికి తమ వ్రుత్తి వ్యాపకాలు చూసుకోవడానికే సమయం సరిపోదు. ఇక దేవుడు, భక్తుల సంగతి ఎలా పట్టించుకోగలుగుతారనేది నిత్యం వెంటాడే ప్రశ్న. ఎప్పుడూ వీవీఐపీ కోటాలోనే దర్శనం చేసుకొనే వారికి సామాన్య భక్తుల ఇక్కట్లు ఎలా తెలుస్తాయన్నది మరో శేషప్రశ్న. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లభించిన వారిలో ఏ పార్టీ కోటాలో ఎవరికి స్థానం దక్కిందని ప్రతిపక్ష రాజకీయ నాయకులు లెక్కలు తీస్తున్నారు. తాము చాలావరకూ బ్యాలెన్స్ పాటించామని ప్రభుత్వం చెబుతోంది. ఆధ్యాత్మికంగా అనుబంధం కలిగి అదే తమ వ్రుత్తిగా, వ్యాపకంగా జీవిస్తున్న వారికి ఎంతమందికి చోటిచ్చారు? సామాన్యుల్లో ఒక్కరినైనా ధర్మకర్తగా గుర్తించి గౌరవించారా? అన్న ముఖ్య విషయాలను అధికార,విపక్ష రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు.

బాధ్యత బహుముఖం…

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు వేల కోట్ల రూపాయల శ్రీవారి నిధుల సద్వినియోగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. భక్తుల సేవల మెరుగుదలకు ఆచరణాత్మకమైన ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుంది. భక్తి ప్రపత్తులతో భక్తుడు సమర్పించే ప్రతి పైసనూ దైవార్పణంగా ఖర్చు చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత కూడా ట్రస్టు బోర్డుదే. కానీ ప్రాంతాల లెక్కలు, పొలిటికల్ బ్యాలెన్స్, వాణిజ్య అవసరాలనే దృష్టిలో పెట్టుకుంటే ధర్మకర్త అన్న పదాన్ని సామాన్యుడు మరిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ పదవులు అలంకార ప్రాయమై పోతాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే తాజాగా నియమితులైన సభ్యులు తమ బిజీ కార్యకలాపాలను కొంత త్యాగం చేసి ఎంతో కొంత సమయం భక్తుల సేవకు వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుంది. లేకపోతే ఇది కూడా ఒక అధికారిక హోదాగానే మిగిలిపోతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News