రాజుగారు తలచుకుంటేనే?

వారసులందరూ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. పదమూడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు తనయుడు లోకేష్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన అనేకమంది [more]

Update: 2020-10-15 13:30 GMT

వారసులందరూ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. పదమూడు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు తనయుడు లోకేష్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన అనేకమంది వారసులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. భవిష్యత్తు లో లోకేష్ కు నాయకత్వం అప్పగించాలని భావించిన చంద్రబాబుకు ఇది ఇబ్బందికరంగా మారింది. వచ్చే నాలుగేళ్లపాటు పార్టీని నడపాలంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ అనేక చోట్ల దీనిపై వ్యతిరేకత కన్పిస్తుంది.

యువకులకు ప్రాధాన్యత…..

లోకేష్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఎక్కువగా యువకులకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా యువకులను నియమించారంటున్నారు. ముఖ్యమైన నేతలను సంప్రదించకుండానే ఈ నియామకాలు జరిగాయని పార్టీలో విన్పిస్తున్న టాక్. విజయనగరం జిల్లా ను తీసుకుంటే ఇక్కడ సీనియర్లను కాదని మొన్నటి ఎన్నికల్లో రాజకీయ రంగం ప్రవేశం చేసిన కిమిడి నాగార్జునను చంద్రబాబు నియమించారు.

అశోక్ సలహాలను….

కానీ పార్టీకి జిల్లాలో పెద్దదిక్కువగా ఉన్న అశోక్ గజపతిరాజు సూచనలు కూడా చంద్రబాబు తీసుకోలేదని చెబుతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి కోసం మాజీ ఎమ్మెల్యే కేఈ నాయుడు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆయన తనకు పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలను కాదని జూనియర్ కు అప్పగించడం ఏంటని కొందరు నేతలు గడప దాటి బయటకు రావడం లేదు.

ఆయన తలచుకుంటేనే….

మరోవైపు సీనియర్ నేతలు విజయనగరం జిల్లాలో నాగార్జునకు ఎంత మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాగార్జున కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నా వారు మాత్రం దిగిరావడం లేదంటున్నారు. నాగార్జున ఇప్పటికే పార్టీ పెద్దలన కలసి దీవెనలు తీసుకునే పనిలో ఉన్నారు. నేతలు సహకరిస్తామని పైకి చెబుతున్నా వారు నాగార్జున నియామకంపై ఇప్పటికీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి అశోక్ గజపతిరాజు తలచుకుంటేనే ఇక్కడ పార్టీ సెట్ అవుతుందంటున్నారు. లేకుంటే నాగార్జునకు సహకారం దొరకడం కష్టమే.

Tags:    

Similar News