“పవార్” తగ్గిందే…..?

కాంగ్రెస్ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీనం కానుందా? రెండు పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన వచ్చిందా? పార్టీ శ్రేణులు కీలక నాయకులు ఇందుకు [more]

Update: 2019-07-15 18:29 GMT

కాంగ్రెస్ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీనం కానుందా? రెండు పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన వచ్చిందా? పార్టీ శ్రేణులు కీలక నాయకులు ఇందుకు సుముఖంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. రాజకీయ వర్గాల నుంచి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీల నేతలు ఈ మేరకు అవగాహనకు వచ్చారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ల మధ్య చర్చలు జరిగాయి. రెండు పార్టీలూ విలీనానికి ముందుకు రావడానికి వాటి కారణాలు వాటికి ఉన్నాయి. అందువల్లే ఒకే గొంతుతో మాట్లాడుతున్నాయి.

ఎవరి కారణాలు వారికి….

ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో పరాజయం, శరద్ పవార్ వృద్ధాప్యం, అనారోగ్యం, బీజేపీ, శివసేన కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో విడిపోయి వాటిని ఎదుర్కొనలేమన్నది కాంగ్రెస్, ఎన్సీపీ భావన. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ఘోర పరాజయం పాలయ్యాయి. మొత్తం 48 స్థానాలకు గాను కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ఎన్సీపీ అయిదు స్థానాలను గెలుచుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఘోర పరాజయం తప్పదు. అందువల్ల విలీనం అనివార్యమని ఉభయ వర్గాలు చెబుతున్నాయి. విలీనం వల్ల కాంగ్రెస్ కు తక్షణం ఒక లాభం ఉంది. లోక్ సభలో కాంగ్రెస్ బలం 52 మాత్రమే. దీనివల్ల ప్రతిపక్ష నేత పదవి దక్కలేదు. విలీనం వల్ల ఎన్సీపీ అయిదుగురు సభ్యుల మద్దతుతో బలం పెరుగుతుంది. 52 నుంచి 57 కు పెరుగుతుంది. ఇక రెండు పార్టీల పరంగా చూస్తే పరిస్థితులు బాగా లేదు. శరద్ పవార్ వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో సతమతమవుతున్నారు. కూతురు సుప్రియా సూలే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే పరిస్థితి ఆమె లేదు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ, శివసేన కూటమిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందువల్ల విలీనానికి పవార్ మొగ్గు చూపుతున్నారు. ఇక కాంగ్రెస్ కారణాలు కాంగ్రెస్ కు ఉన్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉంది. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పార్టీలు విలీనమైతే కనీసం రేపటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వవచ్చన్నది దాని ఆలోచన.

కాంగ్రెస్ నుంచే పుట్టి….

వాస్తవానికి శరద్ పవార్ కాంగ్రెస్ వాదే. ఆ పార్టీ ముఖ్యమంత్రిగా, లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఒక దశలో ప్రధాని పదవికి గట్టిపోటీదారుగా నిలిచారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తొమ్మిదో దశకం చివర్లో సోనియా గాంధీ విదేవీయతను శరద్ పవార్ ప్రశ్నించి సంచలనం సృష్టించారు. ఆయనతో పాటు బీహార్ కు చెందిన తారిఖ్ అన్వర్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత పీఏ సంగ్మా గొంతు కలిపారు. దీంతో వారు కాంగ్రెస్ నుంచి వేరుపడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. అయినప్పటికీ శరద్ పవార్ కాంగ్రెస్ తో పొత్తును వదులుకోలేదు. కాంగ్రెస్ మద్దతు లేకుండా మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమిని తాను ఒంటరిగా ఎదుర్కొనలేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పదిహేనేళ్ల పాటు రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ ను నడిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి తీసుకోగా, ఎన్సీపీ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. కేంద్రంలో శరద్ పవార్ మంత్రి పదవులు పొందారు. శరద్ పవార్ మన్మోహన్ మంత్రివర్గంలో రక్షణ, వ్యవసాయశాఖలను నిర్వహించారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాత వైరాన్ని మరచి ముందుకు సాగాలన్న సంగతిని ఇరు పార్టీలు గుర్తించాయి. లేనట్లయితే మున్ముందు పార్టీల భవితవ్యమే ప్రశ్నార్థకం అవుతుంది. కానీ విలీనం గురించి తనకు తెలియదని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి విలీనం ప్రక్రియ ఒక కొలిక్కి రావచ్చని అంచనా.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News