వీళ్ల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు.. వేస్టేనట

ఏపీ రాజ‌కీయాల్లో అనేక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్క‌డ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్కడ రాజ్యస‌భ స్థానాలు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. దీంతో ఇక్కడి [more]

Update: 2020-08-19 02:00 GMT

ఏపీ రాజ‌కీయాల్లో అనేక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్క‌డ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్కడ రాజ్యస‌భ స్థానాలు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రాంతీయ పార్టీల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న కీల‌క జాతీయ పార్టీలు ఒక‌టో అరో.. ఇక్కడ నుంచి టికెట్లు సొంతం చేసుకుంటున్నారు. అలా సొంతం చేసుకున్న స్థానాల‌ను రాష్ట్రేత‌ర నేత‌ల‌కు ఇచ్చి.. వారికి కీల‌క ప‌ద‌వులు అప్పగిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, అలా ఇక్కడ నుంచి కేంద్రం స్థాయిలో చ‌క్రం తిప్పుతున్నవారు ఏం చేస్తున్నార‌నేది ప్రధాన ప్రశ్న.

చంద్రబాబు కూడా…..

ఒక‌సారి గ‌తాన్ని చూస్తే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ధారిగా ఉన్న స‌మ‌యంలో టీడీపీకి ద‌క్కిన రాజ్యస‌భ స్థానాల్లో ఒక‌టి.. బీజేపీ తీసుకుంది. ఈ క్రమంలోనే మ‌న రాష్ట్రానికి సంబంధం లేని సురేష్ ప్రభుకు చంద్రబాబు పిలిచి మ‌రీ రాజ్యస‌భ‌ సీటును అప్పగించారు. దీంతో ఆయ‌న కేంద్రం రైల్వే మంత్రి అయ్యారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఆయ‌న ఏపీకి చేసింది ఏమైనా ఉందా? అనేది ప్రశ్నే. క‌నీసం న‌ర‌సాపురం -కోటి ప‌ల్లి రూటును ఏర్పాటు చేస్తాన‌ని చెప్పి కూడా ఆయ‌న సంత‌కం చేయ‌లేక పోయారు. అస‌లు సురేష్ వ‌ల్ల ఏపీకి ఒరిగింది ఎంత మాత్రం లేద‌నే చెప్పాలి.

నిర్మలమ్మ ఉన్నా నిరుపయోగమే…..

ఇక గ‌తంలో నిర్మలా సీతారామ‌న్ కూడా ఏపీకి చెందిన వారే. న‌రేంద్ర మోడీ తొలి ప్రభుత్వంలో నిర్మలా సీతారామ‌న్‌ మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, ఆ స‌మ‌యంలో ఆమె కూడా ఏపీకి చేసింది ఏమైనా ఉందా? అంటే సందేహమే. త‌మిళ‌నాడు మూలాలు ఉన్నా ఆమె మ‌న ఏపీకి కోడ‌లే. ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంకు చెందిన ప‌ర‌కాల ప్రభాక‌ర్‌ను ఆమె వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మోడీ రెండు కేబినెట్లలో ఆమె కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా ఉన్నా ఆమె వ‌ల్ల ఏపీకి ఒరిగిందేమీ లేదు.

నత్వానీపై కూడా ఆశల్లేవ్…..

ఇక‌, ఇప్పుడు ఏకంగా మ‌హారాష్ట్రకుచెందిన ప‌రిమ‌ళ్ న‌త్వానీ కూడా ఏపీ నుంచి రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యారు. స‌హ‌జంగానే పారిశ్రామిక‌వేత్త అయిన ఆయ‌న ఏపీకి ఏదో చేస్తార‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. నిజానికి ఇప్పుడు కేంద్రంపై పోరాడాల్సిన అవ‌స‌రం ఏపీ ఎంపీల‌కు ఎంతో ఉంది. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ కానీ, చంద్రబాబు కానీ.. ఇత‌ర రాష్ట్రాల‌ నేత‌ల‌కు టికెట్లు ఇస్తున్నారు. అయితే, వీరు మాత్రం టికెట్ తీసుకునేట‌ప్పుడు ఉన్న శ్రద్ధ త‌ర్వాత చూపించ‌డం లేదు. మ‌రి ఇప్పుడు ప‌రిమ‌ళ్ న‌త్వానీ వంతు వ‌చ్చింది. ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News