ప్రాబ్లం సాల్వ్ అయినట్లేనా..?

ఉత్తరాంధ్రలో సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం సింహాచలం. వేలాది ఎకరాలు దాతలు విరాళంగా ఇచ్చిన సింహాచలంలో భూ ఆక్రమణలు గతంలో జరిగాయి. అర్ధ శతాబ్దం పైగా పేదలు కొంత స్థలం [more]

Update: 2019-07-29 11:00 GMT

ఉత్తరాంధ్రలో సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం సింహాచలం. వేలాది ఎకరాలు దాతలు విరాళంగా ఇచ్చిన సింహాచలంలో భూ ఆక్రమణలు గతంలో జరిగాయి. అర్ధ శతాబ్దం పైగా పేదలు కొంత స్థలం ఆక్రమించుకుంటే, పెద్దలు, పెత్తందారులు అధిక భాగం సొంతం చేసుకున్నారు. అటువంటి సింహాచలంలో పంచ గ్రామాలన్నీ కూడా అప్పన్నస్వామి భూములతోనే ఏర్పాటు అయ్యాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఉండడం వల్ల వారి భూములను క్రమబధ్ధీకరించి ఇవ్వాలన్న ఆలోచన పాతికేళ్ల క్రితం వచ్చింది. దాని మీద ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 90వ దశకం చివర్లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆక్రమణదారుల భూములకు రేటు కట్టి ఆ నష్టపరిహారాన్ని దేవస్థానానికి జమ చేయాలనుకున్నారు. అయితే దేవుడి మాన్యాలు ఇలా కరిగించేసి అందరికీ దారాదత్తం చేస్తే చివరికి స్వామికి ఏమీ మిగలదని ఆధ్యాత్మిక వేత్తలు దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఈ వివాడం ఉండగా అనేక ప్రభుత్వాలు మారిపోయాయి.

తొలి క్యాబినేట్లో నిర్ణయం….

ఇదిలా ఉండగా చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా విశాఖ నిర్వహించిన మొదటి క్యాబినెట్ మీటింగులో సింహాచలం దేవస్థానం భూముల సమస్యలు ఓ పరిష్కారం కనుగొంటానని మాట ఇచ్చారు. అయితే ఆయన అయిదేళ్ళ కాలంలో కూడా ఎక్కడా దీని మీద చొరవ చూపలేకపోయారు. ఇపుడు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది ఈ భూముల విషయం తేల్చి బాధితులైన వారికి న్యాయం చేస్తామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. దానికి తగినట్లుగానే దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆద్వర్యంలో ఓ కమిటీని జగన్ సర్కార్ నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి సలహాదారు ఉంటారు. సింహాచలం దేవస్థానం ఈవో కన్వీనర్ గా వ్యవహరించే ఈ కమిటీ పంచ గ్రామాల సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 794 జీవోను జారీ చేసింది.

అందరికీ న్యాయం జరిగేనా….?

ఇదిలా ఉండగా గత ప్రభుత్వం అక్రమ నిర్మాణాల క్రమబధ్ధీకరించడం కోసం తీసుకువచ్చిన 12 ఆఫ్ 2019 చట్టంతో పాటు, 229, 232 జీవోలను, న్యాయస్థానంలో ఉన్న వాజ్యాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. జగన్ సర్కార్ ఏర్పాటైన వెంటనే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల పంచ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు తరాలుగా నలుగుతున్న సమస్య, ఎవరూ కూడా ఇది తమ ఆస్తి అని చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్న అతి ముఖ్యమైన సమస్య దీన్ని కనుక జగన్ ప్రభుత్వం పరిష్కరిస్తే ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు.

మూడు దశల్లో….

ఓ వైపు ఆధ్యాత్మిక వేత్తల తరఫున ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి సీఎం జగన్ ఎటూ సన్నిహితుడు కావడం వల్ల అటు వైపు నుంచి కూడా వ్యవహారం సెటిల్ చేసుకుంటే కోర్టులో పడిన వాజ్యాల వలల చిక్కులు తొలగిపోతాయని భావిస్తున్నారు. మరో వైపు మూడు దశలుగా ఈ సమస్యను పరిష్కరించాలని కమిటీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. మొదటి దశలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఊరటను ఇచ్చేలా క్రమబధ్ధీకరణ చేయడం, రెండవ దశలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, మూడవ దశలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు చేయలేని పనిని జగన్ కనుక చేస్తే అయిదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు శాశ్వతంగా వైసీపీ వైపే ఉంటారనడంలో సందేహమే లేదు.

Tags:    

Similar News