ఇక కలుసుకోలేరటగా

ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎంత స్నేహంగా ఉందామనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఎవరూ తగ్గరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2019-11-16 05:00 GMT

ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎంత స్నేహంగా ఉందామనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఎవరూ తగ్గరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల మధ్య అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికయ్యాక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్యగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ సయితం జగన్ ప్రమాణస్వీకారానికి హాజరై ఆశీర్వదించారు కూడా.

మూడుసార్లు భేటీ అయినా….

ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు మూడు సార్లు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా, గోదావరి, కృష్ణానీటి వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. అందుకు రెండు రాష్ట్రాల అధికారులు కూడా కొన్ని నమూనాలను రూపాందించారు. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి కూర్చుని చర్చలు ప్రారంభించడంతో రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. ప్రధానంగా 9,10 షెడ్యూల్ లోని అంశాలు సత్వరం పరిష్కారం అవుతాయని ఆశించారు.

సుప్రీంకోర్టులో అఫడవిట్ తో…..

హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయం, అసెంబ్లీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం ఇందులో భాగమేనని అనుకున్నారు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం ఒకరినొకరు విభేదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉందంటున్నారు. 9,10 షెడ్యూల్ లో ఆస్తుల పంపకానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలపడం ఇందుకు ఆజ్యం పోసిందనే చెప్పాలి.

ఆర్టీసీ కూడా ఒక కారణమా?

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వవద్దని కూడా పేర్కొంది. అంతేకాకుండా అపెక్స్ అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తుందని ఏపీ సర్కార్ పేర్కొంది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ సర్కార్ అక్కడ ప్రకటించడంతో ఇక్కడ అదే డిమాండ్ పై 40 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. దీనిపై కూడా కేసీఆర్ జగన్ వైఖరి పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద విభజన అంశాలు, జలవివాదలు కేసీఆర్, జగన్ ల మధ్య దూరం పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News