చిన్న ఎన్నికలు.. పెద్ద ఫలితం…?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బలాబలాలను తారుమారు చేయవు. అధికారాన్ని అటుఇటు చేయవు. కానీ ప్రతిపక్ష స్థానానికి పోటీ పడుతున్న ప్రత్యామ్నాయ శక్తులకు [more]

Update: 2021-04-17 06:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బలాబలాలను తారుమారు చేయవు. అధికారాన్ని అటుఇటు చేయవు. కానీ ప్రతిపక్ష స్థానానికి పోటీ పడుతున్న ప్రత్యామ్నాయ శక్తులకు తమ బలమేమిటో చెబుతాయి. ఎదురేలేదంటూ విపక్షాలను చులనకగా చూస్తున్న అధికార పక్షానికి అసలు నిజం వెల్లడిస్తాయి. అందుకే ఉప ఎన్నికలు అత్యంత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరుపతి లోక్ సభ పరిధిలోని ప్రజలు, నాగార్జున సాగర్ శాసన సభ ఓటర్లు ఏం చెబుతారనేది రెండు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ అత్యంత చర్చకు దారి తీస్తోంది. సాధారణంగా ప్రతిపక్షాలు సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండో రోజు నుంచే అధికారపార్టీ పని అయిపోయిందని చెబుతుంటాయి. మళ్లీ ఎన్నిక పెడితే తామే అధికారంలోకి వచ్చేస్తామంటుంటాయి. అధికార పార్టీ లు తమకు తిరుగేలేదని ప్రకటిస్తుంటాయి. ఇక విపక్సాల పని అయిపోయిందంటుంటాయి. నిజానికి ఆ రెండూ వాదనలూ నిజం కాదు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పును కనిపెట్టడం ఎవ్వరి తరమూ కాదు. ఉప ఎన్నికలు ప్రతిపక్షాలకు కొంతమేరకు ఆశలు నింపుతుంటాయి. అధికార పార్టీని హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తుంటాయి. విపరీతమైన ఓట్ల కొనుగోళ్లు, వాగ్గానాల పరంపర లేకుండా స్వచ్ఛంగా ఎన్నికలు సాగాలి. అప్పుడు ప్రజలు ప్రభుత్వ, ప్రతిపక్షాల పట్ట తమ వైఖరిని స్పష్టంగా చెప్పడానికి ఉప ఎన్నికలు దోహదం చేస్తుంటాయి.

స్థానాలు తారుమారు…

ఇప్పుడు సాగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవే. మరో రెండేళ్లలో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీ సర్వశక్తులను మోహరిస్తోంది. రాష్ట్రాన్ని సాకారం చేసిన కాంగ్రెసు పార్టీ చావో రేవో అన్నట్లుగా తలపడుతోంది. అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకమే. కానీ ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి తన స్థానానికి పెద్దగా ఢోకా లేదు. కానీ ప్రదాన ప్రతిపక్షంగా ప్రజలు ఏపార్టీని గుర్తిస్తున్నారనే విషయమై ఒక క్లారిటీ రావచ్చు. తనకు పోటీదారుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎవరుంటారనే విషయమై ఈ ఎన్నికలను బట్టి టీఆర్ఎస్ అంచనా వేసుకోవచ్చు. బీజేపీ నాగార్జునసాగర్ లో గెలవకపోయినా డిపాజిట్లు దక్కించుకుని మిగిలిన రెండు పార్టీల దరదాపుల్లోకి వచ్చిందంటే కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే. ఎందుకంటే నాగార్జున సాగర్ లో బీజేపీకి సంస్థాగతంగా పెద్దగా బలం లేదు. బలమైన అభ్యర్థి కూడా బరిలో లేరు. అయినా గణనీయమైన స్థాయిలో ఓట్లు తెచ్చుకోగలిగిందంటే కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా మారి తీరుతుంది. అధికార టీఆర్ఎస్ ఓటమి చవిచూసినా, బొటాబొటి ఓట్లతో గట్టెక్కినా ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే చెప్పాలి. ప్రతిష్ఠాత్మకమైన స్థానంలోనూ కాంగ్రెసు ఓటమి చవి చూస్తే భవిష్యత్ ఎన్నికల్లో అధికార పోరులో గట్టెక్కడం కష్టమేనని అర్థం చేసుకోవాలి.

కళ యా.. కల యా..?

తిరుపతిలో పోటాపోటీ వాతావరణాన్ని కల్పించగలిగామని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు. జనసేన, బీజేపీ కాంబినేషన్ తొలిసారిగా కలిసి చట్టసభకు పోటీ చేస్తున్న తరుణం. మతపరమైన సెంటిమెంటుతో కూడిన ప్రాంతం. అందువల్ల మంచి ఫలితం లభిస్తుందనే అంచనాతో ఉంది బీజేపీ. తెలుగుదేశానికి ఇది ప్రాణాంతకమైన ఎన్నిక. వారం రోజులకు పైగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తన ప్రతిపక్స స్థానాన్ని బీజేపీ ఎగరవేసుకుపోతుందేమోననేది ఆయన భయం. నిజంగానే ఇక్కడ టీడీపీ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగితే తెలుగుదేశం రాష్ట్రంలో చాప చుట్టేసినట్లే లెక్క. అధికారపార్టీకి చెక్ పెట్టి, బీజేపీ- జనసేన కాంబినేషన్ ను అదుపులో ఉంచాలంటే వైసీపీకి దీటైన ప్రత్యర్థిగా తెలుగుదేశం నిలవగలగాలి. అధికారపార్టీ నెగ్గినప్పటికీ మెజార్టీని లక్ష ఓట్ల లోపునకు కుదించగలగాలి. అప్పుడు నిజమైన ప్రత్యామ్నాయంగా టీడీపీ నిలుస్తుంది. టీడీపీ చేస్తున్న ప్రచారానికి ప్రజలు ఏవిధంగా స్పందిస్తున్నారో ఎన్నిక ఫలితం తేలుస్తుంది. బీజేపీ, జనసేన బలహీనమైన తృతీయ ప్రత్యామ్నాయంగానే ఉంటాయా? బలమైన పోటీదారుగా భవిష్యత్తులో రూపుదాలుస్తాయా? అన్న అంశమూ తేలిపోతుంది.

హస్తవాసికి అగ్ని పరీక్ష..

జాతీయ పార్టీ కాంగ్రెసుకు అన్ని పార్టీలకంటే అగ్నిపరీక్ష. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కాంగ్రెసు శకం ముగిసింది. డిపాజిట్లు సైతం రావనేది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. తెలంగాణలో తుది సమరానికి సిద్ధమవుతోంది. తన స్తానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ అన్ని హంగులతో తయారవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎన్నిక రావడం కాంగ్రెసు పార్టీకి పెద్ద వరం లాంటిదే. అక్కడ బలమైన నాయకుడు, జానారెడ్డి పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. గతంలో ఏడు సార్లు ఈ ప్రాంతం నుంచి గెలిచిన వ్యక్తి. ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి. ఈ ఎన్నికలో కాంగ్రెసు గెలవక తప్పదు. లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు భవిష్యత్తులో పోటీ ఇవ్వగలమనుకోవడం భ్రమగానే మిగులుతుంది. బీజేపీ పుంజుకుంటుంది. జానారెడ్డి ఓడిపోయారనే మాట పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల బీజేపీ, టీఆర్ఎస్ ల కంటే కాంగ్రెసు పార్టీకే ఈ గెలుపు చాలా అవసరం. రెండు తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నికలు ప్రజల పర్సప్షన్ ను పట్టి చూపి పార్టీల భవితవ్వానికి దిక్సూచిగా నిలవబోతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News