పక్కన పెడతారా..? పక్కన పెట్టుకుంటారా..?

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ [more]

Update: 2019-01-01 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసిన ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో పాలేరులో వచ్చిన ఉపఎన్నికల్లో సెంటిమెంట్ ని ఛేదించి మరీ వెంకట్ రెడ్డి సతీమణిపై భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. వాస్తవానికి ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన ఓటమి పాలవ్వడంతో ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందనేది తెలియడం లేదు.

సేమ్ సీన్ రిపీట్ అవుతుందా…

నాలుగుసార్లు ఎమ్మెల్యగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లో ఆయన పనిచేశారు. 2014లో ఆయన టీడీపీ నుంచే బరిలో నిలిచి ఓడిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సన్నిహితుడు, ఒకప్పటి సహచరుడైన తుమ్మల ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నిరోజులకే టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాలోని ఆయన వర్గం మొత్తం టీఆర్ఎస్ లో చేరింది. దీంతో వెంటనే కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. గత క్యాబినెట్ లో తుమ్మల రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తుమ్మలకు కేసీఆర్ పెద్దపీట వేసి మంత్రి పదవి కట్టబెట్టడంతో టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో తుమ్మల పార్టీకి పెద్దదిక్కుగా మారారు. కొన్నిరోజుల తర్వాత వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మలకు వ్యతిరేక వర్గం తయారైంది.

మళ్లీ మంత్రి పదవి ఇస్తారా..? ఎంపీగా పంపిస్తారా..?

వర్గపోరుతో పాటు ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమికి సానుకూలత ఉండటం, ఓ ప్రధాన సామాజకవర్గం తుమ్మలకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయన పాలేరులో ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఓడినా మంత్రి పదవి దక్కించుకున్న ఆయనకు కేసీఆర్ పక్కన పెడతారా లేదా ఏదైనా పదవి ఇచ్చిన పక్కన కూర్చోబెట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కి సన్నిహితుడైన ఆయనను మళ్లీ ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన సామాజకవర్గానికి క్యాబినెట్ లో ప్రాతినిథ్యం కల్పించాలంటే తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఇదే సామాజకవర్గం కొటాలో రెండుసార్లు గెలిచిన మరో ఎమ్మెల్యే కూడా క్యాబినెట్ రేస్ లో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే భవిష్యత్ దృష్ట్యా కేటీఆర్ కి సన్నిహితంగా ఉండేవారిని ఈసారి క్యాబినెట్ లోకి తీసుకుంటారనే ఊహాగానాలూ ఉన్నాయి. దీంతో కేటీఆర్ కి సన్నిహితంగా ఉండే ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుని తుమ్మలను ఎంపీగా నిలబెట్టే అవకాశామూ ఉంది. లేదా తుమ్మలకు ఇతర నామినేటెడ్ పదవి ఏదైనా కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఓడినా తుమ్మల ఖాళీగా ఉండరని, ఆయనకు ఏదో ఓ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.

Tags:    

Similar News