గవర్నర్ తేల్చేశారు… ఇక ఇదే ఫైనల్

మొత్తమ్మీద ఓ పనై పోయింది. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఇప్పుడు చట్టంగా రూపు దాల్చాయి. ఏక రాజధానిగా అమరావతి రద్దు, పరిపాలన వికేంద్రీకరణతో విశాఖ, అమరావతి, [more]

Update: 2020-07-31 15:30 GMT

మొత్తమ్మీద ఓ పనై పోయింది. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఇప్పుడు చట్టంగా రూపు దాల్చాయి. ఏక రాజధానిగా అమరావతి రద్దు, పరిపాలన వికేంద్రీకరణతో విశాఖ, అమరావతి, కర్నూలుకు ప్రభుత్వ వ్యవస్థల తరలింపునకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేశారు. దీంతో ప్రభుత్వం ఏడునెలలుగా చెబుతూ వస్తున్న చట్టపరమైన ప్రక్రియ పూర్తయినట్లే. శాసనపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా వివిధ రూపాల్లో అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్షాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. న్యాయపరంగా కొంత మేరకు ఆశలు పెట్టుకునే అవకాశం మాత్రమే ఇక మిగిలింది. పరిపాలన వికేంద్రీకరణ, కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ చట్టం రద్దు అంశాలను రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సర్కారుకు వ్యతిరేకంగా పోరాడాయి. అయినా ఈవిషయంలో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోగలిగింది. తాజా పరిణామం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న సుహ్రుద్భావ సంబంధాలకు సైతం అద్దం పట్టిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

కేంద్రం గ్రీన్ సిగ్నల్…

పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి రాజధాని ప్రాంత రద్దు బిల్లులను జనవరి నెలలోనే శాసనసభ ఆమోదించింది. అయితే తనకున్న మెజార్టీతో తెలుగుదేశం పార్టీ వీటిని శాసనమండలిలో అడ్డుకుంది. సెలక్టు కమిటీకి పంపించగలిగింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా సెలక్టు కమిటీ ఏర్పాటు కాకుండా అడ్డుకోగలిగింది. ఈలోపు కోవిడ్ విజృంభణతో కొన్ని నెలలపాటు ప్రక్రియ లో జాప్యం చోటు చేసుకుంది. అయితే న్యాయపరంగా హైకోర్టులో వ్యాజ్యాలు మాత్రం నడుస్తున్నాయి. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యేవరకూ రాజధానిని తరలించబోమంటూ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. జూన్ నెల 16 న రెండో సారి అసెంబ్లీ ఇవే బిల్లులను ఆమోదించి మండలికి పంపింది. రెండోసారి మండలికి పంపిన దృష్ట్యా దాని ఆమోదం, తిరస్కారంతో సంబంధం లేకుండా నెలరోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లభించింది. దాంతో జులై 17న బిల్లులపై ఆమోదానికి గవర్నర్ వద్దకు పంపించింది. రాష్ట్రపతి నోటిఫికేషన్ తో హైకోర్టు, ప్రధాని శంకుస్థాపనతో అమరావతి ఆచరణలోకి వచ్చాయి కాబట్టి ఈ ప్రక్రియను కేంద్రం అడ్డుకుంటుందని ప్రతిపక్షాలు ఆశించాయి. న్యాయనిపుణులతోపాటు కేంద్రంతోనూ గవర్నర్ సంప్రతింపులు జరిపిన తర్వాతనే ఈ బిల్లులకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మూడు రాజధానులకు సానుకూలంగా ఉండటంలో రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ నిర్ణయంతో తెలుగుదేశం పూర్తిగా దెబ్బతింటుంది. అదే సమయంలో వైసీపీతో బంధమూ బలపడుతుంది. సందర్బానుసార సహకారమూ లభిస్తుంది.

బీజేపీకి ముందే సంకేతాలు…

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖకు ఈ విషయంలో ముందుగానే సంకేతాలున్నాయి. గతంలో తీర్మానం చేసిన మేరకు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతున్నట్లుగా బీజేపీ నాయకులు చెబుతూ వచ్చారు. అయినప్పటికీ కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదంటూ తేల్చి చెప్పేశారు. తద్వారా తమది రాజకీయమైన డిమాండ్ మాత్రమే తప్ప కేంద్రంపై పార్టీ పరంగా ఒత్తిడి తెచ్చే ప్రసక్తి లేదని పరోక్షంగా అంగీకరించారు. అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మార్చిన వారం లోపుగానే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేశారు. నిజంగానే బీజేపీ కి ఈవిషయంలో వ్యతిరేకత ఉంటే గవర్నర్ ద్వారా అడ్డుకునేందుకు, జాప్యం చేసేందుకు అవకాశం ఉండేది. ఆ రకమైన జోక్యానికి బీజేపీ ప్రయత్నించలేదు. పైపెచ్చు రాజధాని తరలి వెళ్లే ప్రసక్తే లేదన్న సుజనా చౌదరి వంటి వారిని బహిరంగంగానే మందలించింది. ఈ విషయంలో పార్టీ వైఖరికి సుజనా చౌదరి భిన్నంగా మాట్టాడుతున్నారంటూ ఖండించింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కావాలనేది బీజేపీ తొలి నుంచి చేస్తున్న డిమాండ్. అటు విశాఖ పట్నంలోనూ బీజేపీకి కొంతమేరకు పట్టుంది. ఏతావాతా మొత్తం సాగిన ప్రక్రియను బేరీజు వేసుకుంటే వైసీపీ సర్కారుకు బీజేపీ పరోక్షంగా సహకరించిందనే చెప్పాలి. అయితే తన పాత్ర బహిరంగంగా కనిపించకుండానే పని కానిచ్చేసింది.

వైసీపీకి రాజకీయ మైలేజీ…

ప్రతిపక్షాల నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వైసీపీ సర్కారుకు ఈ రాజధానుల బిల్లు రాజకీయంగా ఘన విజయంగానే చెప్పుకోవాలి. చంద్రబాబు ముద్రతో ప్రస్థానం మొదలైన అమరావతిపై ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక ముఖ్యమంత్రి జగన్ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమరావతిని పూర్తి చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకే వెళ్లుతుంది. నిధుల కొరతతో సమగ్రంగా పూర్తి చేయలేకపోతే విమర్శలను వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ప్రత్యామ్నాయంగానే అన్ని ప్రాంతాల అభివృద్ధి, మూడు రాజధానులు అజెండాను పైకి తెచ్చారు. తొలిదశలో రాష్ట్రంలోని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని సందేహించారు. కానీ స్థూలంగా ప్రభుత్వ నిర్ణయంపై ఇతర ప్రాంతాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కొంతకాలం సాగిన ఆందోళనలు రాజకీయ పార్టీలకే పరిమితమయ్యాయి. తరలింపుపై స్థిరంగా సాగుతున్న ఆందోళన కేవలం 29 గ్రామాలకే పరిమితమై పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజామద్దతు కూడగట్టడంలో టీడీపీ, ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ఇది వైసీపీకి నైతిక స్థైర్యం కల్పించింది. అందుకే మూడు రాజధానులపై ముందుకే వెళ్లాలని సంకల్పించింది. శాసనసభలో తొలిసారి బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏడు నెలల కాలంలోనే తాను అనుకున్నది సాధించింది. పైపెచ్చు అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ రాజకీయంగా మంచి మైలేజీ తెచ్చుకునే అవకాశాన్ని చేజిక్కించుకుంది.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News