మహా నాడులో మన్ కీ బాత్…?

బీజేపీతో ఎఫ్పుడెప్పుడు చట్టపట్టాలు కట్టుకుందామా? అని తెలుగుదేశం పార్టీ తెగ ఆత్ర పడిపోతోంది. దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని, కరోనా కట్టడిలో వైఫల్యాలను దుమ్మెత్తి పోస్తుంటే జాతి [more]

Update: 2021-05-30 12:30 GMT

బీజేపీతో ఎఫ్పుడెప్పుడు చట్టపట్టాలు కట్టుకుందామా? అని తెలుగుదేశం పార్టీ తెగ ఆత్ర పడిపోతోంది. దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని, కరోనా కట్టడిలో వైఫల్యాలను దుమ్మెత్తి పోస్తుంటే జాతి ప్రయోజనాల కోసం మీకు మద్దతిస్తామంటూ టీడీపీ తాపత్రయంగా ముందుకు వస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు కి గతంలో పార్టీ శ్రేణుల్లో చాలా ఆదరణ ఉండేది. అంతర్గతంగా పార్టీ పనితీరును సమీక్ష చేసుకునేవారు. బహిరంగంగా పార్టీ సిద్ధాంతాల అమలుకు అజెండాను తీర్మానాల రూపంలో ప్రవేశపెట్టేవారు. రాజకీయ మేళానే అయినప్పటికీ పార్టీకి సంబంధించి విధానపరమైన నిర్ణయాలకు అతి పెద్ద వేదిక మహానాడు. తాజాగా జరిగిన మహానాడును అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని తిట్టిపోయడానికే తప్ప మరే రకంగానూ సద్వినియోగం చేయలేకపోయారు. కనీసం పార్టీ వరస ఓటములకు, వైఫల్యాలకు సుతిమెత్తగా అయినా పరిష్కారాలు వెదికే ప్రయత్నాలు చేయలేదు. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై వ్యక్తిగత కక్షనే మహానాడు ప్రతిబింబించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే మీడియా సమావేశాలకు, మహానాడు తీర్మానాలకు పెద్దగా తేడా లేదు. మరోసారి ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికి ఈ వేదికను వాడుకోవడం మినహా నిర్మాణాత్మకంగా సాధించిందేమీ లేదు. నవరత్నాల వల్ల ప్రజల భవిష్యత్ ప్రయోజనాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. రాష్ట్రం రుణ సంక్సోభంలో కూరుకుపోతుంది. అయిదారేళ్ల తర్వాత భారీగా ప్రజలపై పన్నుల భారం పడుతుంది. ఆ కోణంలో ఆలోచించి ప్రజలను చైతన్య పరచకుండా నవరత్నాలు నకిలీ రత్నాలంటూ వ్యక్తిగత అసూయను వెలిగక్కారు. నిజానికి ప్రజలు ఉచితంగా అందివచ్చే నవరత్నాల పట్ల సంపూర్ణ సంతృప్తితో ఉన్నారు. పర్యవసానాలు, పరిణామాలపై వారికి అవగాహన లేదు. ప్రధాన ప్రతిపక్షంగా , కీలకమైన రాజకీయ పార్టీగా ఆయా అంశాలను వెలికితీయాల్సిన తెలుగుదేశం రొట్టకొట్టుడు విమర్శలు, ఆరోపణలకే పరిమితమైతే ప్రయోజనం శూన్యం.

పన్నెత్తి మాట లేదు..

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ని ఆరాధించే , అభిమానించే కోట్టాది కార్యకర్తలు, మధ్యతరగతి ప్రజలు సైతం ఆయన పట్ల వైముఖ్యం పెంచుకున్నారు. తాజా పరిణామాలతో అసమర్థ ప్రధానిగా ఆయనను భావిస్తున్నారు. ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చిన వెంటనే కోట్టాది మంది మద్దతు పలికారు. ప్రధాని మోడీ పాప్యులారిటీ నెగిటివ్ కోణంలో దూసుకుపోతోంది. ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగానే దుయ్యబడుతున్నాయి. వాక్సిన్లు వంటి జాతీయ కార్యక్రమాలను పూర్తిగా అమలు చేయకుండా కేంద్రం డబ్బుల లెక్కలు వేసుకుంటోంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరోవైపు రెమ్ డెసివర్ వంటి మందులనూ తాము సరఫరా చేయమని చెప్పేసింది. కేంద్రప్రభుత్వం వాక్సిన్లను కొనుగోలు చేస్తే సగం రేటుకే అవి లభిస్తాయి. అదే రాష్ట్రాలైతే రెట్టింపు ఖర్చు పెట్టాలి. ఎవరు వ్యయం చేసినా ప్రజల ప్రాణాలకు సంబంధించిందే. దేశం, జాతీయ భావం గురించి మాట్టాడే బీజేపీ తన తెంపరితనాన్ని చాటుకుంటోంది. తీవ్రమైన విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. బుకాయిస్తోంది. వాక్సిన్ల కార్యక్రమం తాను స్వీకరించేందుకు సిద్దం కావడం లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మహానాడు సాగితే కనీసం కేంద్ర బాధ్యతను గుర్తు చేసేందుకు కూడా టీడీపీ ప్రయత్నించలేదు. మిగిలిన రాజకీయ అంశాల్లో అంటకాగాలని అనుకోవచ్చు. తప్పు లేదు. కానీ ఆరోగ్య విషయంలో సైతం ఉదాసీనంగా, నిర్లిప్తమైన రాజకీయ పార్టీగా టీడీపీ మిగిలిపో దలచింది. కేంద్రమంటే అంతగా భయపడాల్సిన అవసరమేమొచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

జాతీ ప్రయోజనాల ముసుగు..

ఆంధ్రప్రదేశ్ వంటి మధ్య తరహా రాష్ట్రానికే తన ప్రభావం పరిమితమైనా జాతీయ పార్టీగా ట్యాగ్ లైన్ తో ఆత్మసంతృప్తి పొందుతోంది టీడీపీ. జాతి ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇస్తామంటూ మహానాడులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. నేరుగా బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పకుండా జాతి ప్రయోజనాలు అనే ముసుగు వేయడంపై వైసీపీ ఆక్షేపిస్తోంది. దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్తలలో ఒకరిగా ఉన్న చంద్రబాబు కేంద్రం మొందు మోకరిల్లుతున్నారనేందుకు ఇంతకు మించి ఉదాహరణ లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పన్నెండు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో తిరగరాయడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి సీనియర్ నాయకుడు దేశంలోని ప్రతిపక్షాలకు కొంతైనా మార్గదర్శకంగా నిలవాలి. కేంద్రాన్ని ఒక్కమాట కూడా అనకుండా మహానాడును ముగించడం విచిత్రం. ఆరునెలలుగా వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు సాగుతున్నాయి. కరోనా కల్లోలంతో ప్రజలు ఇళ్లకే పరిమిత మవుతున్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలన్నీ ముసుగేశాయి. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది కేంద్రమే. అయినా చంద్రబాబుకు జాతి ప్రయోజనాల కోణమే కనిపించడం పాక్షిక దృష్టికి నిదర్శనం. జాతి ప్రయోజనాలే కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మహానాడు కేంద్రంపై తీర్మానం చేసి ఉంటే బాగుండేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

అవిశ్వాసానికి అర్థమేమిటి?

కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన వ్యవస్థగా ఉన్నప్పుడు మోడీ పై తెలుగుదేశం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. చాలా పార్టీలను ఏకం చేసింది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ నినదించింది. కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు చెట్టపట్టాలు వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కలలు కన్నారు. కలలు కల్లలయ్యాయి. రెట్టించిన మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరుసటి రోజు నుంచే చంద్రబాబు తన వాణి, బాణి మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో గడచిన రెండేళ్లుగా కేంద్రం వైఖరిలో ఏమైనా మార్పులు వచ్చాయా? అవిశ్వాసం పెట్టిన నాటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా లేదు. అమరావతిపై ఉలుకూ పలుకు వినరాదు. పోలవరం నత్తనడక. విభజన చట్టం హామీల అమలు అంతంతమాత్రమే. కొత్తగా విశాఖ ఉక్కునూ అమ్మేస్తామంటున్నారు. ఇంత అస్తవ్యస్తంగా కేంద్రం పరిపాలిస్తుంటే , రాష్ట్రాన్ని అణగదొక్కేస్తుంటే మహానాడులో ఒక్కమాట మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోవడాన్ని మించి ఆత్మవంచన మరొకటి ఉండదు. వైసీపీని విమర్శించడం తప్పులేదు. కానీ బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టేయడమే విశేషం. అయినా మోడీ, షాలు చంద్రబాబును దగ్గరికి రానీయడం లేదని ఒక రాష్ట్ర స్తాయి బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడే ప్రధాన అడ్డంకి అని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పార్టీకి రాష్ట్రంలో క్రేజ్ ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ పొత్తు పేరిట చంద్రబాబు నాయుడు దానిని ఎన్ క్యాష్ చేసుకుని అధికారంలోకి వస్తున్నారనేది బీజేపీ అభిప్రాయం. అందువల్ల వైసీపీ, టీడీపీల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు తేడా లేదనే కమల నాథులు చెబుతున్నారు. మోడీ, అమిత్ షా ల హవా నడిచినంత కాలం చంద్రబాబు నాయుడి జాతి ప్రయోజనాల అస్త్రం, ఆహ్వానం పనిచేయకపోవచ్చు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News