దగ్గరవ్వాల్సిన సమయంలో దూరంగా..??

టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కృష్ణా జిల్లాలో గ‌త కాల‌పు జోష్ నేడు క‌రువైందా ? కీల‌క‌మైన నాయ‌కులు మౌనం వ‌హించారా? పార్టీ ఏమైనా మ‌న‌కు ఎందుకులే! అనుకుంటున్నారా? [more]

Update: 2019-07-03 13:30 GMT

టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కృష్ణా జిల్లాలో గ‌త కాల‌పు జోష్ నేడు క‌రువైందా ? కీల‌క‌మైన నాయ‌కులు మౌనం వ‌హించారా? పార్టీ ఏమైనా మ‌న‌కు ఎందుకులే! అనుకుంటున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కు లు. 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ మొత్తం 16 స్థానాల్లో మెజారిటీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. కానీ, 2019కి వ‌చ్చే స‌రికి కేవ‌లం రెండు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. గ‌న్నవ‌రం, విజ‌య‌వాడ తూర్పు స్థానాల్లో విజయంతోనే స‌రిపెట్టుకుంది. మ‌రి ఈ నేప‌థ్యంలో జిల్లాలో పార్టీని ఏ విధంగా ముందుకు న‌డిపించాల‌నే విష‌యంపై ఎక్కడా అంత‌ర్మథ‌నం సాగ‌క‌పోవ‌డం చిత్రంగా ఉంది.

వారి జాడ ఏదీ?

జిల్లా నుంచి ఇద్దరు కీల‌క నాయ‌కులు మంత్రులుగా ఉన్నారు. ఒక‌రు డిప్యూటీ స్పీక‌ర్‌గా చ‌క్రం తిప్పారు. దేవినేని ఉమ, కొల్లు ర‌వీంద్రలు చంద్రబాబు పాల‌నా కాలంలో మంత్రులుగా ఉంటే, మండ‌లి బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. అయితే, తాజా ఎన్నిక‌ల్లో మాత్రం వీరు ఓట‌మి పాల‌య్యారు. అదే స‌మ‌యంలో కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా టీడీపీ పోగొట్టుకుంది. ఈ నేప‌థ్యంలో పార్టీని వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి బ‌లోపేతం చేయ‌డంపై నాయ‌కులు దృష్టి పెడ‌తార‌ని టీడీపీ అభిమానులు భావించారు. కానీ, నేటికీ ఆ నాయ‌కులు జాడ లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క, గెలిచిన ఇద్దరూ కూడా త‌మ ప‌నుల్లో తాము బిజీ అయిపోయారు.

బాబుకు దూరంగా….

గ‌న్నవ‌రం నుంచి టీడీపీ అభ్యర్థిగా వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ విజ‌యం సాధించారు. విజ‌య‌వాడ తూర్పు నుంచి గ‌ద్దె రామ్మోహ‌న్ జ‌య‌కేత‌నం ఎగురవేశారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ కూడా పార్టీ అధినేత‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, పార్టీలోనే ఉన్నా.. త‌మ ప‌నుల్లో బిజీ అయిపోయారు. ఇక‌, మండ‌లి అయితే, ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబుకు ట‌చ్‌లోకి వ‌చ్చింది కూడా లేదు. మిగిలిన వారిలో ఓడిపోయిన దేవినేని అవినాష్ మాత్రం జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నా.. స్థాయికి మించి చేస్తున్నార‌ని అంటున్నారు.

ఓటమి పాలయిన తర్వాత….

ఇక ఉమ అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి హ‌డావిడి చేస్తున్నారు. ఉమా కౌంట‌ర్లకు వైసీపీ వాళ్లు రీ కౌంట‌ర్లు ఇస్తున్నా మిగిలిన టీడీపీ నేత‌లు ఎవ్వరూ ప‌ట్టించుకోవడం లేదు. ఇక మ‌రో మంత్రి కొల్లు ర‌వీంద్రతో పాటు జిల్లాలోని తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన మ‌రో మాజీ మంత్రి కేఎస్‌.జ‌వ‌హ‌ర్ కూడా ఎక్కడా క‌న‌ప‌డ‌డం లేదు. వీరి సంగ‌తి ఇలా ఉంటే ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌ల్లో మిగిలిన వారు ఎక్కడా కూడా మీడియా ముందుకు కూడా రావ‌డం లేదు. ఇక అనూహ్యంగా ఎంపీగా రెండోసారి గెలిచిన కేశినేని నాని మాత్రం చంద్ర‌బును ఇబ్బంది పెట్టేలా ఫేస్‌బుక్ పోస్టుల‌తో షాక్ ఇస్తున్నారు. జిల్లాలో గెలిచిన త‌న‌ను కాద‌ని… ఓడిన ఉమాకు బాబు ప్రయార్టీ ఇవ్వడం ఆయ‌న‌కు న‌చ్చడం లేదు. కేశినేని ముక్కుసూటి శైలీ బాబును ఎప్పటికప్పుడు ఇర‌కాటంలో పెడుతూనే ఉంది. మ‌రి ఈ ప‌రిస్థితిని చ‌క్కదిద్ది కంచుకోట వంటి జిల్లాలో పూర్వ వైభ‌వం దిశ‌గా పార్టీని న‌డిపించే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు పైనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News