దేవుళ్ళు బాధితులే …. ఏడాది వరకూ అంతేనా?

గుడి, మసీదు, చర్చి ఏదైనా అందులో ఉన్న దేవుళ్ళు లాక్ డౌన్ బాధితులుగా మారిపోయారు. ఆయా ప్రార్ధన మందిరాల్లో వారికి అన్ని సేవలు యధావిధిగానే జరుగుతున్నాయి. కానీ [more]

Update: 2020-05-05 08:00 GMT

గుడి, మసీదు, చర్చి ఏదైనా అందులో ఉన్న దేవుళ్ళు లాక్ డౌన్ బాధితులుగా మారిపోయారు. ఆయా ప్రార్ధన మందిరాల్లో వారికి అన్ని సేవలు యధావిధిగానే జరుగుతున్నాయి. కానీ అదీ భక్తులు లేకుండానే కావడంతో ప్రార్ధన మందిరాల దగ్గర కళాకాంతులు లేవు. ఏపీ వరకు చూసుకుంటే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల శ్రీనివాసుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీశైలం మల్లన్న, చిన్న తిరుపతిగా వెలుగొందే ద్వారక తిరుమల, అన్నవరం సత్యనారాణ స్వామి వారు, సింహాద్రి అప్పన్న పంచారామ క్షేత్రాలు ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి బోసి పోతూ కనిపిస్తున్నాయి.

ఎప్పటికి తెరుచుకుంటాయి …?

లాక్ డౌన్ ఎత్తివేసినా చివరివరకు ఆంక్షలు కొనసాగే వాటిలో ప్రార్ధనాలయాలు ఉన్నాయి. అవి తీసేందుకు అనుమతి ఇచ్చినా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించే భక్తులు భగవంతుడిని ఆరాధించక తప్పదు. వైరస్ కి వ్యాక్సిన్ దొరికే వరకు ఇదే విధానం కొనసాగించ నున్నారు. దాంతో ఇప్పుడు అన్ని సంస్థలు లాగే ప్రార్ధనాలయాల ఆర్థికపరిస్థితి దీనంగా మారింది. భక్తులు ఇచ్చే కానుకలతో కోట్లాదిరూపాయల అర్చకుల జీతభత్యాలు, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణ ప్రార్ధనాలయాలకు కత్తిమీద సాముగా మారనుంది.

దర్శనాలకు కఠిన ఆంక్షలు …

దేవాలయాలలోకి లేదా ఇతర ప్రార్ధనాలయాల లోకి ప్రవేశాలకు సంబంధించి కఠిన ఆంక్షలు విధించే నేపథ్యంలో భగవంతుడిని దర్శించాలనుకునే భక్తులకు ఇక్కట్లు తప్పకపోవొచ్చు. అదే విధంగా మరో ఏడాదిపాటు తీర్ధయాత్రలు, విహార యాత్రలకు ప్రజలు వెళ్లేందుకు వెనుకాడతారు. కనుక ప్రార్ధనాలయాలకు పూర్వవైభవం చాలాకాలమే పట్టేలా ఉంది. దీనిపైన ఇప్పుడు అటు ప్రభుత్వం ఇటు దేవాదాయశాఖ కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ప్రార్ధనాలయాల పరిస్థితి ఇదే విధంగా ఉంది.

Tags:    

Similar News