కాంటాక్ట్ కేసులు గుర్తించడం ఇక కష‌్టమేనా?

నిన్న మొన్నటి వరకూ ట్రేస్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ అనే మూడు టి లతో ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కొంత కంట్రోల్ లోకి తేగలిగాయి. అయితే [more]

Update: 2020-06-11 18:29 GMT

నిన్న మొన్నటి వరకూ ట్రేస్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ అనే మూడు టి లతో ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కొంత కంట్రోల్ లోకి తేగలిగాయి. అయితే లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత ఇక ట్రేసింగ్ కష్టమేనంటున్నారు నిపుణులు. ఎవరి నుంచి వైరస్ సోకింది నిర్ధారించడమూ కష్టమేనని చెబుతున్నారు. దీంతో వ్యాధి ముదిరేంతవరకూ కనిపెట్టడం అసాధ్యమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో భారత్ లో వచ్చే నెల నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

మర్కజ్ నుంచి వచ్చిన వారిని…

తొలి సారి లాక్ డౌన్ విధించిన తర్వాత మర్కజ్ మసీద్ ప్రార్థనల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఈ మేరకు దాదాపు ఏడు వేల మంది ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడం అన్ని రాష్ట్రాలకు పెద్ద పనిగా మారింది. వీరందరిని గుర్తించి పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహించే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మర్కజ్ మసీద్ ప్రార్థనలకు హాజరయిన వారు దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉండటంతో ఆ యా రాష్ట్రాలకు గుర్తించడం పెద్ద కష్టంగా మారింది. చివరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించగలిగాయి.

కరోనా సోకిన వారిని….

ఆ తర్వాత లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో కరోనా సోకిన వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయింది? ఎక్కడెక్కడకు వెళ్లింది? సులువుగా గుర్తించగలిగారు. వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలించారు. కానీ మూడో విడత లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంంతో కాంటాక్ట్ కేసులను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడానికి కాంటాక్ట్ కేసులను గుర్తించకపోవడమే కారణమని చెబుతున్నారు.

ఇప్పుడు కష్టమే మరి…..

ఇక ఐదో విడత లాక్ డౌన్ తర్వాత పూర్తి స్థాయి మినహాయింపులు ఇచ్చేశారు. గుళ్లు, ప్రార్థనమందిరాలు, రెస్టారెంట్లు వంటివి కూడా తెరుచుకున్నాయి. ఇక కాంటాక్ట్ కేసులను గుర్తించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజల స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప కరోనా సోకిన వారిని గుర్తించడం అసాధ్యమని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో భారత్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముంది. ట్రేస్ చేయడం కష్టంగా మారడంతో ప్రభుత్వాలకు ప్రజల సహకారం తప్పనిసరి అయింది.

Tags:    

Similar News