పరపతి కోటాలో...శ్రీపతి

Update: 2018-07-17 15:30 GMT

ఉన్నావా? అసలున్నావా? అంటూ ప్రశ్నిస్తాడో సినీ కవి. ఉండీ కళ్లు మూసుకున్నావా? అని అతనే నిందిస్తాడు. దేవుడి ఆచార వ్యవహారాలు, శాస్త్ర నియమాలు, సంప్రదాయాలను తమ కనుసన్నల్లో పెట్టుకున్న రాజకీయ నేతలు ఆయన చుట్టూ తమ పరపతి వల నిర్మిస్తున్నారు. దేవుడికే సంకెళ్లు వేస్తున్నారు. అదంతే అని చెప్పేస్తూ తమ పాలనాధికారాన్ని చాటిచెబుతున్నారు. సంప్రదాయమంటే సిస్టమ్. ఒక పద్దతంటూ ఉంటుంది. దానికి భాష్యం చెప్పేవాళ్లు రాజకీయవేత్తలు కావడం, మార్పు సూచించేవారూ మళ్లీ వాళ్లే కావడం ఒక వింత. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న గందరగోళం ఆస్తికజన విశ్వాసాలను అడుగడుగునా అవమానపరుస్తోంది. మహా సంప్రోక్షణం కారణంగా దర్శనమే రద్దు. కొండకు తాళం వేసేస్తాం అంటూ అతి చేసింది పాలకమండలి. అబ్బబ్బే కొందరిని అనుమతిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తమ్మీద రాజకీయ నిర్ణయాలు దేవుని శాసిస్తున్నాయి.

పాలకమండలి పాలిటిక్స్...

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ కార్యనిర్వాహక వర్గంగా మారిపోయింది. ఆధ్యాత్మికతతో సంబంధం లేని అన్యమతస్థులూ వచ్చి కూర్చుంటున్నారు. తోచింది చెబుతున్నారు. దర్శనాలకు పైరవీలు చేసుకునేందుకు, పరపతి పెంచుకునేందుకు అడ్డదారిగా మారిన ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా రాష్ట్రప్రభుత్వం చక్కగా వాడుకొంటోంది. మంత్రి స్థాయికి తక్కువ , ఎమ్మెల్యే స్థాయికి ఎక్కువ అన్నట్లుగా ఇందులో సభ్యుల నియామకాలకు ప్రాతిపదికను పెట్టుకుంటున్నారు. ఆగమశాస్త్ర నియమాలతో, దేవస్థానం ఆచారాలతో వీరికి పెద్దగా పరిచయం ఉండటం లేదు. పూజాదికాలు ఏ నియమాల ప్రకారం నిర్వహిస్తారో వీరికి పట్టదు. కేవలం తాము చెప్పినప్పుడు తమ వారికి దర్శనాలు, కాటేజీల కేటాయింపు చేస్తే చాలు. ఇక దేవస్థానం ఎలా నడిచినా వీరేమీ పట్టించుకోరు. నిజానికి ధర్మకర్తల మండలి అంటే దైవకార్యాలు సజావుగా జరిగేలా ప్రధాన బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యాలకు పూచీకత్తు వహించాలి. టీటీడీలో నియమితులయ్యే సభ్యులకు కనీసం కాల,నైమిత్తిక,నిత్యోత్సవాలకు సంబంధించిన వివరాలపై సైతం కనీస అవగాహన కరవు అవుతోంది. భక్తులంటే తమ బంధుమిత్రులు, దళారులే అనుకునే స్థాయిలో వారి వ్యవహారాలు నడిచిపోతున్నాయి.

అధికారుల తందానా...

అధికార యంత్రాంగం పాలకమండలిని అవసరమైన సందర్బాల్లో గైడ్ చేయాల్సి ఉంటుంది. టీటీడీకి సీనియర్ ఐఏఎస్ లు నేతృత్వం వహిస్తున్నారు. వారికి పాలన వ్యవహారాలపై గట్టి పట్టు ఉంటుంది. అదే సమయంలో ఏ శాఖ నిర్వహణ చేపట్టినా పూర్వాపరాలను అధ్యయనం చేసి తదనుగుణంగా వ్యవహరించడం సివిల్ సర్వీసు ప్రత్యేకత. టీటీడీ విషయంలో మాత్రం అధికారులు చేతులెత్తేస్తున్నారు. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీర్ఘకాలం ఇక్కడ కొనసాగాలంటే ఇది తప్పనిసరి అవసరం గా భావిస్తున్నారు. మహా సంప్రోక్షణ సందర్బంగా తొమ్మిదిరోజులపాటు దైవదర్శనాన్ని నిషేధించిన పాలక మండలి ప్రకటనలో అధికారుల అవగాహన రాహిత్యం కూడా ముడి పడి ఉంది. ఇటువంటి నిర్ణయం గతంలో జరిగిందో లేదో పరిశీలించి నియమనిబంధనలు ఎలా ఉన్నాయో అధికారులే పాలకమండలికి తెలియపరచాలి. వారు చెప్పిందే వేదమన్నట్లు ఆచరణలోకి తెచ్చేస్తున్నట్టుగా ప్రకటించే ముందు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా మాకెందుకు? అన్నట్లుగా పాలక మండలికి తందానా అని దేవస్థానం పరువును ప్రజల్లో చర్చనీయం చేశారు. ఇప్పుడు ఆ అధికారులే మళ్లీ ప్రభుత్వం వేరే రకంగా ఆదేశాలు ఇచ్చిందని చెబుతున్నారు. దర్శనాలకు అనుమతిస్తామంటూ ప్రకటించారు. అంటే పాలక మండలి నిర్ణయం సిఫార్సుల స్థాయికే మిగిలిపోయింది.

సర్కారు సంప్రోక్షణ వెనక..?

ధర్మకర్తల మండలి నిర్ణయాలకు పూచిక పుల్లపాటి విలువ లేకుండా మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాల వేళలను నిర్దేశిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. మమ అనిపించేందుకుగాను ఈనెల 24 న ఒక మొక్కుబడి సమావేశం నిర్వహించమని పాలకమండలికి సూచించింది. ధర్మకర్తల మండలి గౌరవం గంగలో కలిసిపోయింది. కనీసం వారు సమావేశమై అధికారికంగా నిర్ణయం ప్రకటించేవరకూ ప్రభుత్వం ఆగలేదు. పాలకమండలిని డమ్మీని చేస్తూ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించినా ఏ ఒక్క సభ్యుడు నిరసన వ్యక్తం చేయలేదు. తమ గౌరవానికి భంగం వాటిల్లిందని భావించడం లేదు. అంటే దైవకార్యాల్లో తమ పనితీరు అంతంతమాత్రమేనని గ్రహించినట్లుంది. సంప్రోక్షణ సందర్బంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సర్కారు ఆదేశించింది. ఈ పరిమిత అనే కోటాలో ఉండేవాళ్లెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రతిరోజూ స్వామివారిని సందర్శించుకునే వీవీఐపీల సంఖ్య వెయ్యి పైచిలుకు ఉంటోంది. వీఐపీలు కనీసం అయిదారువేలకు తగ్గరు. పరిమితం పేరు చెప్పి వీరికి మాత్రమే దర్శన భాగ్యం కలిగిస్తే సామాన్య భక్తునికి నామాలు పెట్టేసినట్టే. అందువల్ల ఈ పరిమిత కోటాను నడిచివచ్చే సామాన్య భక్తులకు కేటాయిస్తే సముచితంగా ఉంటుంది. కనీసం ఆ పదిరోజులపాటైనా వీవీఐపీల లగ్జరీ కార్ల రొద, వాతావరణ కాలుష్యం లేకుండా స్వామిని సంప్రోక్షణ చేసినట్లవుతుంది. దేవస్థానం శుద్ధి,పరిశుద్ధి పూర్తవుతుంది. ఆమాత్రం చిత్తశుద్ధి సర్కారుకు ఉందా? అన్నదే ప్రశ్న. సర్కారు వారు భక్తుల మనోభావాల పేరిట వీఐపీల దర్శనాలకు మార్గం సుగమం చేశారనే విమర్శలూ వినవస్తున్నాయి.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News