చేసుకున్నోళ్లకు….చేసుకున్నంత…!!!

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ ఓడినంత మాత్రాన ఆదరించిన పార్టీని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లడం మాత్రం కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే. ఎన్నికలకు ముందు సీట్ల [more]

Update: 2019-07-05 14:30 GMT

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ ఓడినంత మాత్రాన ఆదరించిన పార్టీని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లడం మాత్రం కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే. ఎన్నికలకు ముందు సీట్ల కోసం పోట్లాడి తీరా సీటు సాధించుకుని ఓటమి పాలయిన తర్వాత పార్టీని విడిచి వెళ్లడం ఇటీవల కాలంలోనే చూస్తున్నాం. ఇక్కడ పార్టీ అధిష్టానం స్వయంకృతాపరాధమే ఎక్కువగా కన్పిస్తుంది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకూ బలంగా ఉంది. కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన టీజీ వెంకటేష్ లాంటి నేతలు పార్టీకి అన్నిరకాలుగా దన్నుగా నిలిచారు.

గ్రూపు రాజకీయాలతో…..

కర్నూలు నగర నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీజీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకుంది. అప్పటి నుంచి కర్నూలు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎస్వీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యులుగా తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ పార్టీ కాడిని వదిలేశారు.

టీజీకి టిక్కెట్ ఇచ్చినా…..

ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి టీడీపీ టిక్కెట్ దక్కుతుందని భావించారంతా. చంద్రబాబునాయుడు కుమారుడు, అప్పటి మంత్రి నారా లోకేష్ కూడా ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ కన్ఫ్మర్మ్ చేశారు. దీంతో తనకు టిక్కెట్ ఖచ్చితంగా దక్కుతుందని భావించినా చివరి నిమిషంలో టిక్కెట్ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు చంద్రబాబునాయుడు టిక్కెట్ కేటయించారు. దీంతో మనస్తాపానికి గురైన ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు.

టీజీ బీజేపీలో చేరడంతో…..

ఎన్నికల తంతు పూర్తయింది. కర్నూలులో ఏ ఒక్క స్థానమూ టీడీపీ గెలుచుకోలేకపోయింది. టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కూడా ఓటమిపాలయ్యారు. తాజాగా టీజీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కు ఎవరూ లేకుండా పోయారు. టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవితో పాటు కుమారుడికి టిక్కెట్ ఇచ్చినా పార్టీని వీడటాన్ని టీడీపీ స్వయంకృతాపరాధంగా అక్కడి నేతలు భావిస్తున్నారు. తండ్రి బీజేపీలో చేరడంతో భరత్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా కర్నూలు నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కు లేకుండా పోయింది.

Tags:    

Similar News