రెడీ అయిపోయారటగా

సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచారు. సుమలత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడపై అఖండ [more]

Update: 2019-08-10 17:30 GMT

సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచారు. సుమలత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడపై అఖండ విజయాన్ని సాధించారు. దీంతో ఆమె జెయింట్ కిల్లర్ గా పేరు పొందారు. అయితే మాండ్య నియోజకవర్గానికి ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలత స్వతంత్ర అభ్యర్థి అయినప్పటికీ బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినా….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీకి దింపలేదు. ప్రత్యక్షంగా బీజేపీ సుమలతకు మద్దతు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ లోని మరో వర్గం సయితం సుమలతకు పరోక్షంగా సహకారం అందించడంతో విజయం సాధ్యమయింది. తన భర్త అంబరీష్ ఆశయాలను సాధిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన సుమలత రెండు రాజకీయ పార్టీలకూ సమాన దూరాన్నే మొన్నటి వరకూ పాటిస్తూ వస్తున్నారు.

బీజేపీ ప్రాధాన్యత…..

కానీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో ఆమె కమలం పార్టీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సయితం సుమలతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీ సమావేశాలను మినహాయించి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రత్యేకంగా సుమలతను ఆహ్వానాన్ని పంపుతుంది. సుమలత కూడా యడ్యూరప్ప ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరై వచ్చిన సుమలత నేరుగా వెళ్లి యడ్యూరప్పతో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ పై విమర్శలు….

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిక్కూ దివానం లేకుండా ఉండటం, రాష్ట్రంలోనూ అధికారాన్ని కోల్పోవడంతో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తన సీటు విషయంలో ఆడిన డ్రామాను సుమలత ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ లో గ్రూపుల తప్ప అభివృద్ధి మాట వినపడదని ఆమె తరచూ విమర్శలు చేస్తుండటం గమనార్హం. కర్ణాటక రాజకీయాల్లో అంబరీష్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయనకు కన్నడనాట పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అందుకే సుమలతకు త్వరలోనే కాషాయ కండువా కప్పేయాలని కమలనాధులు భావిస్తున్నారు. సుమలత కూడా అందుకు రెడీ అయిపోతారేమో చూడాలి మరి.

Tags:    

Similar News