ప్రజలపై నే ‘తలరాతలు’

ప్రజారోగ్యం విషయంలో నేతలు చేతులెత్తేస్తున్నారు. బేరాలు ఆడుతున్నారు. అటు కేంద్రం నుంచి మొదలు రాష్ట్రాల వరకూ అదే తంతు. తమకు ఓట్లు వేసి నెగ్గించిన ప్రజలు తమ [more]

Update: 2021-05-05 16:30 GMT

ప్రజారోగ్యం విషయంలో నేతలు చేతులెత్తేస్తున్నారు. బేరాలు ఆడుతున్నారు. అటు కేంద్రం నుంచి మొదలు రాష్ట్రాల వరకూ అదే తంతు. తమకు ఓట్లు వేసి నెగ్గించిన ప్రజలు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారనేది నాయకుల విశ్వాసం. ఉప్పు,పప్పు,సబ్బు, నూనె, పెట్రోలు … ఒకటనేమిటి అన్నిటిపైనా చెల్లిస్తున్న పన్నులే ప్రభుత్వం నడకకు నిధులు. ప్రభుత్వోద్యోగులు మొదలు ప్రజాప్రతినిధుల వరకూ అంతా ప్రజల సొమ్ముపైనే ఆదారపడి బతుకుతున్నారు. అయినప్పటికీ ప్రజలకు ఆక్సిజన్ అందక, పడకలు లేక దయనీయమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజాపాలనకు, నియంతృత్వ పోకడల రాచరికానికి తేడా లేకుండా పోయింది. రోజువారీ మూడు లక్షల కరోనా కేసులు, మూడువేల మరణాలు నమోదు అవుతున్నాయి. ఇది అసాధారణమైన పరిస్థితి. ఒకవైపు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. ఉచిత పథకాలతో డబ్బులు పంపిణీ చేసే నాయకులు ప్రజారోగ్యానికి పూచీకత్తు ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఎప్పటిలోగా ప్రజలకు వాక్సినేషన్ పూర్తిచేస్తామనే అంశమూ ఇదమిత్థంగా చెప్పడం లేదు.

తెర తీసిన రాజకీయం…

అసలు వాక్సిన్ల కు నిధుల కేటాయింపులోనే రాష్ట్రం వాటా , కేంద్రం వాటా అంటూ రగడ మొదలైంది. 45 సంవత్సరాల పైబడినవారికే మేము వాక్సిన్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ ధోరణి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. వాక్సిన్లు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవని కొన్ని రాష్ట్రాలు మొండి కేశాయి. అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్రాలైనా ఎవరి సొమ్ము , ఎవరికి ఖర్చు పెడుతున్నారు. మీ విలాసాలకు, వినోదాలకు, అవినీతికి ప్రజల సొమ్మే కదా వినియోగిస్తోంది? . ఈ నిజం పక్కన పెట్టి తామేదో సొంత డబ్బులు వాక్సిన్లకు ఇస్తున్నట్లు ప్రభుత్వాలు ఫోజు కొట్టడమే విచిత్రం. ప్రజల పన్నుల సొమ్మునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టి జాతీయ వాక్సినేషన్ కింద నిర్దిష్ట కాల వ్యవధిలో అందరికీ వాక్సిన్లు ఇవ్వాలి. ఇతర దేశాల్లోనూ పాలిటిక్స్ ఉంటాయి. కానీ ఎక్కడా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడటం లేదు. కానీ మన దేశానికి వచ్చేటప్పటికి ఎక్కడలేని దౌర్భాగ్యం వెంటాడుతోంది. వాక్సిన్ వేస్తే మాకేమైనా ఓట్లు వస్తాయా? అన్న సంకుచిత దోరణిలో లెక్కలు వేసుకుంటున్నారేమో నాయకులు. ఓట్లకు డబ్బులు పంపిణీ, అనుచిత పథకాలే తమ అధికార సోపానాలుగా భావిస్తున్నారు.

పక్కదారి పట్టిన నేతలు..

విషయ పరిజ్ణానం లేని వాళ్లు ఏమైనా చేయవచ్చు. కానీ అన్ని తెలిసిన నాయకులు సమయం, సందర్భం కాని వేళలో పాలిటిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయం. ఉపద్రవం చుట్టుముడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలరాజేందర్ ఉదంతాన్ని కెలికి తీశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా సమీక్షలు చేస్తూ ఈటల కరోనా విషయంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. భూకబ్జాలు, ఇతర ఆరోపణలపై విచారణలు, దర్యాప్తులు ఆగమేఘాలపై జరిపేసి శిక్షించాల్సిన ఉదంతాలు కావు. పైపెచ్చు కక్ష సాధించడానికి ఇది సమయం కాదు. సంయమనంతో చట్టం తన పని తాను చేసుకునేలా వెసులుబాటు కల్పించి ఉండాల్సింది. మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన సమయం ఇది. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మొదలు సీనియర్ ఐఏఎస్ ల వరకూ ఈటల ఉదంతంలో తలమునకలై పోయి ఉండటం బాధ్యతారాహిత్యమే. అందుకు ముఖ్యమంత్రినే తప్పు పట్టాల్సి ఉంటుంది. రాజేందర్ విషయంతో ఆరోగ్య సమస్య పై చర్చ పక్కదారి పట్టింది. ఉద్దేశపూర్వకంగానే తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారనే విమర్శలూ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సి వస్తోంది.

కేంద్రానికి ప్లాన్ ఉందా…?

అంతర్జాతీయంగా ఇప్పటికే అభాసు పాలయ్యాం. కేంద్ర ప్రభుత్వంతో గతంలో విభేదించిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటి వారు తమ వంతు రాళ్లు విసురుతున్నారు. అమెరికా అంటు వ్యాధుల నిపుణులు ఫౌచి అయితే ప్రత్యేకించి భారత్ లో మొత్తం వ్యవస్థలన్నీ మూసేయాలంటున్నారు. సైన్యానికి అప్పగించేయాలని సూచిస్తున్నారు. నిజానికి బారత ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి స్పందిస్తే అదుపు చేయడం అసాధ్యం కాదు. అమెరికా మనదేశ జనాభాలో నాలుగో వంతు. అయినా అక్కడ కేసుల సంఖ్య మూడున్నరకోట్లు. మరణించిన వారు ఆరులక్షలు. మనదేశంలో ఇప్పటికి కేసుల సంఖ్య రెండు కోట్లు. మరణించిన వారు రెండు లక్షలు. అమెరికాలో లాక్ డౌన్ పెట్టలేదు. నెమ్మదిగా అదుపు చేసుకున్నారు. ఫౌచి వంటి వారు ఇచ్చే ఉచిత సలహాలకు క్షేత్రస్తాయి వాస్తవాలతో సంబంధం ఉండదు. భారత జీవనప్రమాణాలు, ప్రజలస్థితిగతుల గురించి ఏమాత్రం అవగాహన లేనివారి మాటలను పట్టించుకోనక్కర్లేదు. లాక్ డౌన్ వంటి వి అమలు చేసినా సడలింపు ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రజలు గుమికూడి వ్యాప్తిని తీవ్రం చేయడం గతంలో చూశాం. అందువల్ల లాక్ డౌన్ చివరి అస్త్రం మాత్రమే కావాలన్న కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? న్యాయస్థానాలకు అంతా సక్రమంగానే ఉందని అఫిడవిట్లు ఇవ్వడం, రాష్ట్రాలకు సలహాలు ఇవ్వడమేనా? ఇప్పుడు ఇమ్మీడియెట్ యాక్షన్ ప్లాన్ కావాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News