‘‘అనాథ’’ రక్షకుడితో ఆటలా...?

Update: 2018-05-22 15:30 GMT

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునిగా కొలువులందుకునే వెంకన్న చుట్టూ కోటరీ రాజకీయాలు మొదలయ్యాయి. ఆయనపట్ల అచంచల భక్తివిశ్వాసాలు తమకే ఉన్నాయంటూ చాటిచెప్పుకునేందుకు పొలిటికల్ పార్టీలు తంటాలు పడుతున్నాయి. మధ్యలో అర్చకరాజకీయాలూ మంటలు పుట్టిస్తున్నాయి. మొత్తమ్మీద వెంకన్నకు గోవింద నామాలు పెట్టే విషయంలో పోటాపోటీ తలపడుతున్నారు. ఈ క్రమంలో భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎంతగా దెబ్బతిన్నా వారికి పట్టడం లేదు. తమ పంతాలు,పట్టింపుల్లో శ్రీవారిని చదరంగంలో పావుగా మార్చేశారు. పవర్ పాలిటిక్స్ కు స్పిరిచ్యువల్ కలరింగ్ ఇస్తున్నారు. అధికారపరమపద సోపానపటంలో ఆధ్యాత్మికత మంటగలిసిపోతోంది.

బీజేపీ..విచ్ఛిన్న బీజాలు...

తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత భారతీయ జనతాపార్టీ నాయకత్వం రాష్ట్రప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఏ అంశాన్ని విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుంది. అవసరమైతే తామే కొన్నిఅంశాలను సృష్టించేందుకూ పూనుకొంటోంది. వందల సంవత్సరాల చరిత్ర గల తిరుమల దేవాలయ పరిరక్షణపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాసిన లేఖ గతంలో ప్రకంపనలు పుట్టించింది. కేంద్రప్రభుత్వ అధీనంలోని ఈ సంస్థ ప్రాచీనకట్టడంగా ఆనందనిలయాన్ని తమ అధీనంలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించదలచుకున్నట్లుగా రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం పంపింది. గందరగోళం చెలరేగడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. తాజాగా అర్చకుల వయసును 65 ఏళ్లకే పరిమితం చేస్తూ ప్రధానార్చకులను పదవీ విరమణ చేయించిన అంశంపై బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీటీడీ పాలకమండలి నియామకాల మొదలు అన్యమతస్థులకు చోటు కల్పిస్తున్నారనే విషయం వరకూ భక్తుల మనోభావాలతో ముడిపెట్టి ప్రచారంలోకి తేవాలనే యత్నాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. వీఐపీ ల కోసం దేవుని సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో పోటు తవ్వకాలు , పురాతన ఆభరణాలు మాయమయ్యాయన్న ఆరోపణలపైనా దృష్టి సారిస్తోంది. ఏదేమైనా టీడీపీ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులోనూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా కూడా పార్టీకి ప్రజల్లో పట్టు దొరుకుతుంది. రాష్ట్రంలో పాగా వేసేందుకు వీలవుతుంది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ అక్రమాలపై సుప్రీం కోర్టులో కేసు వేస్తానని చెప్పడం కొసమెరుపు.

అధికార పార్టీ అంపకాలు....

రాష్ట్రప్రభుత్వం , తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానాలను రాజకీయ పునరావాసకేంద్రంగానే భావిస్తున్నాయి. మంత్రిపదవులు ఇవ్వడం సాధ్యంకాని వ్యక్తులకు, , పైరవీ కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పిస్తున్నారు. ధర్మకర్తల మండలిగా దేవుని పవిత్రతను కాపాడాల్సిన వారు పైరవీలకు , పనులకు ఈ పదవులను అడ్డగోలుగా వినియోగించుకుంటున్నారు. అన్యమతస్థులు దర్శనం చేసుకునేటప్పుడు తమకు హిందుమతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తారు. అటువంటి కఠిననియమనిబంధనలు ఏర్పరిచారు. చంద్రబాబు నాయుడు ఈవిషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలిలోనే అన్యమతస్థులకు చోటిచ్చారనే దుమారం చెలరేగింది. శాసనసభ్యురాలు అనిత నియామకం ఇందుకొక ఉదాహరణ. చివరికి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. సాక్షాత్తూ ఛైర్మన్ గా నియమితులైన వ్యక్తే అన్యమత కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తారనే విమర్శలున్నాయి. ఆర్థికమంత్రికి బంధువు కావడంతో చంద్రబాబుకు తప్పలేదు. అందులోనూ అదే ఆర్థికమంత్రి స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఎన్టీరామారావు ను పదవీ చ్యుతుడిని చేసి చంద్రబాబు గద్దెనెక్కగలిగారు. రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ పూరిత పంపకాలు తప్ప వెంకన్న పవిత్రతను కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదు. శ్రీవెంకటేశ్వరునికి ప్రజల్లో ఉన్న పలుకుబడిని తమ ప్రయోజనాలకు వాడేసుకోవాలనే యావ అధికారపార్టీలో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీయే కాదు, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీలోనూ ఇదే ధోరణి ఉండేది.

ఆధ్యాత్మిక రాజకీయం...

కేవలం రాజకీయ పార్టీలకే వెంకన్న వివాదం పరిమితం కాలేదు. అర్చకులు సైతం ఆధ్యాత్మిక రాజకీయాలు మొదలు పెట్టారు. పూజారులుగా దేవుని తాకే అదృష్టం స్వామివారికి సేవలు చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని అందరూ భావిస్తారు. కానీ దేవుడిని అడ్డుపెట్టుకుని అర్చకత్వంలో ప్రయోజనాలు పొందడంలో కొందరు పోటీలు పడుతున్నారు. దేవుని సమక్షంలోనే ఆశీర్వచనాలు ఇవ్వాల్సిన ప్రధాన అర్చకులు అతిథి గృహాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. తమ స్వార్థ,ఆర్థిక ప్రయోజనాల కోసం దేవుని పరపతిని అర్చకులు వాడేసుకున్నారనేది ఇక్కడ స్పష్టమైపోతోంది. తాజా వివాదంలోనూ ప్రధానార్చకులు రమణ దీక్షితుల చిత్తశుద్దిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా ప్రధానార్చకునిగా ఉన్న ఆయన గతంలో ఆయా సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ను కలిసిన తర్వాతనే ఆరోపణలు ఎక్కుపెట్టారనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అర్చకులపైనే అనుమానమేఘాలు కమ్ముకోవడం, రాజకీయ పాచికగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News