టీజీ కన్ఫ్యూజన్ లో ఉన్నారా?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలు పట్టణంలో మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో తిరిగి ఆయన యాక్టివ్ గా కనపడుతున్నారు. బీజేపీ [more]

Update: 2020-01-18 14:30 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కర్నూలు పట్టణంలో మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో తిరిగి ఆయన యాక్టివ్ గా కనపడుతున్నారు. బీజేపీ నేత కావడంతో ఆయన కామెంట్స్ కు ప్రాధాన్యత ఖచ్చితంగా లభిస్తుంది. పైగా రాయలసీమలో జరుగుతున్న ఉద్యమానికి పరోక్షంగా దన్నుగా టీజీ వెంకటేష్ ఉంటున్నారు. గత కొంతకాలంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఉద్యమం జరుగుతుంది.

తొలుత సమర్థించి…..

అయితే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన అసెంబ్లీలో ప్రస్తావించడం, అందులో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉంటుందని తెలిపడంతో తొలినాళ్లలో కర్నూలు ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రతిపాదనను తొలుత టీజీ వెంకటేష్ కూడా సమర్థించారు. అయితే కొద్దిరోజుల నుంచి ఆయన స్వరం మార్చారు. కర్నూలులోనూ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు మినీ సెక్రటేరియట్ ల ప్రతిపాదనను కూడా టీజీ వెంకటేష్ పదే పదే తెస్తున్నారు.

తనయుడి కోసమేనా?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కర్నూలు పట్టణ నియోజకవర్గంలో తనయుడికి గ్రౌంగ్ ప్రిపేర్ చేసే పనిలో టీజీ వెంకటేష్ ఉన్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లినా అక్కడ టిక్కెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా వైసీపీలోనే ఉన్నారు. దీంతో తన కుమారుడిని టీడీపీలోనే కొనసాగించేందుకు టీజీ వెంకటేష్ డిసైడ్ అయ్యారు.

వచ్చే ఎన్నికల నాటికి…..

టీడీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి మెరుగుపడుతుందన్న ఆశలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉండే అవకాశముందని టీజీ వెంకటేష్ భావిస్తున్నారు. అందుకే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టినా ఈ ప్రాంత ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదంటూనే రాజధానిని ఇక్కడే పెట్టాలని, అందుకు అవసరమైన ప్రభుత్వ భూమి కూడా ఉందని టీజీ వెంకటేష్ చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలను తప్పుపడుతూనే మరోవైపు వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీజీ వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద టీజీ వెంకటేష్ కు రాయలసీమ బాగోగుల కంటే తనయుడి రాజకీయ భవిష్యత్ పైనే ఎక్కువ బెంగ ఉన్నట్లు ఆయన విరుద్ధమైన ప్రకటనలు చూస్తుంటే అర్థమవుతుంది.

Tags:    

Similar News