టీడీపీ అలా… వైసీపీ ఇలా..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఓ ముద్రను ఈసారి తుడిపేసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మెహన్ రెడ్డి ప్రయత్నించారు. తనది కుటుంబం పార్టీగా ప్రత్యర్థులు చేసే [more]

Update: 2019-04-02 02:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఓ ముద్రను ఈసారి తుడిపేసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మెహన్ రెడ్డి ప్రయత్నించారు. తనది కుటుంబం పార్టీగా ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు. గతానికి భిన్నంగా టిక్కెట్లిచ్చిన ఆయన ఈసారి కుటుంబసభ్యులను పోటీకి దూరంగా పెట్టారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వారికి కూడా టిక్కెట్లు ఇవ్వలేదు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం కొత్తగా ఇద్దరికి టిక్కెట్లు ఇచ్చి కుటుంబ పార్టీ అని ఇతరులను విమర్శించలేని పరిస్థితి తెచ్చుకుంది.

కుటుంబం నుంచి జగన్ ఒక్కరే

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన కుటుంబ పార్టీ అనే ఆరోపణలు ప్రత్యర్థులు బాగా చేశారు. టిక్కెట్ల కేటాయింపు కూడా ఇందకు కారణం. జగన్ పులివెందుల అసెంబ్లీకి, విజయమ్మ విశాఖపట్నం పార్లమెంటుకు, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంటుకు, తమ్ముడు అవినాష్ రెడ్డి కడప పార్లమెంటుకు, మామ రవింద్రనాథ్ రెడ్డి కమలాపురం అసెంబ్లీకి పోటీ చేశారు. వీరిలో విజయమ్మ ఒక్కరు ఓడిపోగా మిగతా వారంతా గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ జగన్ కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం జరిగింది. విజయమ్మను లేదా షర్మిలను పార్లమెంటుకు పోటీ చేయిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఒంగోలు, అనంతపురం పార్లమెంటు స్థానాల నుంచి వీరి పోటీ ఉండవచ్చని అనుకున్నారు. కానీ, వీరిద్దరినీ ఈసారి ఎన్నికల బరికి దూరంగా ఉంచారు జగన్. వీరితో పాటు చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఒంగోలు టిక్కెట్ ఇవ్వకుడా మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చారు. అయితే, పోటీ చేయకున్నా జగన్ విజయం కోసం ఆయన కుటుంబసభ్యులు బాగా శ్రమిస్తున్నారు. విజయమ్మ, షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ సతీమణి భారతి పులివెందుల బాధ్యతలు తీసుకొని ప్రచారం చేస్తున్నారు.

వారసులకు టిక్కెట్లు కట్టబెట్టిన టీడీపీ

ఇక, తెలుగుదేశం పార్టీ మాత్రం గతానికి భిన్నంగా ఈసారి కుటుంబం నుంచి ఇద్దరికి కొత్తగా టిక్కెట్లు ఇచ్చింది. ఇంతవరకు చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి మాత్రం నారా లోకేష్ కు కూడా టిక్కెట్ ఇచ్చి మంగళగిరి నుంచి బరిలో నిలిపారు. ఇక, లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కు విశాఖపట్నం పార్లమెంటు టిక్కెట్ కేటాయించారు. ఇక, పార్టీ నేతల్లోనూ సుమారూ 15 మంది సీనియర్ నేతల కుమారులు, కూతుళ్లకు టిక్కెట్లు దక్కాయి. ఈ విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరించారు. గెలుపోటములను ఆలోచించకుండా సీనియర్ నేతలు అడగగానే వారి వారసులకు టిక్కెట్లిచ్చారు. ఈ విధంగా ఈ ఎన్నికల్లో కుటుంబ పార్టీ అనే ముద్రను తొలగించుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించగా చంద్రబాబు మాత్రం కుటుంబానికి, నేతల వారసులకు పెద్దపీట వేసి కుటుంబ పార్టీగా కొత్త ముద్ర వేసుకున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సైతం తన అన్న నాగబాబును కొత్తగా తీసుకువచ్చి పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారు.

Tags:    

Similar News