గవర్నర్ నిర్ణయంపైనే?

ప్రతి విషయానికి సిగపట్లతో తలపడే వైసీపీ, టీడీపీలు తాజాగా తమ వివాదాల్లోకి గవర్నర్ ను లాగేందుకు సిద్ధమవుతున్నాయి. శాసనమండలి సెలక్ట్ కమిటీ విషయంలో చోటు చేసుకున్న వివాదంలో [more]

Update: 2020-02-12 15:30 GMT

ప్రతి విషయానికి సిగపట్లతో తలపడే వైసీపీ, టీడీపీలు తాజాగా తమ వివాదాల్లోకి గవర్నర్ ను లాగేందుకు సిద్ధమవుతున్నాయి. శాసనమండలి సెలక్ట్ కమిటీ విషయంలో చోటు చేసుకున్న వివాదంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను ఆశ్రయించక తప్పని అనివార్యత ఏర్పడుతోంది. సెలక్ట్ కమిటీపై విచక్షణాధికారంతో మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం, దానిని తిరస్కరించి కమిటీ వేయడం కుదరదని తేల్చి చెప్పేసిన లెజిస్లేచర్ కార్యదర్శుల అధికార పరిధులు ఇప్పుడు చర్చనీయమవుతున్నాయి. వీటిని తేల్చి చెప్పాల్సింది గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్.

మడత పేచీ….

శాసన సభ, శాసనమండలి, గవర్నర్ కలిస్తేనే రాష్ట్ర శాసన వ్యవస్థ. ఏ బిల్లు అయినా రెండు సభల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదంతోనే చట్టం రూపు దాలుస్తుంది. అందువల్ల చట్టసభల్లో గవర్నర్ ను సైతం పాత్రధారిగానే చూడాలి. సమావేశాల నోటిఫికేషన్ మొదలు ఉభయసభల నుద్దేశించి ప్రసంగించడం వరకూ గవర్నర్ భాగస్వామ్యం వహిస్తూ ఉంటారు. వైసీపీ, టీడీపీ ల మధ్య రాజకీయంగా మొదలైన గొడవ ఇప్పుడు రాజ్యాంగ పరిష్కారాన్ని కోరుతోంది. అమరావతిపై గతంలో చేసిన సీఆర్డీఏ చట్టాన్నిరద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం, అలాగే పాలన వికేంద్రీకరణకు ఉద్దేశించిన మూడు రాజధానుల బిల్లులను శాసనసభ ఆమోదించింది. మండలిలో దీనికి బ్రేకు పడింది. జనవరిలో రెండు రోజుల చర్చ తర్వాత ఆయా బిల్లుల పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ లెజిస్లేచర్ కార్యదర్శి తాజాగా తిప్పికొట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. అయితే రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న ఛైర్మన్ ఆదేశాన్ని బ్యూరోక్రసీలో భాగమైన కార్యదర్శి తిరస్కరించగలరా? అన్నదే సందేహం.

పరిధి దాటినట్లేనా..?

శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లకు రాజ్యాంగంలోనే కొన్ని విశేషాధికారాలు కల్పించారు. అప్పటివరకూ అనుసరిస్తున్న నిబంధనల పుస్తకం, సంప్రదాయాల్లో లేకపోయినప్పటికీ తన రూలింగ్ ద్వారా కొత్త సంప్రదాయాన్ని, అంశాన్ని అమల్లోకి తెచ్చే విచక్షణాధికారం స్పీకర్, ఛైర్మన్లకు ఉంటుంది. దానిని సభలో ఉన్న సభ్యులు కానీ, ప్రభుత్వం కానీ వ్యతిరేకించలేదు. సెలక్ట్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదనే విషయంలో ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. మండలినే రద్దు చేయించాలని ఇప్పటికే శాసనసభలో మూడింట రెండు వంతుల మెజార్టీతో తీర్మానం ఆమోదించారు. అయితే మండలి రద్దుకు సంబంధించి పార్లమెంటు చట్టం చేసే వరకూ కూడా ఈ వ్యవస్థ మనుగడలోనే ఉంటుంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి పాటించాల్సిందేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ధిక్కరించడమనేది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందంటున్నారు. ఒక ఉద్యోగిగా నిబంధనలు చూసుకోవడం కార్యదర్శి బాధ్యత కాబట్టే పర్యవసానాలకు సిద్దపడే ఛైర్మన్ ఆదేశాలను తోసిపుచ్చారని ప్రభుత్వం చెబుతోంది.

రాజ్యాంగ సంక్షోభం…

సెలక్ట్ కమిటీ నియామక అంశమే తొలి నుంచి వివాదమవుతోంది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలనే ఆలోచన ఉంటే వాటిని చర్చకు స్వీకరించకముందే ప్రతిపక్షం నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెలక్ట్ కమిటీని వేయదలచుకుంటే దానిపై సభలో ఓటింగు నిర్వహించాలి. కమిటీ నియామకం 14 రోజుల వ్యవధిలో పూర్తి కావాలి. ఈ అంశాలన్నిటిలోనూ వైఫల్యం కనిపిస్తోందనేది ప్రభుత్వ వాదన. నిబంధనలు అంగీకరించకపోయినప్పటికీ తన విచక్షణాధికారాల మేరకు సెలక్ట్ కమిటీని నియమిస్తున్నట్లుగా మండలి ఛైర్మన్ ప్రకటించారు. అందువల్ల ఈ కమిటీ నియామకమే రాజ్యాంగ బద్ధంగా లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకసారి ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది. బడ్జెట్ తో ముడిపడిన మనీ బిల్లులు కాదు కాబట్టి 14 రోజుల్లో స్వచ్ఛందంగా మురిగిపోయే అవకాశం కూడా లేదంటోంది. కార్యదర్శిపై చర్యలు కోరుతూ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మండలి ఆమోదం, సెలక్ట్ కమిటీతో నిమిత్తం లేకుండా రాజధాని బిల్లులను గవర్నర్ కు పంపి చట్టం చేయిస్తామని చెబుతోంది. బిల్లులు తన చెంతకు వస్తే వాటిని ఆమోదించి గవర్నర్ చట్టంగా మారుస్తారా? లేక మండలిలో సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు కాబట్టి పెండింగులో పెడతారా? మండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించిన కార్యదర్శిపై చర్యలకు తీసుకోమని ప్రభుత్వానికి సలహా ఇస్తారా? మొత్తంగా గవర్నర్ కోర్టులోకి బంతి చేరుతోంది. న్యాయనిపుణులను సంప్రతించిన తర్వాతనే రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయంటూ ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టులో అంగీకరించడమూ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వివాదాలు రాజ్యాంగానికే విషమపరీక్ష పెడుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News