వారే ఎందుకు దూరమయ్యారబ్బా…?

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్ష పాత్ర ను పోషిస్తున్న టీడీపీకి శ‌రాఘాతం వంటి విశ్లేష‌ణ‌. ఆ పార్టీ ఉనికికి, ఆ పార్టీ మ‌నుగ‌డ‌కు ఇప్పటి వ‌ర‌కు ఆక్సిజ‌న్ అందించిన [more]

Update: 2019-07-28 03:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్ష పాత్ర ను పోషిస్తున్న టీడీపీకి శ‌రాఘాతం వంటి విశ్లేష‌ణ‌. ఆ పార్టీ ఉనికికి, ఆ పార్టీ మ‌నుగ‌డ‌కు ఇప్పటి వ‌ర‌కు ఆక్సిజ‌న్ అందించిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నానాటికీ దూర‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. నిజానికి పార్టీ స్థాపించిన స‌మ‌యంలో ఈ జిల్లాకు చెందిన మాకినేని పెద‌ర‌త్తయ్య, కోడెల శివ‌ప్రసాద‌రావు, ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి, విజ్ఞాన్ ర‌త్తయ్య, అన్నాబ‌త్తుని స‌త్యనారాయ‌ణ‌ వంటి అనేక మంది క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు అండ‌గా నిలిచారు. ప‌లు మార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం కూడా సాధించారు.

అనేకసార్లు అండగా….

వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బొక్కబోర్లా ప‌డిన సంద‌ర్భాల్లో కూడా గుంటూరులో మాత్రం క‌మ్మ వ‌ర్గం పార్టీ ప‌రువును కాపాడింది. 2004లో పార్టీ పూర్తిగా ఓట‌మి పాలై.. ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మైన సంద‌ర్భంలోను.. గుంటూరు నుంచి క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు విజయం సాధించారు. అప్పటి ఎన్నిక‌ల‌లో మొత్తం 19 సీట్లలో కేవ‌లం ఒకే ఒక సీటు ధూళిపాళ్ల న‌రేంద్ర (పొన్నూరు) కైవ‌సం చేసుకుని పార్టీ ప‌రువు నిల‌బెట్టారు. 2009లో టీడీపీ మ‌ళ్లీ ఓడినా జిల్లా నుంచి టీడీపీ త‌ర‌పున ఐదుగురు క‌మ్మలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1989లో పార్టీ ఓడిన‌ప్పుడు కూడా మాకినేని పెద‌ర‌త్తయ్య, కోడెల లాంటి వాళ్లు గెలిచారు.

ఒక్కరూ గెలవలేదే….

అయితే, తాజా ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఇక్కడ క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేక పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా రాజ‌ధాని నిర్మాణం .. అంటూ పెద్ద ఎత్తున హ‌డావుడి చేసిన చంద్రబాబు పార్టీని ఇక్కడి ప్రజ‌లు ఘోరంగా తిప్పికొట్టారు. అదే స‌మ‌యంలో చిల‌క‌లూరిపేట‌, పెద‌కూర‌పాడు, వినుకొండ‌, గుర‌జాల, తెనాలి, పొన్నూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన క‌మ్మ నాయ‌కులు ఒక్కరంటే ఒక్కరు కూడా విజ‌యం సాధించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ యా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన నాయ‌కులే విజ‌యం సాధించారు.

బాబుకు ఎదురుదెబ్బే….

మ‌రీ ముఖ్యంగా పొన్నూరులో డబుల్ హ్యాట్రిక్ సాధించాల‌ని భాఆవించిన ధూళిపాళ్ల నరేంద్రకు నిరాశే ఎదురైంది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు నాయ‌కులు ఇక‌, టీడీపీకి భ‌విత‌వ్యం లేద‌ని భావిస్తుండ‌డం ఇప్పుడు మ‌రింత‌గా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న అంశం. ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ మాత్రమే ఈ వ‌ర్గం నుంచి ప్రతినిధిగా ఉన్నాడు. ఇక పార్టీ ప‌రిస్థితిపై ఆందోళ‌న‌లో ఉన్న నేత‌లు త్వర‌లోనే పార్టీ మారేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీతో బేరాలు చేసుకున్నారంటూ.. కొంద‌రి పేర్లు సైతం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కీల‌క నేత‌లు కూడా పార్టీని వీడి వెళ్లిపోతే బాబుకు ఇక్కడ పెద్ద ఎదురు దెబ్బే.

Tags:    

Similar News