అందరి చూపూ అక్కడే.. మార్పు అక్కడి నుంచే?

ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు అన్న మాట వినిపిస్తే చాలు అందరి చూపు ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదనే పడుతోంది. ఇక్కడ తీర్పుతోనే ఏపీ [more]

Update: 2021-02-03 06:30 GMT

ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు అన్న మాట వినిపిస్తే చాలు అందరి చూపు ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదనే పడుతోంది. ఇక్కడ తీర్పుతోనే ఏపీ రాజకీయాలు 2019 తారు మారు అయ్యాయి. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ ఎన్నికల్లో జనాలు రివర్స్ గేర్ లో సైకిల్ కి బ్రేకులేశారు. దాంతో ఓడినా కూడా 23 సీట్లతో దారుణమైన అవమానాన్ని టీడీపీ మూటకట్టుకోవాల్సివచ్చింది. మరి ఇపుడు దాదాపుగా రెండేళ్లకు దగ్గర కావస్తోంది. ఉత్తరాంధ్రలో ఏమైనా మార్పు కనిపిస్తోందా అన్నదే అంతటా చర్చ.

ఊపిరి అదేగా…?

గత ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిన ఉత్తర కోస్తా జిల్లాలలో అమరావతి రాజధాని ఉద్యమ ఫలితంగా రెండు జిల్లాల్లో టీడీపీ మెల్లగా పుంజుకుంది అంటున్నారు. ఇపుడు టీడీపీ ఆలోచనలు అన్నీ కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల మీదనే తిరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో కనుక కదలిక వస్తే చాలు సైకిల్ పరుగులు తీయడం ఖాయమని అని అంచనా వేసుకుంటున్నారు. ఈ మూడు జిల్లాలు కలుపుకుని 34 అసెంబ్లీ సీట్లు ఉండడమే కారణం. దాంతో సగం ఏపీలో బలం పెరిగితే వైసీపీని గట్టిగానే ఢీ కొట్ట‌గలమని కూడా టీడీపీ లెక్కలు వేసుకుంటోంది.

అదే టార్గెట్ గా…

ఇక విశాఖను రాజధానిగా చేస్తాను అంటూ జగన్ ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశారు. మరి దాని మీద జనాభిప్రాయం ఎలా ఉందో లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుంది అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రవాసులు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదని టీడీపీ తమ్ముళ్ళు గట్టిగా ఊదరగొడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ద్వారా అది రుజువు చేస్తారని కూడా వారు అంటున్నారు. దీంతో ఎలాగైనా వైసీపీని ఈ మూడు జిల్లాల్లో ఓడించాలంటూ చంద్రబాబు నుంచి తమ్ముళ్ళకు గట్టిగానే ఆదేశాలు వెళ్లాయి. ఒకసారి కనుక వైసీపీ ఓడితే ఇక రాజధాని ప్రసక్తి ఉండదని కూడా అంటున్నారు.

వైసీపీకి ప్రతిష్టగానే…

వైసీపీ విషయానికి వస్తే విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2019 నాటి బలాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం. అదే సమయంలో టీడీపీకి జనం మద్దతు లేదని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ మీద ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక టీడీపీ తలెత్తుకుని నిలబడితే రేపటి రోజున జగన్ కలల రాజధాని విశాఖకే గండి పడుతుంది అని కూడా వైసీపీలో ఆందోళన రేగుతోంది. దాంతో పాటు వైసీపీకి కూడా పై నుంచి బాగానే ఆదేశాలు వచ్చాయి. మూడు జిల్లాల్లో ఫ్యాన్ గిర్రున తిరగాల్సిందే అంటున్నారు. ఈ క్రమంలో అవసరం అయితే జగన్ తో భారీ బహిరంగ సభను ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడానికి కూడా వైసీపీ వ్యూహకర్తలు రెడీ అవుతున్నారు. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ ని పదమూడు కాదు మూడు జిల్లాలే తేల్చేస్తాయి అంటున్నారు.

Tags:    

Similar News