నంద్యాల ఈసారి అలా కాదట…!!!

ఇద్దరు యువనేతల మధ్య పోరుతో నంద్యాల నియోజకవర్గం ఈ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. 2017లో జరిగిన ఉప ఎన్నికలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నంద్యాల [more]

Update: 2019-03-23 09:30 GMT

ఇద్దరు యువనేతల మధ్య పోరుతో నంద్యాల నియోజకవర్గం ఈ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. 2017లో జరిగిన ఉప ఎన్నికలతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నంద్యాల నియోజకవర్గంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందనే అంచనాలు ఉండగా ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. పోటీలో ఉండే ముగ్గురు నేతలూ బలమైన వారే కావడంతో నంద్యాలలో తీవ్ర పోటీ ఉంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక, మరోసారి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

బలంగా ఉన్న రెండు పార్టీలు

నంద్యాల నియోజకవర్గ చరిత్ర చూస్తే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ రెండూ బలంగానే ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కాగా ఆ స్థానాన్ని వైసీపీ భర్తీ చేసింది. దీంతో వైసీపీ, టీడీపీ నువ్వునేనా అనే రేంజ్ లో పోటీ పడుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 3,604 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో వైసీపీ హవా వీయడం, శోభానాగిరెడ్డి మృతితో సానుభూతి రావడం, ప్రత్యేకంగా తనకంటూ వర్గం ఉండటంతో భూమా నాగిరెడ్డి ఆ ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరి కొంతకాలానికి హఠాన్మరణం చెందారు. దీంతో 2017లో ఉప ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరపున భూమా నాగిరెడ్డి వారసుడిగా ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. దీంతో అప్పటివరకు టీడీపీలో ఉన్న శిల్పా కుటుంబం వైసీపీలో చేరింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో శిల్పామోహన్ రెడ్డిపై బ్రహ్మానందరెడ్డి 27 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భూమానాగిరెడ్డి మరణ, అధికార టీడీపీ అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో ఇక్కడ శిల్పామోహన్ రెడ్డి ఓడిపోయారు.

టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ

ఆ ఎన్నికల్లో సవాల్ చేసినట్లుగా ఓటమి తర్వాత ఆయన రాజకీయాలకు దూరమై తన కుమారుడు శిల్పారవికిషోర్ రెడ్డిని రంగంలోకి దింపారు. రెండేళ్లుగా శిల్పారవి ఇక్కడ పార్టీ బాధ్యతలను తీసుకొని పనిచేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో అందరినీ కలుపుకొనిపోతూ ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నించారు. తన తండ్రికి ఉన్న పేరు, శిల్పా కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి వస్తుందని, ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామని శిల్పా కుటుంబం ధీమాగా ఉంది. ఇక, రెండేళ్లుగా ఎక్కువగా ప్రజల్లో ఉండేందుకు బ్రహ్మానందరెడ్డి ప్రయత్నించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొంతమేర నెరవేరడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. ఇక్కడ ముస్లింలు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్న ఫరూక్ కు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది.

టీడీపీకి రెబల్ బెడద

టీడీపీ టిక్కెట్ తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి కావాలని సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆశించారు. భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మళ్లీ బ్రహ్మానందరెడ్డికే టిక్కెట్ దక్కడంతో వీరిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డితో భూమా కుటుంబానికి దూరం పెరగడంతో ఆయన వారికి సహకరించే పరిస్థితి లేదు. ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి కూడా ఇక్కడ మంచి పట్టుంది. దీంతో వీరిద్దరి ప్రభావం తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. మొత్తానికి యువనేతల పోరుతో నంద్యాలలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీలో భూమా బ్రహ్మానందరెడ్డికి గెలుపు అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News