ఆనందయ్య… రాజకీయ కామందయ్య.. ?

కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ కాదేదీ రాజకీయాలకు అతీతం అని నేతాశ్రీలు అంటారు. కరోనా వేళ కూడా ఖాతరు చేయని రంగం ఒక్కటే [more]

Update: 2021-06-07 05:00 GMT

కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ కాదేదీ రాజకీయాలకు అతీతం అని నేతాశ్రీలు అంటారు. కరోనా వేళ కూడా ఖాతరు చేయని రంగం ఒక్కటే ఉంది. అదే రాజకీయ రంగం. ఎక్కడ లాక్ డౌన్ అయినా అక్కడ నోటికి లాక్ లేదు. నాయకుల చురుకు తగ్గడంలేదు. అందుకే ఏదో ఒక దాని మీద పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ఇపుడు వారికి ఆనందయ్య కరోనా మందు ఒక సాధనం అయిపోయింది. ఆనందయ్య మందుకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ఇన్నాళ్ళూ గొడవ పెట్టిన వారు ఇపుడు ఆ మందును అమ్ముకోవడానికి కార్పోరేట్ శక్తులు దిగిపోతున్నాయని రచ్చ చేస్తున్నారు.

సవాళ్ళతో అలా …?

నెల్లూరు జిల్లా అంటే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ తరఫున ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉంటారు. ఆయనకు పోటీగా ధీటుగా వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి రెడీ అంటారు. ఈ ఇద్దరూ కలసి అనందయ్య మందుకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఆనందయ్య మందును వందల కోట్లకు అమ్ముకోవడానికి ఎమ్మెల్యే కాకాని మాస్టర్ ప్లాన్ వేశారు అంటూ సోమిరెడ్డి చెసిన కామెంట్స్ ఏపీలో కాక రేపాయి. ఇపుడు దాని మీద సోమిరెడ్డి పై పోలీసులు కేసులు పెట్టారు. ఇదంతా అవాస్తవమని ఆనందయ్య స్వయంగా చెబుతున్నా రాజకీయ రచ్చ ఆగడంలేదు.

ఆల్ పార్టీస్ లీడర్….

ఇక ఈ సమయంలో ఆనందయ్య గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన ఆల్ పార్టీలకు లీడర్ అని తెలుస్తోంది. ఆయనకు రాజకీయ వాసనలు చాలానే ఉన్నాయి. ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆనందయ్య స్వయంగా చెప్పుకున్నారు. తాను టీడీపీలో సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడినని కూడా తెలియచేశారు. ఆ తరువాత కాంగ్రెస్ లో ఉన్నానని, బీజేపీలో కూడా తనకు మిత్రులు ఉన్నారని, ఇక వైసీపీలో ప్రస్తుతం ఉన్నానని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆనందయ్యకు అందరూ మిత్రులే. ఆయన అందరి బంధువే. పైగా ఆయన కూడా ఈ రాజకీయాలు తనకు అలవాటే కానీ ప్రస్తుతానికి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి కరోనా మందు పంపిణీ మీదనే అందరూ దృష్టి ఉంచాలని ఆయన కోరుతున్నారు.

రంగంలోకి రెడీ …?

ఇదిలా ఉంటే రాజకీయాల్లో ఉంటూ పంచాయతీ పదవుల వరకే పరిమితమైన ఆనందయ్య కుటుంబం ఈసారి పెద్ద పదవులు కోరుకుంటుందా అన్న చర్చ అయితే ఉంది. ఆనందయ్యకు ఈ రోజు తిరుగులేని పాపులారిటీ వచ్చేసింది. పైగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వేళ మందు అంటూ ఒకటి ఉందని లోకానికి చాటి చెప్పిన ఆనందయ్య దేవుడిలాగానే కనిపిస్తున్నారు. దాంతో ఆయన్ని ఎవరూ వదిలేది లేదని కూడా అంటున్నారు. నెల్లూరు రాజకీయాల్లో ఆనందయ్యకు అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా గట్టి మద్దతుగా ఉన్నాయి. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. ఆయన పాపులారిటీని వాడుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడడం అన్నది కామన్. ఇక రాజకీయాలో ప్రవేశం ఉన్న ఆనందయ్య కుటుంబం కూడా చాన్స్ వస్తే వదిలేసుకుంటుందా అన్నదే చర్చ. ఇక ఆయన కూడా బలమైన బీసీ వర్గానికి చెందిన వారు. దాంతో ఆనందయ్య రాజకీయ కామందయ్యగా మారే రోజు దగ్గరలో ఉందా అన్నదే విశ్లేషణ.

Tags:    

Similar News