మిషన్ కాశ్మీర్…!!

కశ్మీర్…. ఇప్పుడు ఈ సరిహద్దు రాష్ట్రం అప్రకటిత రణ రంగాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా భద్రతాబలగాల హెచ్చరికలు, బూట్ల చప్పుళ్లు, వాహనాల రొదలు, గాలిలోకి కాల్పులతో జమ్మూ [more]

Update: 2019-08-05 16:30 GMT

కశ్మీర్…. ఇప్పుడు ఈ సరిహద్దు రాష్ట్రం అప్రకటిత రణ రంగాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా భద్రతాబలగాల హెచ్చరికలు, బూట్ల చప్పుళ్లు, వాహనాల రొదలు, గాలిలోకి కాల్పులతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఓ రకమైన భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. సామాన్య ప్రజలు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. సాయంత్రానికే జనం లేక వీధులన్నీ నిర్మానుష్యమయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరగుతోందన్న అనుమానాలు మాత్రం ప్రజల్లో బలంగా ఉన్నాయి. వాటికి సమాధానం దొరికింది వాటి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు వారిని వెంటాడుతున్నాయి. ఇది రాష్ట్ర ప్రగతికి దారితీస్తుందా? లేక ఇంకా పరిస్థితి మరింత దిగజారుతుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న మాట మాత్రం అందరూ అంగీకరించే చేదు నిజం. దీనిని నిజం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు బిల్లును రద్దు చేశారు. 35ఎ అధికరణాన్ని రద్దు చేశారు. జమ్మూకాశ్మీర్ ను రెండు గా చీల్చారు.

అనేక ఆలోచనలతో…..

వారం వ్యవధిలోనే రాష్ట్రానికి 38 వేల మంది భద్రతాబలగాలను కేంద్ర ప్రభుత్వం తరలించింది. రాష్ట్ర రాజధాని శ్రీనగర్ తో పాటు కాశ్మీర్ లోయ వ్యాప్తంగా బలగాలను మొహరించారు. అనేక కీలక ప్రాంతాలను అవి తమ అధీనంలోకి తీసుకున్నాయి. భద్రతా పరిస్థితులు ఇందుకు కారణమని చెబుతున్నా ప్రజలు, పరిశీలకుల్లో మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 35ఎ, 370 అధికరణాల రద్దు, జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం, ఆగస్టు 15వ తేదీన శ్రీనగర్ లో మోదీ జాతీయ పతాకావిష్కరణ, అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించడం దిశగా రాష్ట్రంలోని పరిస్థితులు సాగుతున్నాయని వారం రోజులుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాలను తోసిపుచ్చే పరిస్థితి లేదని తేలింది. కాశ్మీర్ పై మొదటి నుంచి ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం ఈ కార్యచరణ దిశగా అడుగులు వేసింది. 35ఎ, 370 అధికరణల రద్దు ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి తీవ్రవాదాన్ని అణిచివేయవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ అధికరణల వల్ల కేంద్రం కాళ్లు, చేతులు కట్టేసినట్లయింది. హిందువులు అధికంగా ఉన్న ప్రశాంత పరిస్థితులు ఉన్న జమ్మూను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపవచ్చు. అదే సమయంలో ఉగ్రవాదం విస్తరించిన, తరచూ అల్లర్లకు కారణమైన కాశ్మీర్ లోయను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కేంద్రం లక్ష్యంగా కనపడింది. తద్వారా అక్కడి పరిస్థితులను పూర్తిగా అధీనంలోకి తెచ్చుకుని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయవచ్చని కేంద్రం భావిస్తోంది.

స్వతంత్ర వేడుకలు…..

ఏటా ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవాలను ప్రారంభించే ప్రధాని మోదీ ఈసారి జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని ప్రతిష్టాత్మక లాల్ చౌక్ లో జెండా ఆవిష్కరిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా ప్రజల్లో జాతీయ భావనలను మరింత పెంచవచ్చన్నది కేంద్రం వ్యూహంగా కనపడుతోంది. కేంద్ర బడ్జెట్ ను మార్చి 31కి బదులు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టడం, రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో విలీనం చేయడం వంటి నిర్ణయాలను అమలుపరుస్తున్న కేంద్రం తాజాగా పతాకావిష‌్కరణపై వెనకడుగు వేయకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

పాగా వేయడానికే…..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోణంలో కూడా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు వాటి తోక పార్టీలుగా ఉన్నాయి తప్ప కీలక పాత్ర పోషించలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని ఈసారి కొనసాగనీయరాదని మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఉగ్రవాదం కారణంగా 90వ దశకంలో రాష్ట్రాన్ని వీడి వలస వెళ్లిపోయిన కాశ్మీరీ పండిట్లను వెనక్కు రప్పించాలన్న వ్యూహం రచిస్తోంది. ఒకవేళ వారు వస్తే రక్షణ కల్పించేందుకే భద్రతాబలగాలను మొహరించారన్న వాదన ఉంది. సహజంగా హిందువులైన కాశ్మీరీ పండిట్లు తమ ఓటు బ్యాంకుగా మారుతారని, తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందవచ్చన్నది కమలం పార్టీ వ్యూహం. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు ఓటు హక్కు కల్పించాలన్నది కమలం పార్టీ మరో ఆలోచన. తద్వారా వారు కూడా ఎన్నికల్లో తమ వైపు మొగ్గు చూపుతారన్నది కమలం పార్టీ ఆశ. ఈ చర్యల వల్ల ఎన్నికల్లో ముస్లిం పార్టీలను అడ్డుకోవచ్చన్నది ఆలోచన. మొత్తం మీద మోదీ మిషన్ కాశ్మీర్ చేపట్టారు. నేడు జరిగిన పరిణామాలను న్యాయనిపుణులు, మేధావులు సయితం స్వాగతిస్తుండటం విశేషం.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News