మూడు ..ముగింపు కాదు.. ముచ్చెమటలు పడుతున్నాయ్

మూడోసారి విధించిన లాక్ డౌన్ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విధి విధానాల సంగతి పక్కనపెడితే మళ్లీ పధ్నాలుగు రోజులు అన్న సంగతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. [more]

Update: 2020-05-02 16:30 GMT

మూడోసారి విధించిన లాక్ డౌన్ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. విధి విధానాల సంగతి పక్కనపెడితే మళ్లీ పధ్నాలుగు రోజులు అన్న సంగతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇది తప్పదు, అనివార్యం అంటూ ఎన్ని రకాలుగా సమర్థించుకోవడానికైనా చూడవచ్చు. కానీ అది మన బలహీనతనే బయట పెడుతోంది. కోట్లాది మంది భవిష్యత్తు ఏం కాబోతోందనే ఆందోళన ఒకవైపు మొదలైంది. రెడ్ జోన్లు, గ్రీన్ జోన్లు, ఆరంజ్ జోన్లు అంటూ అందమైన పదాలతో చక్కగా మార్గదర్శకాలు కనిపిస్తాయి. వీటన్నిటికంటే అతీతమైనది ఆకలి. దేశంలో నలభై కోట్ల మంది ఉపాధి కోల్పోతే , దిగువ మధ్యతరగతి నుంచి పేదరికానికి దిగజారిపోతే ఆదుకొనేదెవరంటే జవాబు దొరకదు. మొదటిసారి లాక్ డౌన్ విధించిన సందర్భంలో స్వచ్ఛందంగా కష్టనష్టాలు భరించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. రెండోసారి సైతం నిట్టూర్పులతోనే ఓపిక పట్టారు. మళ్లీ మూడోసారి అనేటప్పటికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈసారి గతంలో లాక్ డౌన్ ల తరహాలో స్వచ్ఛందంగా ప్రజలు సహకరిస్తారా? అంటే సందేహమే. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే అలసిపోయారు. ప్రభుత్వం తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించగల సత్తా సంతరించుకోకుండా ప్రజలను శిక్షకు గురి చేస్తోందనే వాదన బలం పుంజుకొంటోంది.

తట్టుకోగలరా..?

కరోనా దెబ్బ ప్రజలకు పరీక్షగా మారింది. ప్రజల జీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. భారత దేశంలో కొంత పొదుపు సంస్కృతి ఉండబట్టి మధ్యతరగతి ప్రజలు తట్టుకోగలిగారు. ఈ పొడిగింపుతో వారి జీవనస్థితిగతులు కూడా దారుణంగానే మారతాయి. మధ్యతరగతిలో ఎక్కువమంది చిన్నాచితకా ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవారంగాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రజల్లో ప్రస్తుతం కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించింది. పర్యాటక, నిర్మాణ, ఆతిథ్య రంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఇవి కోలుకోలేవు. వీటిపైన ఆధారపడిన కోట్లాదిమంది ప్రజలు ప్రత్యామ్నాయాలను వెదుక్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించే బియ్యం, పప్పు వంటివి నామమాత్రపు సహకారమే తప్ప ఏమాత్రం దీర్ఘకాలానికి భరోసానిచ్చే చర్యలు కావు. ఉపాధి మార్గాలను రూపకల్పన చేసి ప్రభుత్వం ప్రజలకు బతికేందుకు తోవ చూపాల్సి ఉంటుంది. ఇంతవరకూ అటువంటి ఏర్పాట్లు సాగుతున్న దాఖలాలు లేవు. దేశంలో విస్తృత స్థాయిలో పరీక్షలు చేసి నివారణ చర్యలు తీసుకునేందుకు సైతం పక్కగా భారత్ తయారు కాలేదు. ప్రయివేటు ఉద్యోగాలు తీయవద్దు. వారికి పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వండంటూ కేంద్రం సుద్దులు చెబుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలే కోతలు విధిస్తున్నాయి. కార్మికులను పోషించాల్సిన బాధ్యత ఉన్న పరిశ్రమలకు, సంస్థలకు ఏమేరకు ప్రయోజనం కల్పిస్తారో కేంద్రం ప్రకటించడం లేదు. లాక్ డౌన్ టైములో ఉద్యోగులకు జీతాల సంగతి దేవుడెరుగు. ఆయా సంస్థలు మూతపడకుండా ఉంటే చాలని సిబ్బంది కోరుకుంటున్నారు. నలభైరోజుల్లోనే ఇంతటి దుస్థితిని తెచ్చిపెట్టింది లాక్ డౌన్.

ప్రధాని మౌనం…

మొదటి రెండు సార్లు విధించిన లాక్ డౌన్ ను తప్పుగా ప్రజలు నిందించడం లేదు. కానీ అంతటి సుదీర్ఘకాలవ్యవధిలో దేశం ఎందుకు తయారు కాలేదు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి పక్కా ఆరోగ్య ఏర్పాట్లు దిశలో ప్రభుత్వం ఎందుకు సిద్ధం కాలేదన్నదే ప్రశ్న. ఇంతవరకూ కేసుల సంఖ్య విజృంభించకుండా ఓ మోస్తరుగా ఉండటానికి ప్రధాన కారణం ప్రజలే తప్ప ప్రభుత్వాల ఘనత ఏమీ లేదు. కోవిడ్ పరీక్షలే కాదు, ప్రజలకు అవసరమైన మాస్కులు, శానిటైజర్ల వంటి వాటిని సైతం అవసరమైన సంఖ్యలో అందించలేకపోతోంది. గోదాముల్లో మగ్గిపోతున్న ఆహారధాన్యాలను వెలికి తీసి పంపిణీ చేసేందుకు కూడా సాహసించడం లేదు. లాక్ డౌన్ లు లోపభూయిష్టంగానే అమలవుతున్నాయి. వలస కూలీల తరలింపుపై తొలిదశలోనే నిర్ణయం తీసుకుని వారి స్వగ్రామాల్లో క్వారంటైన్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్లు ఆయా గ్రామాల్లో చిన్నాచితకా పనులు చేసుకునేవారు. ఇప్పుడు రెండో దశ ముగింపులో వారిని స్వగ్రామాలకు తరలించారు. అదీ గుంపులు గుంపులుగానే తరలించింది. దీనివల్ల ప్రభుత్వం ఏం సాధించిందో ఎవరికీ తెలియదు. ఎంతో ఆర్భాటంగా తొలి రెండు లాక్ డౌన్లు ప్రకటించిన ప్రధాని మూడోసారి మాత్రం మౌనం వహించారు. తనకే మాత్రం సంబంధం లేదన్నట్లు హోం మంత్రిత్వశాఖతో ప్రకటింపచేశారు. ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకుని తనపైకి, పార్టీపైకి రాకుండానే ఈ జాగ్రత్త తీసుకున్నారనుకోవాలి. కానీ క్లిష్టమైన కాలంలోనే ప్రధాని ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. తొలి రెండు సార్ల కంటే ఈసారి కష్టాలెక్కువ. రెక్కలు తెగిన ఆర్థిక వ్యవస్థను, ఉపాధి చక్రాన్ని సరిచేసుకోవాలంటే శక్తిసామర్థ్యాలు చాలా అవసరం. ప్రభుత్వమందించే ఊతమేమిటో ప్రధానే చెప్పాలి. మీకేం పర్వాలేదు . నేను చూసుకుంటాననే భరోసానివ్వాలి.

తెలుగు లోగిళ్లు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనాకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఆంధ్రాలో మాత్రం పీక్ కు చేరుకుంటున్న వాతావరణం కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా విజృంభణలో ప్రభుత్వం తప్పేమీ లేదు. దాని పాత్ర కూడా పరిమితం. తొలి దశలోనే చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో స్వయంకృతాపరాధం కనిపిస్తుంది. తెలంగాణలో కనిపించినంతటి సీరియస్ నెస్ ఏపీలో కనిపించని మాట వాస్తవం. అయితే తాజాగా టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులూ పెరుగుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఒకవైపు పొరుగు రాష్ట్రం దాదాపు జీరో కి వస్తుంటే …. ఏపీలో పదుల సంఖ్యలో కొత్త కేసులొస్తున్నాయి. మరోవైపు ఇంకొక వాదన సైతం వినవస్తోంది. పవిత్ర మాసం కావడంతో తెలంగాణ ప్రభుత్వం కొంతమేరకు రిలీఫ్ కల్పించిందని కొందరు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని టెస్టులు చేయాల్సి రావచ్చు. అందువల్ల రెండు రాష్ట్రాలు ఇంకా కొంతకాలం అప్రమత్తంగా ఉండకతప్పదు. కరోనా నుంచి నష్టాలను పూడ్చుకోవడానికి ప్రజలకు భారతీయ జనతాపార్టీ నేతలు విలువైన పిలుపునిస్తున్నారు.

భారత్ కు భరోసా…

స్వదేశీ వస్తువులనే వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకుందామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఆచరణలో అది సాధ్యమా? చౌకగా దొరికే వస్తువులపై వెంటపడుతూ ఇప్పటికే చైనా ఉత్పత్తులకు భారత్ ను ప్రధాన మార్కెట్ గా చేసేశాం. మళ్లీ అదే పునరావృతం కాదని గ్యారంటీ ఇవ్వలేం. ప్రభుత్వాలే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను ఆకర్షించడంలో భారత్ వెనకబడిపోతోంది. లోపాలను అధ్యయనం చేసి దిద్దుబాటు చేసుకుంటే కనీసం రెండేళ్లలో అయినా తిరిగి నిలబడగలుగుతాం. లేకపోతే మళ్లీ మామూలే. రెండు మూడు యుద్ధాలు చేసిన తర్వాత ఎలా ఉంటుందో దేశం నడక ప్రస్తుతం అలాగే మొదలవుతుంది. అదీ కూడా లాక్ డౌన్ అనంతరం. ఈలోపు ఎలాగూ అప్పులు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు సంబంధించిన ప్రశ్నలు నిరంతరం వేధిస్తూనే ఉంటాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News