ది ఎండ్ అప్పుడేనట….?

పోలవరం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి . అందరూ అంగీకరించే సత్యమిది. కానీ రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్ మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు [more]

Update: 2020-10-26 15:30 GMT

పోలవరం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి . అందరూ అంగీకరించే సత్యమిది. కానీ రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్ మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు గా సాగుతోంది. రాష్ట్రం లో నెలకొన్న రాజకీయాలు మొదటికే మోసం తెస్తున్నాయి. బీజేపీ నేతృత్వం లోని కేంద్రం దోబూచులాట పొమ్మనకుండా పొగబెడుతోంది. తెలుగు దేశం, వైసిపి పరస్పర వినాశకర పాలిటిక్స్ ఫలితంగా ఇప్పటికే పూర్తీ కావాల్సిన ప్రాజెక్ట్ కొండెక్కి కూర్చుంది. అంచనాలు , ఆమోదాలు విషయం లో కేంద్ర ఆర్థిక శాఖ తాజా కొర్రీ తో సమస్య మొదటికి వచ్చింది. టిడిపి అంచనాలను పెంచేసిందని ఆరోపించిన వైసిపి కి ఇప్పుడు సెగ తగులుతోంది. అదే సమయం లో నిర్ణీత కాల వ్యవధి లో పని పూర్తీ కాకుండా కాల యాపన చేసిన తెలుగుదేశమూ పాపం లో భాగం మూటగట్టుకొంటోంది. ఈ రెండు పార్టీల రాజకీయాలు కేంద్రానికి వెసులుబాటు కలిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ బంధానికి గండి కొట్టిన కేంద్రం పోలవరాన్నీ అటక ఎక్కించే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు దక్షిణ భారతం లో తన బలం పెంచు కొనేందుకు పోలవరాన్ని ఎరగా చేసుకోవాలని కేంద్రం చూస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. రెండు మూడు సంవత్స రాలు గా నాన బెడుతూ వచ్చిన అంచనాలను తిప్పి కొట్టడం లో కచ్చితంగా బీజేపీ కి వ్యూహం ఉందంటున్నారు రాజకీయ వేత్తలు.

టీడీపీ స్వార్థం …

జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిన తర్వాత దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ టీడీపీ ప్రభుత్వం భుజాల పైకి ఎత్తుకుంది. ఈ విషయం లో కాంట్రాక్టులు, కమిషన్ లు కారణమనే విమర్శలు ఎదుర్కొంది . అయినప్పటికి ప్రాజెక్ట్ సకాలం లో పూర్తి కావాలంటే రాష్ట్రం శ్రద్ధ పెట్టడం తప్పు లేదని కొందరు సమర్థించారు. పోలవరం క్రెడిట్ బీజేపీ ఖాతా లో కి పోకుండా చంద్రబాబు నాయుడు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అది. ఆర్థిక వనరు గా దీనిని చూశారు . దీనికంటే ముఖ్యం గా పొలిటికల్ మైలేజ్ ని బాబు ఆశించారు. కేంద్రం లో మిత్ర పక్షం గా ఉండటం తో బీజేపీ సైతం సహకరించింది. కానీ పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడం లో టీడీపీ వైఫల్యం చెందింది. సోమవారం పోలవారం అంటూ ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత పనికి ఇవ్వలేదు. బస్సులు పెట్టి ప్రజలను సందర్శకులు గా మార్చి పోలవరాన్ని యాత్రా స్థలం గా మార్చారు. ప్రాజెక్ట్ కావాలంటే టీడీపీ ని మళ్ళీ గెలిపించాలని భావనను ప్రజల్లోకి పంపాలని అప్పటి ప్రభుత్వం ఆశించింది. మరో వైపు సొమ్ము తనది కాదు కాబట్టి నిర్మాణ వ్యయం సహా పునరావాస పరిహారాన్ని ఇబ్బడి ముబ్బడి గా పెంచేసింది. అప్పట్లో నోరు మెదపని కేంద్రం తాజా గా కొర్రీలు వేయడం ద్వారా తన మనోగతాన్ని చాటి చెప్పింది. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల మధ్య మళ్ళీ చర్చలు జరపక తప్పని అనివార్యత తలెత్తింది.

వైసిపి కి ఇరకాటం …

గతం లో ఏమి జరిగిందనేది పక్కన పెడితే వైసిపి సర్కార్ కి ఇది విషమ సమస్య. తెచ్చి పెట్టుకున్న కొరివి. ప్రాజెక్ట్ ల పునస్సమీక్ష , రీ టెండర్ల పేరిట టీడీపీ నిర్ణయాలను తిరగ దోడేందుకు శ్రీకారం చుట్టింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ గా కమీషన్లు కొట్టేశారని నిరూపించడమే ఈ రీ టెండర్ల లక్ష్యం. అదే విధంగా పోలవరం విషయం లో నూ కొంత మిగులు చూపించారు. టీడీపీ హయాం లో నిర్మాణానికి 25 వేల కోట్లు, పునరావాసానికి 33 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. వైసిపి దీనిని మొత్తం గా 50 వేల కోట్ల లోపు నకు సవరించింది. దీనిని సాకు గా తీసుకుంటూ కేంద్రం లో ని ఆర్ధిక శాఖ మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని చర్చకు పెట్టింది. 2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామంటూ మెలిక పెట్టింది. ఈ నిర్ణయం పై కేంద్రం వెనక్కి తగ్గక పొతే పోలవరానికి శరాఘాతమే. మొత్తం వ్యయం లో 25 వేల కోట్ల పై చిలుకు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి లో అది సాధ్యం కాదు. 2014 లో జాతీయ హోదా ఇచ్చి తాము నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం చేపట్టింది కాబట్టి పెరిగిన వ్యయం తో తమకు సంబంధం లేదని కేంద్రం బుకాయిస్తోంది. తగుదునమ్మా అంటూ ఒప్పుకున్నందుకు ఈ ప్రాజెక్ట్ భారం రాష్ట్రం తలకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది.

జగన్ ని లొంగ దీసేందుకేనా ….?

ఇటీవల రాజకీయంగా విస్తృత చర్చ నడుస్తోంది. జాతీయం గా ఒకరొకరు గా మిత్రులను కోల్పోతున్న బీజేపీ దక్షిణాదిన బలమైన కొత్త పొత్తు కోసం ఎదురు చూస్తోంది. వైసిపి ని కలుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే తన ఓటు బ్యాంక్ కి పూర్తీ భిన్నమైన బీజేపీ తో సైద్ధాంతికంగా కలవడం జగన్ కు ఇష్టం లేదు. అన్ని విషయాల లో ను కేంద్రానికి మద్దతు ఇస్తోంది వైసిపి . కానీ పొత్తు కు మాత్రం సుముఖం గా లేదు. పోలవరం ప్రాజెక్ట్ వైసిపి కి సైతం ప్రతిష్టాత్మకమే. దీనిని పూర్తీ చేయకుండా ఎన్నికలకు వేళ్ళ లేదు. దాంతో టెక్నికల్ కారణాల తో ప్రాజెక్ట్ ని ముడిపెట్టి వైసిపి దిగివచ్చేలా కేంద్రం అలియాస్ బీజేపీ ఎత్తుగడ వేస్తోందేమో అనే అనుమానాలు నెలకొంటున్నాయి. అదే నిజమైతే పోలవరం సాకారం కావాలంటే వైసిపి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న మాట. జగన్ దిగి వచ్చే వరకు చర్చ లు. సాంకేతిక కారణాలు, ఆర్ధిక కోణాలు మాత్రమే కనిపిస్తాయి. చిట్టచివరకు రాజకీయ నిర్ణయమే ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలకాల్సి ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News