అనుకున్నదొకటి…అవుతుంది మరొకటి?

మూడు రాజధానులతో పరిపాలనను వికేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు తలపెట్టిన ప్రయత్నం ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. విజిలెన్స్ కమిషన్, ఎంక్వయిరీ కమిషనరేట్ లను కర్నూలుకు తరలించేందుకు జనవరి [more]

Update: 2020-03-21 15:30 GMT

మూడు రాజధానులతో పరిపాలనను వికేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు తలపెట్టిన ప్రయత్నం ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. విజిలెన్స్ కమిషన్, ఎంక్వయిరీ కమిషనరేట్ లను కర్నూలుకు తరలించేందుకు జనవరి లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం నిలుపుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ వేయడానికి చట్టపరమైన అంశాలనే హైకోర్టు కారణంగా చూపించింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)చట్టం అమల్లో ఉన్నంతకాలం ప్రభుత్వ కార్యాలయాల తరలింపు సాధ్యం కాదని న్యాయస్థానం పరోక్షంగా స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వస్తోంది. ఈ చట్టంలోని మాస్టర్ ప్లాన్ లో ప్రభుత్వ కార్యాలయాలను పొందుపరిచారు. దీంతో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం అంత సాఫీగా అమలయ్యేలా కనిపించడం లేదు. ఈ చట్టం ప్రభుత్వం ముందరికాళ్లకు బంధం వేస్తోంది.

త్రిశంకు …చట్టం …

అమరావతి రాజధాని చట్టం నిజానికి ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ చేసిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ప్రత్యామ్నాయంగా మూడురాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సైతం ఆమోదించింది. అయితే అవి ఇంకా చట్టరూపుదాల్చలేదు. శాసనమండలి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంది. సెలక్టు కమిటీకి బిల్లులను పంపించింది. పంతానికి పోయిన సర్కారు శాసనమండలినే రద్దు చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. మండలి రద్దు అయితే సీఆర్డీఏ చట్టం రద్దుకు లైన్ క్లియర్ అయిపోయినట్లే. కానీ అంతవరకూ సాంకేతికంగా చట్టం అమలులో ఉన్నట్లే. న్యాయస్థానాలు దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ కార్యాలయాల తరలింపును ప్రస్తుతానికి నిరోధిస్తున్నాయి. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి అమరావతి రాజధాని చట్టాన్ని రద్దు చేయవచ్చునా? అనేది ప్రభుత్వం ముందు ఉన్న మరో ప్రత్యామ్నాయం. అయితే బిల్లు మండలి పరిశీలనలో ఉన్న సందర్భంలో ఆర్డినెన్స్ జారీకి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు కొందరు రాజ్యాంగ నిపుణులు. మొత్తమ్మీద త్రిశంకు స్వర్గంలో ఉన్న సీఆర్డీఏ చట్టం ప్రభుత్వం ముందడుగు వేయకుండా నిరోధిస్తోంది.

ఆలోచన..ఆచరణ…

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మేనెల నాటికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేయాలని ప్రభుత్వం భావించింది. మంత్రులు సైతం ఇందుకు సంబంధించి ప్రకటనలు చేశారు.కానీ ప్రభుత్వ పనితో నేరుగా సంబంధం లేని విజిలెన్స్ కమిషనర్, ఎంక్వయిరీ కమిషనరేట్ ల తరలింపునకే న్యాయస్థానం తీర్పుతో ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో పోలిస్తే సచివాలయం తరలించడం మరింత కష్టసాధ్యం. న్యాయస్థానంలో ఇప్పటికే వ్యాజ్యాలు నడుస్తున్న దృష్ట్యా ఉన్నతాధికారులు చొరవ చూపలేకపోవచ్చు. సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించి ముందుగా క్లారిటీ వస్తేనే తరలింపునకు లైన్ క్లియర్ అవుతుంది. అంతవరకూ ప్రభుత్వ కదలికలపై ఉన్నత న్యాయస్థానం నిఘా కొనసాగుతున్నట్లుగానే భావించాలి. కార్యనిర్వాహక రాజధాని నిర్ణయాన్ని మే నెలలో అమలు చేస్తేనే సిబ్బందికి సౌకర్యంగా ఉంటుంది. ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు విద్యావసతులు, ఇతర ఏర్పాట్లకు అనువుగా ఉంటుంది. ఒకవేళ కచ్చితంగా వెళ్లాల్సి వస్తే కొత్త విద్యాసంవత్సరం మొదలు కాకముందే ప్రక్రియ మొదలు కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

సాంకేతిక సమస్యలు…

ప్రస్తుతమున్న వాతావరణ స్థితిగతులు , రాజకీయ అనివార్యత లను పరిగణనలోకి తీసుకుంటే రానున్న మూడునెలల్లో ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు మే, జూన్ లలో నిర్వహించాల్సి రావచ్చు. అదే విధంగా కరోనా నిరోధక చర్యలతో ఒకటి రెండు నెలలు ప్రభుత్వ యంత్రాంగం బిజీగా గడపాల్సి ఉంటుంది. శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ ను రెండు మూడు నెలలకు ఈ నెలాఖరులోఆమోదించుకున్నప్పటికీ జూన్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ కు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఒక పదిహేనురోజుల ప్రక్రియ. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకుని చూస్తే .. చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన అవరోధాలు విశాఖ రాజధాని నిర్ణయం అమలులో కాలయాపనకు దారి తీయవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News