తోటపై కత్తి దూసిన పిల్లి… రీజన్ ఏమిటి ?

తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం పేరు వినపడగానే ఇద్దరి నేతల పేర్లే వినిపిస్తాయి. సీమ ఫ్యాక్షన్ తరహాలో ఇక్కడ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, [more]

Update: 2020-11-17 05:00 GMT

తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం పేరు వినపడగానే ఇద్దరి నేతల పేర్లే వినిపిస్తాయి. సీమ ఫ్యాక్షన్ తరహాలో ఇక్కడ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఎన్ని పార్టీలు మారినా పిల్లి బోస్ కి వ్యతిరేకంగా టికెట్ తెచ్చుకుని పోరాటం చేసేవారు తోట త్రిమూర్తులు. అయితే గత ఎన్నికల్లో వైసిపి రామచంద్రపురం టికెట్ చెల్లుబోయిన వేణుగోపాల్ కి ఇచ్చి మండపేట నియోజకవర్గం నుంచి పిల్లి బోస్ ని మార్చేశారు వైఎస్ జగన్. 2019 ఆ ఎన్నికల్లో త్రిమూర్తులు, వేణుగోపాల్ పై ఓడిపోవడం వైసిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి టిడిపి నుంచి తోట గోడదూకి వచ్చేయడంతో ఇక వర్గ విభేదాలు కుల విభేదాలు నియోజకవర్గంలో చల్లారిపోతాయనే అంతా అంచనా వేశారు.

బోస్ ను పక్కకు మార్చినా …

అధినేత జగన్ సైతం పార్టీ నేతలనడుమ విభేదాలు లేకుండా త్రిమూర్తులకు గౌరవం తగ్గకుండా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను తోటకు అప్పగించారు. అయితే పిల్లి బోస్ స్థానంలో ఉన్న చెల్లుబోయిన వేణు గోపాల్ వర్గానికి త్రిమూర్తుల వర్గాల నడుమ సఖ్యత కుదరలేదు. ఒక దశలో వేణు వర్గం పార్టీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి ముందే త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేయడం ఆ తరువాత త్రిమూర్తులు వర్గం ఆ వ్యక్తిపై దాడి చేయడం వంటి సంఘటనలు నియోజకవర్గంలో రాజకీయాలను శాంతిభద్రతల సమస్య దిశగా నడిపించాయి. ఆ తరువాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాల నడుమ వివాదాలు సద్దుమణిగేలా చేశారు.

బోస్ లేఖ తో ప్రకంపనలు …

ఇది కొంతకాలమే అన్నట్లు ఇప్పుడు నియోజకవర్గం వ్యవహారంలోకి ఏడాదిన్నరగా జోక్యం చేసుకొని పిల్లి బోస్ ప్రవేశించారు. ఆయన తోట పాత కేసును ఉన్నట్టుండి పైకి లాగారు. రెండు దశాబ్దాల క్రితం త్రిమూర్తులపై నమోదైన శిరోముండనం కేసు లో బాధితులు న్యాయస్థానంలో పోరాడే స్థాయిలో లేని బలహీనులని ఈ వ్యవహారంలో తోట ఏ వన్ గా వున్నారని రాష్ట్ర హోమ్ మంత్రి సుచరిత కు లేఖ రాయడం సంచలనం సృష్ట్టించింది. ఈ కేసులో దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బోస్ పేర్కొన్నారు. శిరోముండనం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చాలని త్రిమూర్తులు ప్రయత్నం చేస్తున్నారని న్యాయస్థానంలో ఈ కేసు ముందుకు సాగకుండా తన పలుకుబడితో అడ్డుకుంటున్నారని సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడ్డారు పిల్లి బోస్ .

స్పీడ్ అవుతున్న త్రిమూర్తులు …

రామచంద్రపురం లో ఎమ్యెల్యేగా, మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నా ఏ అధికార పదవిలో లేని తోట త్రిమూర్తులు తన హవా వెలగబెడుతున్నారు. తోట హవా ఇటీవల అన్ని వ్యవహారాల్లో పెరిగిపోవడంతో దీనిపై మెత్తగా వుండే వేణుగోపాల్ మౌనం గా ఉండటంతో తెరవెనుక ఇన్నాళ్లు అక్కడి రాజకీయాలను చూస్తున్న పిల్లి బోస్ స్క్రీన్ పైకి వచ్చేశారు. అంతర్గతంగా తేల్చుకోవాలిసిన అంశాలను ప్రతిపక్ష పార్టీలా బహిర్గతం చేసి అధిష్టానాన్ని ఇరుకున పెట్టారు. శిరోముండనం కేసు లో శిక్ష పడేలా చేస్తే తోట రాజకీయ జీవితం పూర్తి అవుతుందని రెండు దశాబ్దాలుగా బోస్ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా త్రిమూర్తులు ఈ కేసును చక్కగా మేనేజ్ చేస్తూ వస్తుండటంతో ఆయన హవా ఢోకా లేకుండా సాగుతుంది.

అధిష్టానంపై బోస్ గుస్సా … ?

దాంతో బాటు తనను మంత్రి నుంచి రాజ్యసభకు అధిష్టానం పంపించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయడం కూడా బోస్ కి నచ్చలేదని తెలుస్తుంది. దాంతో పార్టీలో తన పరపతిని ప్రత్యర్థికి రుచి చూపించాలని లేఖాస్త్రం సంధించారని తెలుస్తుంది. అయితే జగన్ దృష్టి లో బోస్ కి అత్యున్నత స్థానం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైఎస్ మరణం తరువాత తన మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకుని జగన్ కష్టాల్లో నడిచిన కొద్దిమంది నేతల్లో బోస్ ఒకరని అందుకే ఆయనకు చాలా విలువ ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బోస్ ఇప్పుడు లేఖ రాయడం ఈ వ్యవహారంలో తోట త్రిమూర్తులు, పిల్లి పోరాటంలో జగన్ ఎటువైపు అన్నది తేలిపోనుంది. దాంతో ఈ ఆసక్తికర లేఖ ఇప్పుడు తూర్పు గోదావరి లోనే కాదు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News