మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చినా ఆటలో మాత్రం..?

వారు ముగ్గురూ మంత్రులుగా పనిచేసిన వారే. దశాబ్దాల పాటు రాజకీయం చేసి ప్రజల మన్ననలను పొందిన వారే. కానీ వారి వారసులు మాత్రం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో [more]

Update: 2020-08-17 12:30 GMT

వారు ముగ్గురూ మంత్రులుగా పనిచేసిన వారే. దశాబ్దాల పాటు రాజకీయం చేసి ప్రజల మన్ననలను పొందిన వారే. కానీ వారి వారసులు మాత్రం రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. పార్టీ విపక్షంలో ఉన్నా ప్రజల వద్దే ఉంటూ రాజకీయం చేసింది ఆ తరం. కానీ ప్రస్తుత యువతరం మాత్రం అధికారం ఉంటేనే రాజకీయం అంటుంది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు యువనేతలు టీడీపీ ఓటమి పాలయిన తర్వాత పత్తా లేకుంగా పోవడం ఆ నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది.

బొజ్జల తనయుడు…..

శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మలిచారు. మంత్రిగా కూడా అనేక పర్యాయాలు చేసిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనారోగ్యం కారణాలతో గత ఎన్నికల్లో పోటీ చేయకుండా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపారు. అయితే వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. సుధీర్ రెడ్డి వైఖరితో కిందిస్థాయి క్యాడర్ వైసీపీ వైపు మరలుతోంది.

గాలి కుమారుడు…..

నగరి నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాశ్ రెడ్డిదీ అదే పరిస్థిితి. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిత్తూరు జిల్లానే ఒకప్పుడు శాసించారు. మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన తనయుడు భాను ప్రకాశ్ రెడ్డి మాత్రం తండ్రి ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారు. నగరి నియోజకవర్గంలో టీడీపీని పటిష్ట చేయాల్సిన భానుప్రకాశ్ రెడ్డి తిరుపతికే పరిమితమయ్యారు. ఎక్కువగా బెంగళూరులోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో నగరి నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ కకా వికలం అయ్యే పరిస్థిితి నెలకొంది.

కుతూహలమ్మ తనయుడు…..

మరో యువనేత హరికృష్ణ. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన గుమ్మడి కుతూహలమ్మ తర్వాత టీడీపీలో చేరారు. ఆమె వయసు మీరడంతో గత ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆమె తనయుడు హరికృష్ణను బరిలోకి దింపారు. అనేక సార్లు విజయం సాధించిన గుమ్మడి కుతూహలమ్మ తనయుడిని మాత్రం గెలిపించుకోలేకపోయారు. హరికృష్ణ గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైపే కన్నెత్తి చూడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లోనూ హరికృష్ణ యాక్టివ్ గా లేరు. ఇలా సీనియర్ నేతలు తమ కుమారులకు మంచి పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఇచ్చినా వారు మాత్రం రాజకీయ ఆటలో వెనకబడి పోతున్నారు.

Tags:    

Similar News