ఏడుకొండల సామీ… ఎలా ఉన్నావయ్యా?

నిత్యం డెబ్భయి వేల మంది భక్తులు.. మాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగుతుంటాయి. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే తిరుమలలో భక్తుల సందడి కన్పిస్తుంటుంది. [more]

Update: 2020-04-11 18:29 GMT

నిత్యం డెబ్భయి వేల మంది భక్తులు.. మాడ వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగుతుంటాయి. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే తిరుమలలో భక్తుల సందడి కన్పిస్తుంటుంది. అలాంటి తిరుమల ఇప్పుడు భక్తులు లేక వెలవెల పోతోంది. గత పక్షం రోజుల నుంచి తిరుమల భక్తులు లేక వెలవెల పోతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో లాక్ డౌన్ విధించారు. గత నెల 22వ తేదీన ఒక భక్తుడికి కరోనా సోకిందన్న అనుమానంతో భక్తులను తిరుమలలోకి రానివ్వకుండా టీటీడీ ఆంక్షలు విధించింది.

రెండు నుంచి మూడు కోట్లు…

తిరుమల శ్రీవారి ఆదాయం రోజుకు రెండు నుంచి మూడు కోట్ల వరకూ ఉంటుంది. భక్తులు నగదు రూపంలో సమర్పించేది ఇది. ఇవి కాకుండా బంగారు, వెండి ఆభరణాలు స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించుకుంటారు. నిత్యం రద్దీతో కన్పించే ఏడుకొండల వాడి చెంతకు చేరే ఘాట్ రోడ్లన్నీ మూసివేశారు. కేవలం పూజారులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్వామి వారికి ఏకాంత పూజలు నిర్వహిస్తున్నారు. అర్చకులను సయితం షిఫ్ట్ ల వారీగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

స్వామికి ఏకాంత సేవలే…..

భక్తులు లేకపోవడంతో కేవలం శ్రీవారి ఆదాయం మాత్రమే కాదు స్థానికులు సయితం ఉపాధి కోల్పోయారు. భక్తులు లేకపోవడం, లాక్ డౌన్ విధించడంతో స్థానికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని తిరుపతికి కూడా రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇప్పుడు తిరుమల కొండల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఇక రోజుకు 70 నుంచి 80 వేల మందికి అన్నప్రసాదాలను అందించే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంకూడా బోసిపోయి కన్పిస్తుంది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా…..

ఇక తిరుమల లడ్డూ అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. రోజుకు దాదాపు మూడు లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఇప్పుడు స్వామి వారి ప్రసాదంగా పదుల సంఖ్యలోనే లడ్డూల తయారీ జరుగుతుంది. ఇలా తిరుమల మొత్తం బోసిపోయినట్లు కన్పిస్తుంది. తిరుమల చరిత్రలో ఇలాంటి రోజులు ఎప్పుడూ లేవంటున్నారు. ఇక రాకూడదని ఆ వేంకటేశ్వరుడికి మొక్కుకుంటున్నారు. తిరుమల లాక్ డౌన్ కావడంతో వేలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు.

Tags:    

Similar News