పరిటాల ఫ్యామిలీని గట్టిగానే గిల్లుతున్నారు ?

పరిటాల కుటుంబం అంటే అనంతపురం జిల్లాలో బాగా పేరుంది. రాజకీయంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ కుటుంబం తన ఉనికిని చాటుకుంటోంది. రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నా [more]

Update: 2020-12-20 12:30 GMT

పరిటాల కుటుంబం అంటే అనంతపురం జిల్లాలో బాగా పేరుంది. రాజకీయంగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆ కుటుంబం తన ఉనికిని చాటుకుంటోంది. రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నా పరిటాల ఫ్యామిలీ మీదనే టీడీపీ రాజకీయ సిరి ఆధారపడి ఉంది అంటారు. అనంతపురం జిల్లాలో ఎంతమంది నేతలు ఉన్నా పరిటాలా ఫ్యామిలీ ఇమేజ్ వేరు అన్నట్లుగా సీన్ ఉంటుంది. దానికి కారణం పరిటాల రవి నేపధ్యం. అతను ముందు నుంచి రాజకీయ నాయకుడు కాదు, నక్సలైట్ ఉద్యమంలో ఆయన పాలు పంచుకుని కొన్ని దశాబ్దాల పాటు పేద, బడుగు వర్గాలకు చేరువ అయ్యాడు. 1993 ప్రాంతంలో పరిటాల రవి జన జీవన స్రవంతిలోకి వచ్చాక ఎంచుకున్న పార్టీ టీడీపీ.

ఎన్టీయార్ కి ఇష్టుడిగా…..

ఆనాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. గెలుస్తామో లేదో కూడా తెలియని డోలాయమాన స్థితిలో పార్టీ ఉంది. లక్ష్మీ పార్వతీ ఎంట్రీతో టీడీపీలో మూడు ముక్కలాట సాగుతున్న రోజులవి. కానీ పరిటాల రవి మాత్రం టీడీపీనే తన రాజెకేయ వేదికగా ఎంచుకున్నారు. దానికి కారణం టీడీపీ సిద్ధాంతాలతో పాటు రవి ప్రత్యర్ధులు కాంగ్రెస్ లో ఉండడం కూడా. ఇక రవి వచ్చాక కకావికలు అయిన అనంతపురం జిల్లాలో టీడీపీ బలమైంది. ఎన్టీయార్ బంపర్ మెజారిటీతో మూడవసారి అధికారంలోకి రావడంతో పాటు గెలిచిన వెంటనే పరిటాల రవిని కార్మిక శాఖ మంత్రిని కూడా చేశారు. ఇక ఎన్టీయార్ కి వెన్నుపోటు జరిగిన ఎపిసోడ్ లో రవి ఆయన వెంటే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

పట్టు తగ్గిందా…?

ఇక 2004లో టీడీపీ ఓడిపోవడంతో కాంగ్రెస్ లో ఉన్న ఆయన ప్రత్యర్ధులకు పట్టు చిక్కింది అంటారు. అలా పరిటాల రవి 2005లో హత్యకు గురి అయ్యారు. ఆ తరువాత అనంతపురంలో కాంగ్రెస్ కూడా ముందుకు దూసుకు వచ్చింది. అయితే 2014 నాటికి విభజన ఏపీలో అనంతపురం జిల్లా తిరిగి టీడీపీకి నీరాజనాలు పలికింది. దాంతో వైసీపీకి అక్కడ ఆశలు నెరవేరలేదు. కానీ 2019 నాటికి చూస్తే మొత్తం బొమ్మ తిరగబడింది. రెండంటే రెండు సీట్లు మాత్రమే టీడీపీకి దక్కితే మొత్తానికి మొత్తం వైసీపీ గెలుచుకుంది. ఇక పరిటాల రవి రాజకీయ వారసుడు శ్రీరాం తొలిసారి పోటీ చేసినా కూడా ఓటమి పాలు అయ్యారు. దాంతో పరిటాల ఫ్యామిలీ కూడా చాన్నాళ్ళుగా సైలెంట్ అయింది.

హీట్ పెంచిన ఎంపీ …..

ఉన్నత పోలీస్ అధికారిగా అనంతపురం రాజకీయాలను దగ్గరుండి చూసిన గోరంట్ల మాధవ్ ఖాకీ చొక్కా తీసేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వస్తూనే జేసీ బ్రదర్స్ కి పెను సవాల్ అయ్యారు. జేసీ ఫ్యామిలీ గత ఎన్నికల్లో ఓడడానికి మాధవ్ ప్రధాన కారణం అన్న చర్చ ఉంది. ఇక ఇపుడు అదే మాధవ్ రెండవ పెద్ద పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్న పరిటాల రవి మీద గురి పెట్టారు. పరిటాల‌ రవి అనంతపురంలో రక్తపుటేరులు పారించారని మాధవ్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రవిది తలలు నరికే సంస్కృతి అయితే జగన్ ది పొలాలకు నీళ్ళు ఇచ్చే కల్చర్ అంటూ టార్గెట్ చేశారు.

భారీ వ్యూహమా…?

దీని మీద పరిటాల శ్రీరాం నుంచి గట్టి కౌంటరే పడింది. మాధవ్ మీద రేప్ కేసులు ఉన్నాయని ఆయన అంటున్నారు. ప్రతిగా మాధవ్ తాను ఎక్కడా తగ్గను అంటూనే తన మీద కేసులు ఒక్కటి ఉన్నట్లుగా నిరూపించమంటున్నారు. ఇకపై తాను ప్రెస్ మీట్లు పెట్టి మరీ వంద రక్త చరిత్రలను బయటకు తీస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాలు చూసిన వారికి పరిటాల రవి ఫ్యామిలీని కావాలనే ఎంపీ చేత వైసీపీ గిల్లిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. గతం కంటే టీడీపీ అనంతలో వీక్ అయింది. రవి తరువాత పవర్ తగ్గిన పరిటాల ఫ్యామిలీని ఇపుడే ఢీ కొట్టాలన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏదో వైసీపీకి ఉన్నట్లుంది అంటున్నారు. మరి శ్రీరాం తండ్రి రవి మాదిరిగా జిల్లా రాజకీయాల్లో సత్తా చూపుతారా లేదా అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News