త్రీ క్యాపిటల్ ను కూడా అర్ధరాత్రే విడుదల చేస్తారా?

మూడు రాజధానుల బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ప్రస్తుతం గవర్నర్ వద్దనే ఉంది. రాజభవన్ నుంచి ఎప్పుడు ఆమోదం లభిస్తుందోనని అధికార పార్టీ వెయిట్ చేస్తుండగా, విపక్షాలు [more]

Update: 2020-07-31 11:00 GMT

మూడు రాజధానుల బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ప్రస్తుతం గవర్నర్ వద్దనే ఉంది. రాజభవన్ నుంచి ఎప్పుడు ఆమోదం లభిస్తుందోనని అధికార పార్టీ వెయిట్ చేస్తుండగా, విపక్షాలు మాత్రం రాష్ట్రపతికి పంపడం కోసం ఎదురు చూస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు రాజ్ భవన్ కు చేరి దాదాపు పదిహేను రోజులవుతోంది. గవర్నర్ ఈ బిల్లులను న్యాయశాఖకు పంపారు. న్యాయశాఖ నుంచి కూడా దీనిపై వివరణ చేరింది.

బుగ్గన స్వయంగా కలసి….

దీంతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలసి మూడు రాజధానుల బిల్లులపై చర్చించారు. శాసనమండలి లో బిల్లులు రెండో సారి ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందినా, పొందకపోయినా నెల రోజుల తర్వాత మాత్రమే గవర్నర్ ఆమోదానికి పంపామని బుగ్గన వివరించారు. సాంకేతికంగా మండలిలో బిల్లు ఆమోదం పొందినట్లేనన్నది అధికార పార్టీ వాదన.

న్యాయనిపుణుల సలహాతో….

మరోవైపు న్యాయశాఖ నుంచి వచ్చిన మూడు రాజధానుల బిల్లులపై న్యాయనిపుణుల సలహాలను తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశం హైకోర్టులో నడుస్తుంది. హైకోర్టు తీర్పు మూడు రాజధానుల విషయంపై ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. మరికొంత కాలం సమయం పడుతుంది. అందుకే గవర్నర్ నిర్ణయం కోసం ఏపీ అంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.

బలగాల మొహరింపు…..

మూడు రాజధానుల బిల్లుల విషయంపై గవర్నర్ ఆమోదిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమీ లేదని ఆయన చెప్పారు. కాగా గవర్నర్ త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటించనుండటంతో రాజ్ భవన్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ దళాలను దించడంతో నేడో, రేపు గవర్నర్ నిర్ణయం వెలువడే అవకాశముందని చెబుతున్నారు. నిమ్మగడ్డ పునర్నియామకం లాగానే మూడు రాజధానుల బిల్లుల విషయంపై కూడా అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడే అవకాశముందన్న టాక్ అమరావతిలో విన్పిస్తుంది.

Tags:    

Similar News