జగన్ కూడా ఆ తప్పే చేస్తున్నారే

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో నిండా మునిగి పోవడానికి అంతా మొట్ట మొదటిగా వేలు ఎత్తి చూపేది ఇసుక మాఫియా. పేరు ఉచితం పెట్టి అప్పనంగా ఖనిజవనరులను కళ్లెదుటే [more]

Update: 2019-07-24 06:30 GMT

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో నిండా మునిగి పోవడానికి అంతా మొట్ట మొదటిగా వేలు ఎత్తి చూపేది ఇసుక మాఫియా. పేరు ఉచితం పెట్టి అప్పనంగా ఖనిజవనరులను కళ్లెదుటే కొల్లగొడుతున్న తీరు అందరికి తెలిసినా విమర్శలు ఆరోపణలు చేసినా బాబు సర్కార్ ఐదేళ్ళు తమ నిర్ణయమే కరెక్ట్ అంటూ మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. జనం అధికారపార్టీ కళ్ళల్లో కసితీరా ఇసుకేసి కొట్టేశారు. ఈ ఇసుక మాఫియా వ్యవహారం ప్రతిపక్షం లో వున్న అన్ని రోజులు చెప్పిన చోట చెప్పకుండా ఊదరగొట్టిన వైసిపి అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా సెప్టెంబర్ దాకా కొత్త పాలసీ కోసం ఆగండాగండి అంటూ మీన మేషాలు లెక్కించడం ఇసక తుఫాన్ సృష్టిస్తుంది.

తహశీల్దార్ ఆ తరువాత ఆర్డీవో లు …

వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఎపి లో ఇసుక ర్యాంప్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తరువాత కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణలో అరకొరగా సవాలక్ష నిబంధనలు పెట్టి ఇసుకను విక్రయిస్తూ ఉండటంతో మళ్ళీ మాఫియా సీన్ లోకి దిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎమ్యెల్యే, ఎంపీలు తమ పరిధిలో వున్న కొద్దిపాటి రీచ్ లపై అనధికార పెత్తనం మొదలు పెట్టేశారని విపక్షాలు ప్రచారం మొదలు పెట్టేశాయి. ఇవి ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటున్న వైఎస్ జగన్ సర్కార్ కి లేని పోని తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. నిలిచిపోయిన భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలనుకునే సామాన్యుడు ముందుగా తన ప్లాన్ కాగితం నఖలు తో తహశీల్దార్ కి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన పరిశీలించి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ కి పంపాలి. వారు కూడా ధృవీకరించాకా ప్రయారిటీ లో ఇసుక అందజేయబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యి ఇసుక వినియోగదారుడికి చేరడానికి పది రోజులకు మించే సమయం పడుతుందని గగ్గోలు జనంలో మొదలైపోయింది.

ఒక్క యాప్ తో వ్యవస్థ లైన్ లో పడుతుంది …

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ట్రేడింగ్ ఆదరణ పొందుతుంది. ఇసుక ను పారదర్శకంగా బ్లాక్ లో లేకుండా విక్రయించడానికి తక్కువ యంత్రాంగంతో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చే విధానం ఆన్లైన్. దీని ద్వారా ఇసుక అవసరమైన వారు తమ పూర్తి వివరాలు ప్రభుత్వ ఇసుక యాప్ లో నిక్షిప్తం చేసి సొమ్ము చెల్లిస్తే నేరుగా వారి వద్దకు ఇసుక పంపడం వీలు అవుతుంది. దీనిద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది ఎంత డిమాండ్ వుంది అనే వివరాలు ఏ రోజుకు ఆరోజు ప్రభుత్వం ముందు ఉంటాయి. ఈ విధానం ఉత్తమైనదని ఇప్పటికే క్రేడాయి వంటి బిల్డర్స్ అసోసియేషన్ లు కూడా సూచిస్తున్నాయి. ఇలాంటి కొత్త విధానం తయారు చేయడానికి వాస్తవానికి వైసిపి ప్రభుత్వానికి వారం రోజులకన్నా సమయం అఖ్ఖర్లేదు. అయినా వైసిపి సర్కార్ ఒక్క ఇసుక విధానం డిసైడ్ చేయడానికి సుమారు మూడు నెలలు సమయం తీసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

పనులు లేక కూలీలా అవస్థలు …

ఒక్క ఇసుక సప్లై నిలిచిపోయిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కాదు చాలా రంగాల్లో స్థబ్ధత నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇటుక పరిశ్రమ, ఇతర భవన నిర్మాణ సామాగ్రి విభాగాలన్నీ పడకేసాయి. నెలలు తరబడి నిర్మాణాలు వాయిదా పడితే బ్యాంక్ రుణాలతో గృహాలు నిర్మించుకునే వారికి వడ్డీల భారం అధికమౌతుంది. ఇక బిల్డర్లు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. స్లాబ్ ల వంటివి ఆగిపోతే మిగిలిన నిర్మాణం అంతా నిలిచిపోతుంది. లక్షలాదిమంది ఆధారపడే భవన నిర్మాణ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం మరింత ముదరకముందే వైసిపి సర్కార్ ఎదో ఒక విధానం ప్రవేశపెట్టి ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News