సీనియ‌ర్ రాంగ్ స్టెప్‌తోనే ఓటమా

2019 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కేవ‌లం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల‌కే ప‌రిమితమై పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. అయితే.. ఇక్కడ‌, కొన్ని స్థానాల‌ను [more]

Update: 2019-07-10 06:30 GMT

2019 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. కేవ‌లం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల‌కే ప‌రిమితమై పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. అయితే.. ఇక్కడ‌, కొన్ని స్థానాల‌ను మాత్రం టీడీపీ చేజేతులా పోగొట్టుకుంది. అన‌వ‌స‌ర‌పు ప్రయోగాల‌కు పోయి చేతులు కాల్చుకుంది. అందుకే కంచుకోట‌ల్లోనూ ఓట‌మి ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్కడ చేసిన ప్రయోగం పార్టీ ఓట‌మికి కార‌ణ‌మైంద‌నే టాక్ త‌మ్ముళ్లలో బ‌లంగా వినిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆ పార్టీకి అండ‌గా నిలుస్తోంది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాన్ని కోల్పోవ‌డంతో పార్టీవ‌ర్గాలు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయాయి.

వరస విజయాలనందిస్తూ….

2009కి ముందు సోంపేట నియోజకవర్గంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనతో పలాస నియోజకవర్గంగా ఈ ప్రాంతం ఏర్పడింది. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచీ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబానికి ఆధిప‌త్యం. ఆయ‌న‌ తొలిసారి ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే. గౌతు లచ్చన్న ఐదుసార్లు ఇక్కడి నుంచే వరుసగా పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయ‌న త‌న‌యుడు గౌతు శ్యాం సుందర శివాజీ, సోంపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలవగా, పలాస నుంచి ఒకసారి విజయం సాధించారు. గౌతు కుటుంబానికి ప్రజ‌లు అంత‌లా అండ‌గా నిలిచారు. టీడీపీ దశాబ్దాలుగా ఇక్కడ జెండా ఎగురవేయగలిగింది.

మంత్రి పదవి దక్కక పోవడంతో….

2014 ఎన్నికల్లో పలాస నుంచి గెలిచిన త‌ర్వాత గౌతు శివాజీ త‌నకు మంత్రిప‌ద‌వి వస్తుంద‌ని అనుకున్నారు. కానీ.. ఆయ‌న‌ను చంద్రబాబు మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు. దీంతో ఇక తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అప్పట్లో ఆయ‌న చేసిన ప్రక‌ట‌న పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. 2019 ఎన్నిక‌ల్లో శివాజీ వారసురాలిగా ఆయన కుమార్తె గౌతు శిరీషను పలాస నుంచి టీడీపీ ఎన్నికల బరిలో దించింది. అయితే.. ఇక్కడే టీడీపీ వ్యూహాత్మక త‌ప్పిందం చేసింద‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. శిరీషకు రెండు సార్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌డం, అంతేగాకుండా సొంత ఖ‌ర్చుల‌తో పార్టీ కార్యాల‌యం నిర్మించ‌డం.. ఇలా ప‌లు కార‌ణాల‌తో ఆమెకు టికెట్ కేటాయించార‌ట‌.

ప్రత్యర్థి బలాబలాలను….

అయితే.. వైసీపీ నుంచి అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన అభ్యర్థి సీదిరి అప్పలరాజు బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డంలోకూడా టీడీపీ పెద్దలు విఫ‌లం అయ్యారు. అప్పల‌రాజు త‌మ‌కు పోటీయే కాద‌నే ధీమాతో తెలుగు త‌మ్ముళ్లు ఉండిపోయారు. కానీ.. కొద్దిరోజుల్లోనూ ప‌రిస్థితులు మారిపోయాయి. అప్పల‌రాజు క్రమంగా ప్రజ‌ల ఆద‌ర‌ణ పొందారు. ఏకంగా టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టారు. తీరా ఫ‌లితం చూశాక టీడీపీ వ‌ర్గాలు తెల్లబోయి చూడ‌డం త‌ప్ప మిగిలిందేమీ లేదు. అందుకే ప‌రిస్థితులు అనుకూలంగా లేన‌ప్పుడు అన‌స‌వ‌స‌ర‌పు ప్రయోగాల‌కు పోవ‌ద్దని.. ఒక‌వేళ శివాజీ పోటీ చేసి ఉంటే సుల‌భంగా గెలిచేవార‌ని నియోజ‌క‌వ‌ర్గ త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News