“దూరం” దగ్గర చేస్తుందా?

ఆధునిక ప్రపంచంలో “దూరం” అనే పదానికి అర్థంలేకుండా పోయింది. ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి నేపథ్యంలో ఈ ప్రశ్న తలెత్తదు. యావత్ ప్రపంచం ఒక్క కుటుంబంగా [more]

Update: 2019-12-27 16:30 GMT

ఆధునిక ప్రపంచంలో “దూరం” అనే పదానికి అర్థంలేకుండా పోయింది. ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి నేపథ్యంలో ఈ ప్రశ్న తలెత్తదు. యావత్ ప్రపంచం ఒక్క కుటుంబంగా మారిన పరిస్థితుల్లో దూరాభారాలు అన్నది అసలు సమస్య కాదు. చర్చనీయాంశం కానే కాదు. అర చేతిలో మొబైల్ ఫోన్ లో ఎక్కడున్నా యావత్ ప్రపంచాన్ని వీక్షించే రోజులివి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై వస్తున్న విమర్శల్లో సహేతుకత కొరవడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో శాసనసభ రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూులులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కొన్నిచోట్ల, కొన్ని వర్గాల నుంచి విమర్శలు, వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులు మూడు విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా పాలనాపరమైన, దూరం సమస్యలు ఏర్పడుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి, కర్నూలు, విశాఖపట్నం.. నగరాలు మూడు విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటి మధ్య భౌగోళిక సారూప్యత లేదు. భాష, యాస పరంగా కూడా సామీప్యత లేదు. అనుసంధానత కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిజానికి ఇది ఒక్కటే ఒకింత సమస్య. దూరం అసలు సమస్యే కాదు. ఒక్కసారి చరిత్ర చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

పదికి పైగా రాష్ట్రాల్లో….

దేశంలో పదికి పైగా రాష్ట్రాల్లో రాజధానులు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో కేంద్రీకృతమయి ఉన్నాయి. న్యాయ, కార్యనిర్వాహక, రాజధానుల మధ్య దూరం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఈ పరిస్థితి ఉంది. అయినా ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. దేశానికి గుండెకాయ వంటి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. కానీ హైకోర్టు మాత్రం అలహాబాద్ లో ఉంది. దీని బెంచ్ లక్నోలో ఉంది. ఈ వ్యవస్థ సవ్యంగానే పనిచేస్తుంది. 2000 సంవత్సరంలో ఏర్పాటైన కొత్త రాష్ట్రం చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్, కానీ హైకోర్టు మాత్రం బిలాస్ పూర్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. గుజరాత్ కు గాంధీనగర్ పేరుతో నూతనంగా రాజధానిని నిర్మించారు. కానీ హైకోర్టు మాత్రం అహ్మదాబాద్ నుంచే పనిచేస్తుంది. ఇది ఎప్పటినుంచో నడుస్తోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్ పూర్ లో ఉంది. రాజధాని మాత్రం భోపాల్ నగరం. ఒడిశా రాజధాని భువనేశ్వర్. హైకోర్టు మాత్రం కటక్ కేంద్రంగా ఏర్పాటయింది. రాజస్థాన్ హైకోర్టు జోధ్ పూర్ నుంచి పనిచేస్తుండగా, రాజధానిగా జైపూర్ కొనసాగుతోంది. వాజ్ పేయి హయాంలో ఆవిర్భవించిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తుండగా, హైకోర్టు మాత్రం నైనిటాల్ లో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో కొలువుదీరింది. కానీ హైకోర్టు మాత్రం కొచ్చి నుంచి పనిచేస్తుంది. పుదుచ్చేరికి హైకోర్టు లేదు. సమీపంలోని మద్రాస్ హైకోర్టుకు కక్షిదారులు రావాల్సిందే. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీ ఇదే పరిస్థితి. దీని రాజధాని కరవటి. కానీ కేరళ హైకోర్టు పరిధిలో ఉంది. అంటే కక్షిదారులు కొచ్చి నగరానికి రావాలి.

ఈశాన్య రాష్ట్రాల్లోనూ….

ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణం. మొన్న మొన్నటి వరకూ ఈ ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలకు గౌహతీయే పెద్ద దిక్కు. ఇది అసోం రాజధాని. తర్వాత రోజుల్లో మేఘాలయ కు రాజధాని షిల్లాంగ్, మణిపూర్ కు రాజధాని ఇంఫాల్, త్రిపుకకు రాజధానిగా అగర్తలలో హైకోర్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు ఉన్నత న్యాయస్థానాలు లేవు. ఈ మూడు రాష్ట్రాల కక్షిదారులు అప్పీల్ కు వెళ్లాలంటే సుదూరంలోని గౌహతి హైకోర్టే దిక్కు. చిన్న రాష్ట్రమైన గోవాకు నేటికీ హైకోర్టు లేదు. ఈ ప్రాంత ప్రజలు ఏ చిన్న పని కోసమైనా ముంబయి హైకోర్టును ఆశ్రయించాల్సిందే. నిన్న మొన్నటి దాకా తెలుగు రాష్ట్రాలకు ఒక్కటే హైకోర్టు ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోనే హైకోర్టు ఉంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కొంతకాలం హైదరాబాద్ లోనే హైకోర్టు ఉండాలని నిర్ణయించారు. ఎట్టకేలకు 2019 ప్రధమార్థంలో అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ప్రపంచ దేశాల్లోనూ…

ప్రపంచ వ్యాప్తంగా రెండు రాజధానుల ఉదాహరణలున్నాయి. యూరోపియన్ దేశం నెదర్లాండ్స్ కు అమెస్టర్ డామ్, ది హేగ్ నగరాలు రాజధానులుగా పనిచేస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశమైన మలేసియాకు కౌలాలంపూర్, పుత్రజయ నగరాలు రాజధానులుగా పనిచేస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఏకంగా మూడు రాజధానుల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తోంది. చిలీ, శ్రీలంక, యెమన్, టాంజేనియా, బొలివియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాల్లో రెండు రాజధానుల వ్యవస్థ ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. అందువల్ల మూడు రాజధానుల వల్ల ఎటువంటి నష్టం జరగదు. ప్రజలకు పరపాలన చేరువ అవుతుంది. మూడు ప్రధాన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News