జగన్ టీడీపీని బతికిస్తున్నారా

తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు అన్నా జగన్ కి బద్ధ విరోధి కదా. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సైకిల్ ని పంక్చర్ చేసి మరీ బంపర్ [more]

Update: 2019-08-11 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు అన్నా జగన్ కి బద్ధ విరోధి కదా. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సైకిల్ ని పంక్చర్ చేసి మరీ బంపర్ విక్టరీ కొట్టిన జగన్ కి పసుపు పార్టీ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది. ఆ మాటకు వస్తే జగన్ కి అన్న నందమూరి తారక రామారావు అంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఇపుడు అధినేత చంద్రబాబు. అది కూడా వెన్నుపోటు పొడిచి మరీ పార్టీని, ప్రభుత్వాన్ని బాబు లాగేసుకున్నాక అసలు టీడీపీ నేతలే పార్టీని వీడిపోయారు. ఏపీలో ముప్పయ్యేళ్ళు పాలించాలనుకుంటున్న జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పధకాలు, మరో వైపు అభివ్రుధ్ధి తో జగన్ దూసుకుపోతున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా రెడీ అంటున్నారు కూడా. ఇక టీడీపీ పరిస్థితి చూస్తే కుంగి కూనరిల్లిపోయిఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఆశ టీడీపీకే లేదు. మరి జగన్ ఎందుకలా చేస్తారు.

పెద్దాయన అలా అన్నారట….

జగన్ ఢిల్లీ టూర్ మొత్తానికి కొంత ఇబ్బంది పడింది ఒకే ఒక చోట. అది మన తెలుగు వాడైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసినపుడు అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక కాస్తా ఆలస్యంగానే వెంకయ్యను కలవడం జరిగింది. ఇప్పటికి జగన్ మూడు సార్లు ఢిల్లీ టూర్ చేస్తే చివరి సారి మాత్రమే పెద్దాయన దర్శనానికి వెళ్ళారు. దాంతోనే కొంత చర్చ సాగింది మీడియాలో. ఇక వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్ ఏపీకి చెందిన వారిగా విభజన సమస్యల మీద జోక్యం చేసుకోవాలని, మాట సాయం చేయాలని కోరినట్లుగా మీడియాలో వచ్చింది. అదే మీడియాలో వెంకయ్య జగన్ కి కొన్ని సలహాలు ఇచ్చినట్లు కూడా వచ్చింది. విద్వంసకర పాలన చేస్తే తాను ఎలా సాయం చేయగలను అంటూ జగన్ ని వెంకయ్య నేరుగానే ప్రశ్నించినట్లుగా కూడా మీడియా కధనాలు వచ్చాయి. జగన్ పాలనా తీరుని వెంకయ్య తప్పుపట్టారని కూడా మీడియాలోనే వార్తలు వచ్చాయి. ఇలా కనుక చేస్తే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటూ జగన్ ని స్మూత్ గా హెచ్చరించినట్లుగా కూడా కధనాలు వచ్చాయి.

వాటి మీదనేనా…?

జగన్ దూకుడుగా ప్రజావేదికను కూల్చేశారు. ఆ నిర్ణయం ఏపీ ప్రజల్లో మెజారిటీ అంగీకరించలేనిదే. ఇక జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం, అమరావతి తో పాటు, విద్యుత్ కొనుగోళ్ళ మీద కూడా రివ్యూస్ చేస్తున్నారు. దీంతో కొంత మేర పనులు ఆగాయి. అయితే ఇవన్నీ ప్రజా ధనాన్ని కాపాడడానికేనని జగన్ సర్కార్ అంటోంది. అయితే కొంతమంది వీటితో ఏకీభవిస్తే మరికొంతమంది జగన్ తన పాలనను చూపించుకుని ముందుకు సాగాలి కానీ తిరగతోడడం ఎందుకని అంటున్నారు. అయితే జగన్ పాలన మొదలు కావల్సింది కూడా బాబు వదిలేసిన చోటు నుంచే. అక్కడే అవినీతి గబ్బు కొడుతూంటే బాబు తస్మదీయులకు మరిన్ని సంతర్పణలు చేసుకుంటూ జగన్ ఎలా ముందుకు సాగతారన్నది వైసీపీ నేతల ప్రశ్న.

జగన్ దూకుడు మీద….

మొత్తానికి జగన్ ఇలా చేయడం టీడీపీకి అసలు నచ్చదు. ఇక మహా మేధావి జయప్రకాష్ నారాయణ లాంటి వారికి కూడా ఇది నచ్చదని మీడియా ముఖంగా తెలిసింది. ఇపుడు వెంకయ్య జగన్ భేటీ మీద వచ్చిన వార్తా కధనాలు నిజమైతే పెద్దాయన కూడా జగన్ దూకుడు విధానాలకు వ్యతిరేకంగానే ఉన్నట్లుగా అర్ధమవుతోందని అంటున్నారు. ఏది ఏమైనా జగన్, వెంకయ్య భేటీపై లోపల జరిగిన అసలు సంభాషణ తీరు ఎలా ఉన్నా శాలువాతో జగన్ సత్కరిస్తున్నపుడు ఫొటోలో చూసిన మేరకు వెంకయ్యనాయుడు ముఖంలో చిరునవ్వు ఎక్కడా కనిపించకపోవడం బట్టి చూస్తే జగన్ అనుసరిస్తున్న విధానాల మీద పెద్దాయన కొంత గుస్సా మీద ఉన్నారన్నది అర్ధమైపోతోంది.

Tags:    

Similar News