జరుగుతుంది అంతా వైసీపీ మంచికేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పాత్రను తోసిపుచ్చలేం. తాజాగా మతం సైతం కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో మైనారిటీ, మెజారిటీ పేరిట పాలిటిక్స్ నిన్నామొన్నటివరకూ [more]

Update: 2020-09-24 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పాత్రను తోసిపుచ్చలేం. తాజాగా మతం సైతం కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో మైనారిటీ, మెజారిటీ పేరిట పాలిటిక్స్ నిన్నామొన్నటివరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. కానీ తాజా పరిణామాలు రాజకీయ రంగు పులుముకోవడం, వాటికి అత్యంత ప్రాధాన్యం, ప్రాచుర్యం లభించడంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఈ రెండు అంశాల మధ్య బందీగా మారుతుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ఇది చేటు కలిగించే అంశంగానే చూడాలి.

బీజేపీకి బంగారం లాంటి చాన్స్ …

రాష్ట్రంలో కొన్నిచోట్ల రథాలు దగ్ధం, విగ్రహాలు మాయం కావడం, ధ్వంసం కావడం, సింహాల ప్రతిమలు మాయం అవ్వడం వంటి ఘట్టాలు ఉద్దేశపూర్వకంగా కొందరు చేసిన దుశ్చర్యలుగా చూడవచ్చు. లేదంటే సంఘ విద్రోహ శక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నిన కుట్రగానూ అర్థం చేసుకోవచ్చు. నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. బలహీనవర్గాల్లో భాగమైన ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ఓటింగు లో అధికశాతం వైసీపీ ఖాతాలోకే వెళుతున్నాయని గడచిన రెండు ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న వైసీపీ తిరుగులేని మెజార్టీని సాధించడంలోనూ ఆయా వర్గాలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ ఓటు బ్యాంకు ఎటూ చెదరదు. అందువల్ల ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికి కమలం పార్టీ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సమస్యల అజెండా చుట్టూ బీజేపీ తన ఆందోళనలను కేంద్రీకరించింది. ప్రతిపక్ష పాత్రను ఆమేరకు సమర్థంగా నిర్వర్తించింది. మతపరమైన అంశాలను అప్పుడప్పుడూ లేవనెత్తినప్పటికీ ప్రధానమైన అజెండాలో భాగం కాలేదు. కానీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ప్రభుత్వ పరమైన అంశాల్లో లోపాలు, కార్యక్రమాల అమలులోని అవకతవకలపై దృష్టి తగ్గింది. బీజేపీ కోర్ అజెండా ఆంధ్రప్రదేశ్ లో పట్టాలకెక్కింది. సాగుతున్న పరిణామాలను చాకచక్యంగా తనకు అనుగుణంగా మలచుకుంటోంది బీజేపీ.

బేలగా మారిన టీడీపీ…

తెలుగుదేశం పార్టీ రెండు వైపులా దాడికి గురవుతోంది. ఒకవైపు ప్రభుత్వం టీడీపీ మూలాలను కుదిపేయాలని చూస్తోంది. ప్రజాప్రతినిధులు, బలమైన నాయకులను ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ తన అజెండాతో టీడీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. ఆపార్టీ కి చెందిన మెజార్టీ ఓటర్లు ఐడియాలజీ పరంగా బీజేపీకి దూరం. దాంతో అధికారపార్టీ ఓటు బ్యాంకు భద్రం. బీజేపీ బలపడాలంటే తెలుగుదేశం ఓట్లను చీల్చాల్సిందే. ఇంతవరకూ రాష్ట్రంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి కులపరమైన విభజన. అధికార, ప్రతిపక్షాలకు కొన్ని కులాలు మద్దతుగా నిలుస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఈ చీలిక ఉన్నప్పటికీ మెజార్టీ వర్గాలు తటస్థంగా ఉంటున్నాయి. వెనకబడిన తరగతులు ఇందులో ప్రధానమైనవి. ఆయా వర్గాలను టీడీపీ తన మద్దతు దారులుగా క్లెయిం చేస్తోంది. కులాలపరంగా బలమైన సంఘటిత సమీకరణ లేని ఈ వర్గాలను ప్రస్తుతం బీజేపీ తన లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ కాసింత కళ సంతరించుకునే అవకాశం ఉంది. ఈ స్థితిలో తన ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో కమలం పార్టీ అజెండాను తలపైకి ఎత్తుకునేందుకు సైతం టీడీపీ సాహసిస్తోంది. కానీ బీజేపీ దూకుడు ముందు తెలుగుదేశం పార్టీ వెలవెల బోతోంది.

వైసీపీకి డబుల్ ధమాకా…

రాష్ట్రంలో మతపరమైన అంశాలు కొంత ఉద్రిక్తతకు దారి తీస్తున్నప్పటికీ బీజేపీ, టీడీపీల పోటాపోటీ ఆందోళనల్లో వైసీపీకి ఉపశమనం లభిస్తోంది. అంతర్వేది సంఘటన విషయంలో సకాలంలో ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణకు పూనుకోవడంతో విషయం తీవ్రస్థాయికి చేరకుండా చల్లారిపోయింది. అదే విధంగా రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని బలహీనపరచడానికి బీజేపీ చక్కగా ఉపయోగపడుతోంది. సొంత అజెండాతో టీడీపీ ఓటు బ్యాంకుకి బీజేపీ చిల్లుపెడుతోందని వైసీపీ విశ్వసిస్తోంది. వైసీపీకి 2019 ఎన్నికల్లో లభించిన విస్తృత మద్దతులో కొంత తేడా వచ్చినప్పటికీ తిరుగులేని శక్తిగానే రాష్ట్రంలో ఉంటుంది. టీడీపీ, బీజేపీ – జనసేన కూటములు పరస్పరం ఓట్లను చీల్చుకుంటాయని అంచనా . దీంతో తనతో పోటీ పడే ప్రత్యర్థి ఎవరైనా తన దరిదాపులకు రారని అధికారపార్టీ ధీమాగా కనిపిస్తోంది. అందుకే బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకుండా వైసీపీ సంయమనం పాటిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో కమల వికాసానికి పరోక్షంగా అధికారపార్టీ నుంచి అండదండలు అందుతున్నాయనుకోవచ్చు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News