కారణం ఇకనైనా తెలిసొచ్చిందా…?

యాదృచ్ఛికమో… ఏమో తెలియదు కాని 23వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి అదే తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకోవడం ఇప్పుడు కన్నడనాట హాట్ టాపిక్ [more]

Update: 2019-07-23 16:30 GMT

యాదృచ్ఛికమో… ఏమో తెలియదు కాని 23వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి అదే తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకోవడం ఇప్పుడు కన్నడనాట హాట్ టాపిక్ గా మారింది. 2019 మే 23వ తేదీన కుమారస్వామి కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 14నెలలు దాటింది. 13 నెలలకే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

అనేక కారణాలు….

కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకోవడానికి అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ లో లుకలుకలతోపాటు కుమారస్వామి స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదు. కుమారస్వామికి చెందిన జనతాదళ్ ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ కు ఉప ఎన్నికలతో కలిపి 80 సీట్ల వరకూ దక్కించుకుంది.

ఢిల్లీ ఉందన్న ధీమాతో….

శాసనసభలో అధిక సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ తనకు ఎవరికోసం మద్దతిస్తుందని ఆలోచించారు తప్ప…. వారిలో అసంతృప్తికి తాను కారణమవుతానని కుమారస్వామి భావించి ఉండకపోవచ్చు. ఇక్కడ అసమ్మతి చెలరేగినా ఢిల్లీ నుంచి చక్రం తిప్పవచ్చని కుమారస్వామి అనుకుని ఉండవచ్చు. అందుకే ఆయన ఇక్కడి కాంగ్రెస్ నేతలను డోన్ట్ కేర్ అనే పరిస్థితికి వచ్చారు. అతి విశ్వాసానికి పోయారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలుసుకునేందుకు ఇష్టపడలేదు.

సిద్ధూను పక్కన పెట్టి…..

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత సిద్దరామయ్య ను పక్కన పెట్టిన కుమారస్వామి డీకే శివకుమార్, పరమేశ్వర్ వంటి వారిని ప్రోత్సహించారు. దీంతో సిద్ధరామయ్య వర్గంలోని ఎమ్మెల్యేలు కుమారస్వామిపై కక్ష కట్టారు. దీనికి తోడు కుమారస్వామి సోదరుడు మంత్రి రేవణ్ణ కూడా కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారారు. ఇలా కుమారస్వామి తనకు తానుగా చేసుకున్న తప్పిదాలే ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేశాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News