ఆ నేతకు జగన్ బంపర్ ఆఫర్

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు టిడిపి జండా పీకేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తో రహస్య మంతనాల అనంతరం వైసిపి లో [more]

Update: 2019-09-10 15:30 GMT

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు టిడిపి జండా పీకేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తో రహస్య మంతనాల అనంతరం వైసిపి లో చేరే తేదీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఆదివారమే అనధికారికంగా తోట పార్టీ మారే నిర్ణయం తీసుకున్నా కొన్ని లాంఛనాల కోసం తోట త్రిమూర్తులు ముహూర్తం సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం కావడం వారి చేత జై జగన్ అనిపించుకోవడం, ఏ పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వస్తుందో చెప్పడం వంటి అంశాలు కి కొంత సమయం కావాలని జగన్ తో భేటీలో కోరినట్లు సమాచారం. దానితో బాటు భారీ అనుచరగణంతో టిడిపి నుంచి వైసిపి లోకి చేరాలన్న ఆలోచనతోనే తోట త్రిమూర్తులు చిన్న బ్రేక్ తీసుకున్నట్లు అనుచరులు అంటున్నారు.

స్థానికంగా ఆందోళన …

తోట త్రిమూర్తులు రావడం పక్కా అని తేలిపోయాక రామచంద్రపురం నియోజకవర్గంలోని వైసిపి శిబిరంలో ఆందోళన నెలకొంది. పార్టీలో తమ సీనియారిటీకి ఇక గుర్తింపు ఉండదేమో అన్న బెంగ వారిని వెంటాడుతుంది. సిట్టింగ్ ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ అనుచర వర్గంలో మరింత అలజడి రేగుతుంది. నియోజకవర్గ రాజకీయాల్లో ఆధిపత్య పోరు తప్పక పోవొచ్చని పార్టీ శ్రేణుల్లో చర్చలు మొదలయ్యాయి. పదవిలో వున్నా లేకపోయినా తన మాటతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే తోట త్రిమూర్తులు అధికారపార్టీలోకి అడుగు పెట్టాక పరిస్థితి ఎలా ఉంటుందో అని వారు సమాలోచనలు చేస్తున్నారు.

చిన్న బ్రేక్ అట…..

తోట త్రిమూర్తులకు జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారని టాక్. ప్రస్తుతం జిల్లా వైసిపి అధ్యక్షుడిగా వున్న కురసాల కన్నబాబు పై మంత్రి అయ్యాక బాధ్యతలు పెరిగాయి. ఆయన రెండు పదవులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ వేత్తగా తోట త్రిమూర్తులుకు కీలకమైన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను జగన్ ఇచ్చేందుకు అంగీకరించారని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గ నాయకులకే ఎక్కువగా అన్ని పార్టీలు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తూ వస్తున్నాయి. అప్పుడప్పుడు బిసి నేతలకు ఇచ్చినా ఎక్కువకాలం కాపు సామాజికవర్గ నేతలే జిల్లా అధ్యక్షులుగా వుంటూ వస్తున్నారు. అందువల్ల ఈక్వేషన్ల ప్రకారం తోట త్రిమూర్తులుకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీని పరుగులు పెట్టిస్తారని వైసిపి అధినేత భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే విజయ దశమి వరకు తోట త్రిమూర్తులు అధికారికంగా ఇంకా వైసిపి లో అడుగు పెట్టనట్లే.

Tags:    

Similar News