ద విన్నర్ ఈజ్.... ....స్పిరిట్ ఆఫ్ డెమొక్రసీ

Update: 2018-05-19 15:30 GMT

ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లింది. కన్నడ నాట కథ ప్రతిపక్షాలకు కొత్త దారి చూపింది. ప్రజాతీర్పుతో నిమిత్తం లేకుండానే దున్నేయాలనుకున్న బీజేపీకి గుణపాఠం నేర్పింది. దేశంలోనే అత్యంతశక్తిమంతమైన నాయకునిగా అవతరించిన మోడీకి వ్యతిరేకంగా అన్నిశక్తులూ ఏకమై దూకుడును అడ్డుకున్న ఘట్టం అపూర్వంగా నిలిచింది. 2019 ఎన్నికలకు బీజేపీని నిరోధించే వ్యూహాలకు మార్గం సుగమం చేసింది. సుప్రీం కోర్టు మొదలు జాతీయంగా, ప్రాంతీయంగా ఉన్న పార్టీలన్నీ వాంఛించింది నెరవేరింది. దక్షిణాదిన కాలూని ఉత్తరభారత ముద్ర తొలగించుకోవాలనుకున్న మోడీ,షాల ఆశ అడియాసగా మిగిలిపోయింది. ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీకి ఊపిరిపోసింది. ప్రాంతీయపార్టీల్లో భరోసా నింపింది. రెండు మూడు రోజులపాటు అత్యంత ఉత్కంఠ నింపి ప్రజాస్వామ్య ప్రియులను కలచివేసింది. కానీ అంతిమ తీర్పు భారత ప్రజాస్వామ్య కీర్తి కిరీటానికి శిరోభూషణంగా నిలిచింది. .

దండు కడితేనే...

జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఎన్నిక మోడీ వర్సస్ రెస్టు అన్న సూత్రాన్ని తేటతెల్లం చేసింది. అటు మమతా బెనర్జీ మొదలు చంద్రబాబు నాయుడు వరకూ నైతికంగా కాంగ్రెసు, జేడీఎస్ లకు గట్టి మద్దతుగా నిలవడం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదం వల్ల దాదాపు దేశంలోని అన్నిపార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా దండు కట్టేందుకు మానసికంగా సిద్ధమయ్యాయి. 2019 ఎన్నికలకు ఈ పంథా బీజేపీకి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలతో ప్రజలను వ్యక్తిగతంగా ఇక్కట్ల పాలు చేసిన మోడీ ప్రభుత్వం బలమైన ప్రతిఘటననే భవిష్యత్తులో ఎదుర్కోబోతోందనేందుకు కర్ణాటక ఫలితం ఒక నిదర్శనగా చెప్పవచ్చు. పన్నా ప్రముఖ్ వంటి ఏర్పాట్లతో బూత్ లెవెల్ నుంచి పోల్ మేనేజ్మెంట్ లో ఆరితేరిన బీజేపీకి చెక్ చెప్పడానికి అదే ప్రతివ్యూహం నిర్మించుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ ఎన్నిక చాటిచెప్పింది. విపక్షాలన్నీ ఏకం కావడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోలయ్యే ప్రతి ఓటూ సంఘటితం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీనిని సరైన దృష్టి కోణంలో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విపక్షాలకు ఉంది. కలిస్తే గెలుస్తాం. విడిపోతే చెడిపోతామన్న సందేశం కన్నడ తీర్పులో ప్రతిఫలించింది.

తగ్గి..నెగ్గిన...

కాంగ్రెసు పార్టీ చూపిన సంయమనం , చొరవ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రశంసనీయమనే చెప్పాలి. అరవయ్యేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెసు పార్టీ సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో సైతం పెద్దన్న పాత్రనే పోషించాలని చూసింది. ఫలితంగానే గోవా,మణిపూర్, మేఘాలయ వంటి చోట్ల అధికారం చేజారిపోయింది. మెజార్టీ సీట్లు తెచ్చుకున్నప్పటికీ చతికిలపడాల్సి వచ్చింది. కర్ణాటకలో భిన్నమైన వ్యూహం అనుసరించింది. పెద్దన్నగా తానే చొరవ తీసుకొంది. తనలో సగం సీట్లు గెలుచుకోలేకపోయిన జేడీఎస్ కు అవకాశమిచ్చింది. తన ప్రధాన ప్రత్యర్థిని నిలువరించాలంటే తగ్గి నెగ్గాల్సిన అవసరాన్ని గుర్తించింది. కర్ణాటక రాష్ట్ర ఎన్నిక కాదు, 2019కి తన భవిష్యత్తు అని గ్రహించి తెలివిగా పావులు కదిపింది. గతంలో ఎన్నడూ కనబరచని ఫైటింగ్ స్పిరిట్ ను కాంగ్రెసు కనబరిచింది. జాతీయ నేతలను అందరినీ రంగంలోకి దింపి ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు కాంగ్రెసు సభ్యులు గడపదాటకుండా కాపలా కాయగలిగింది. మోడీ, అమిత్ షా లు నాయకత్వం చేపట్టిన తర్వాత బీజేపీలో కనిపించే ధోరణి ఇదే. ప్రతి ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్నారు. గెలుపును ఏదో విధంగా సాధిస్తున్నారు. చివరి వరకూ కూడా పట్టువీడటం లేదు. అదే పద్ధతిని కాంగ్రెసు కర్ణాటకలో అనుసరించి విజయం సాధించింది.

ఫుల్ స్టాప్ పడాలి...

గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దుర్వినియోగం చేయడం నిరంతరం సాగుతోంది. సుప్రీం కోర్టు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల కర్ణాటకలో న్యాయం జరిగింది. ప్రజాస్వామ్యం గెలిచింది. కానీ దేశం కొన్నిరోజులపాటు తీవ్రమైన ఉత్కంఠను అనుభవించింది. ఆవేదనకు, క్షోభకు గురైంది. గవర్నర్లు ఇచ్చే అనుచిత వెసులుబాటుతో మైనారిటీ పార్టీలు సైతం సర్కారులోకి వచ్చి ప్రలోభాలతో అధికారాన్ని సుస్థిరం చేసుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. అదే ఆశతో కర్ణాటకలోనూ బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. కాలం కలిసి రాక సర్కారు కుప్పకూలింది. విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చిపెట్టింది. గతంలో గవర్నర్లు తప్పు చేసి కోర్టులు జోక్యం చేసుకున్న సందర్బాల్లో న్యాయం జరిగిన ఉదంతాలున్నాయి. 1998లో ఉత్తరప్రదేశ్ లో కల్యాణ్ సింగ్, జగదాంబికాపాల్ ఘట్టం, 2005 జార్ఖండ్ లో శిబూసోరెన్, అర్జున్ముండా సంగతి, ఉత్తరాఖండ్ లో తాజాగా 2016లో హరీశ్ రావత్ ల విషయంలో గవర్నర్లు తమవిచక్షణాధికారాలను వివక్షాపూరితంగా వినియోగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. న్యాయస్థానాల జోక్యంతో ఆయా ఘట్టాల్లో న్యాయం జరిగింది. క్రమేపీ న్యాయవ్యవస్థను సైతం తన అదుపాజ్ణల్లోకి తెచ్చుకునే తంతులో నిమగ్నమైపోయింది కేంద్రప్రభుత్వం. ఈ నేపథ్యంలో గవర్నర్లు నిర్ణయాలు తీసుకునేందుకు నిర్దిష్టమైన విధివిధానాలు,మార్గదర్శకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News