ఏపీకి ఎగనామమే..?

మూడున్నర సంవత్సరాలుగా కేంద్రమంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ కు అసలు ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రాన్ని గాలికొదిలేసింది ఎన్డీఏ సర్కారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ ఉప రాష్ట్రపతి కాకముందు వెంకయ్య [more]

Update: 2021-07-08 15:30 GMT

మూడున్నర సంవత్సరాలుగా కేంద్రమంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ కు అసలు ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రాన్ని గాలికొదిలేసింది ఎన్డీఏ సర్కారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ ఉప రాష్ట్రపతి కాకముందు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుగా ఉండేవారు. అలాగే తెలుగుదేశం భాగస్వామి కావడంతో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి రాష్ట్రం సమస్యలపై ఎంతోకొంత కదలిక తెచ్చేవారు. నిర్మలాసీతారామన్ సైతం రాజ్యసభకు ఇక్కడ్నుంచే ఎన్నిక కావడంతో కొంత సానుభూతి కనబరిచే వారు. ఇదంతా గత చరిత్ర. 2017లోనే వెంకయ్య నాయుడు పెద్ద పదవికి వెళ్లిపోయారు. రాజకీయాలకు దూరమైపోయారు. తెలుగుదేశం అత్యుత్సాహంతో ఉన్న రెండు పదవులూ 2018లో పోగొట్టుకుంది. నిర్మల పదవీ కాలం పూర్తవ్యడంతో వేరే చోటనుంచి రాజ్యసభకు పంపించారు. మొత్తంగా ఏపీకి గుండుసున్న మిగిలింది. ఆ తర్వాత ఇక్కడి సమస్యలను కేంద్రంతో చర్చించేందుకు ఒక మధ్యవర్తిగా వ్యవహరించే మంత్రే కరవు అయ్యారు. తాజాగా విస్తరణలోనూ ఏదో ఒనగూడుతుందనుకోలేదు. కానీ కేంద్రం మాత్రం ఏపీలో తమకు రాజకీయ స్టేక్స్ లేవని తేల్చి చెప్పేసింది. అందుకే భారీ విస్తరణలోనూ పంగనామాలు పెట్టేసింది.

కంటితుడుపు…

మాజీ ఎంపీ కంభం పాటి హరిబాబు కు మిజోరం గవర్నర్ గా నియమించారు. ఏపీలో ఎవరూ ఏమీ అనుకోకుండా, ప్రత్యేకించి బీజేపీ వర్గాల కన్నీళ్లు తుడవటానికి ఈ పదవిని కట్టబెట్టారు. గవర్నర్ హోదా రాజ్యాంగ బద్ధ పదవే తప్ప రాష్ట్రానికి ఒనగూడేది ఏమీ ఉండదు. పరాయి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు పని చేసుకుంటూ పోతుండాలి. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా, వ్యక్తిగత నజరానాగానే గవర్నర్ హోదాను చూడాలి. అదే కేంద్రమంత్రి పదవి అయితే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఇతర మంత్రులతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఒక మంత్రి హోదాలో సహచరుడు కోరుతున్నాడు కాబట్టి సానుకూలత ఉంటుంది. అవసరమైతే కేబినెట్ లోనూ చర్చించి రాష్ట్రానికి అన్యాయం జరగకుండా , కొంచెం మేలు జరిగేలా చూసుకోవచ్చు. రాష్ట్రానికి , కేంద్రానికి మధ్యవర్తిత్వ పాత్రగా ఉపయోగపడుతుంది. ఇటువంటి గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఇక రాష్ఠ్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉంటుంది. ఈ విషయంలో మన వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎంతగొప్పటి పనితీరు కనబరుస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పార్టీకి సంబంధించిన అంశాలు మినహా రాష్ట్రం ప్రగతి, ప్రయోజనాల వంటి విషయాలు పూచిక పుల్లపాటి వారికి పట్టడం లేదు.

నోరెత్తని నేతలు..

బీజేపీ పేరు చెప్పి విమర్శించడానికే ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సాహసించడం లేదు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల వైపు వేలెత్తి చూపడానికే వణికిపోతున్నారు. అందుకే రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు కావడం లేదు. రావాల్సిన పథకాలూ కొండెక్కుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వంటి అగ్రనాయకులందరూ బీజేపీపై సీరియస్ గానే విమర్శలు చేస్తున్నారు. అవసరమైనప్పుడు ప్రదానమంత్రిని కూడా దుయ్యబడుతున్నారు. ఏపీలో బీజేపీ పెద్ద శక్తి కాదు. అయినా రాష్ట్ర వైసీపీ, టీడీపీ అగ్ర నాయకులు కేంద్ర పెద్దల పట్ల వినయవిధేయతలు ప్రకటించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. కేంద్రానికి మద్దతు ఇస్తామంటూ టీడీపీ మహానాడులో తీర్మానాలు చేస్తోంది. కేంద్రం తో తగవు పెట్టుకోము. వినతులు, అభ్యర్థనలే ఉంటాయంటూ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నారు. వీరి బలహీనతే కేంద్రానికి అలుసుగా మారింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులకు సైతం పెద్దగా పదవులు దక్కలేదు. అవసరానికి వాడుకునే కరివేపాకు మాదిరిగానే తమ బలం పెంచుకోవడానికే వారిని స్వీకరించింది. సభ్యత్వం ముగిసిన తర్వాత పక్కన పెట్టేస్తోంది.

కర్ణాటకకే కానుకలు.. .

కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు, దక్షిణాదికే అన్యాయం జరిగింది. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకను మాత్రం కరుణించారు. నాలుగు పదవులు కట్టబెట్టారు. తెలంగాణలో కిషన్ రెడ్డికి పదోన్నతి ,ప్రేమ కాదు. ఆ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల అవకాశాలకు ఉపయోగపడతాడనే ముందస్తు ఎత్తుగడ. తమిళనాడు మురుగన్ కు మొహమాటపు పదవి తప్పలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమ కు అన్యాయం జరిగితే గొంతెత్తి ప్రశ్నించే తత్వం ఆ రాష్టానికి ఉంది. అందువల్ల చెప్పుకోవడానికి , సర్దుబాటుకు ఒక మంత్రిపదవి దయ చేశారు. కేరళ లో ఆశలు ఎలాగూ అడుగంటిపోయాయి. తమ ప్రాబల్యం ఎక్కువున్న రాష్ట్రాలకే పెద్ద పీట వేసుకుంది కేంద్ర నాయకత్వం. ఉత్తరప్రదేశ్; మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి వాటికి అగ్ర స్థానం దక్కింది. బిహార్, డిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సైతం నైష్పత్తికంగా తమ ప్రాదాన్యాన్ని కాపాడుకోగలిగాయి. ఎటొచ్చీ అటూ ఇటూ కాకుండా పోయినవి దక్షిణాది ప్రాంతాలే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News