నేరం నాది కాదు...!!

Update: 2018-10-22 14:30 GMT

మహాకూటమి అలియాస్ ప్రజాకూటమి పక్కాలెక్కల్లో పడింది. సీట్ల సంఖ్య ఇదమిత్థంగా ఖరారు కాకముందే ఏయే స్థానాలన్న అంశంపై పార్టీల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు వివాదాస్పదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో సీట్ల సిగపట్లు తప్పకపోవచ్చు. ఆయా జిల్లాల్లో తాము బలంగా ఉన్నామని నాలుగు పార్టీలూ భావిస్తూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పంతాలకు పోతే కూటమి చీలిపోయే ప్రమాదమూ కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఒకవేళ అదే జరిగితే తప్పు తనది కాదు ఎదుటి పక్షానిదే అని నిరూపిస్తూ దూరం జరగాలనేది ఉప పార్టీల ఎత్తుగడ. ప్రధాన పార్టీ కాంగ్రెసు ఆచితూచి వ్యవహరిస్తోంది. అందరూ కలిసివస్తే ఒకటిరెండు శాతం ఓట్లు కలిసివచ్చినా చాలు. గరిష్టంగా ప్రయోజనం సమకూరుతుందని భావిస్తోంది. పెద్దన్నపాత్రలో పెత్తనం చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది కాంగ్రెసు. నిజానికి ఇతర పార్టీల గొంతెమ్మ కోర్కెలు కాంగ్రెసు పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేస్తున్నాయి. మరోవైపు రోజులు దగ్గరపడుతున్నాయి. నెలన్నర వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. సర్దుబాట్లు, సంప్రతింపులు, బుజ్జగింపులు, ప్రచారం వంటివాటికి సమయం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సైకిల్..సై...

అందరూ అత్యాశకే పోతున్నారు. తమ సొంతబలాన్నిమించి డిమాండు చేస్తున్నారు. ప్రత్యర్థి టీఆర్ఎస్ ను ఎదుర్కోవడమనే ఉమ్మడి లక్ష్యానికి గండి కొట్టేలా కోర్కెల చిట్టా విప్పుతున్నారు. ఫలితంగా కూటమి కొంప కొల్లేరు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రమాదాన్ని ప్రధానపక్షమైన కాంగ్రెసుపైకి నెట్టేసి సేఫ్ గేమ్ ఆడాలనే ఎత్తుగడ సాగుతోంది. తాము మునుగుతూ కూటమినీ ముంచేసే పరిస్థితి తలెత్తుతోందని కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కూటమిలో కాంగ్రెసు పార్టీ తర్వాత ప్రధానపక్షంగా నిలిచే టీడీపీ వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే సీట్లను కోరేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వినవస్తోంది. 2014 ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ కనీసం ఆ సంఖ్యలో కూటమి స్థానాలు కేటాయిస్తే చాలనే భావనలో ఉంది. అయితే ముందుగానే ఆ సంఖ్యను ప్రకటిస్తే మరింతగా కుదించి వేస్తారనే భయంతో రెట్టింపు సీట్లు కోరుతోంది. టీడీపీకి సాంకేతికంగా కొన్ని బలహీనతలున్నాయి. ఆంధ్రాలో అధికార పార్టీ కావడం వల్ల తెలంగాణ రాష్ట్రసమితి చాలా సులభంగానే ఆరోపణలు గుప్పించగలుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు టీడీపీతో విఘాతం కలుగుతుందని ధ్వజమెత్తుతోంది. కాంగ్రెసు,టీడీపీ కూటమి కారణంగా రాష్ట్రం మళ్లీ దెబ్బతింటుందనే విమర్శలు ఎక్కుపెడుతోంది. అందుకే టీడీపీని అర్బన్ ప్రాంతాలు, ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు పరిమితం చేస్తే మేలనే భావన కాంగ్రెసు నాయకుల్లో నెలకొంది. పదినుంచి పన్నెండు స్థానాలతో సరిపుచ్చాలని యోచిస్తున్నారు. ఇక్కడ తగ్గే సీట్లను ఎమ్మెల్సీ ఇతర మార్గాల్లో భర్తీ చేసేందుకు భరోసానిస్తున్నారు. సీట్ల విషయంలో పెద్దగా పట్టు పట్టవద్దని చంద్రబాబునాయుడు చెప్పినా నేతలు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే సీట్లను కోరుతున్నారు.

వ్రతం చెడి...

వ్రతం చెడ్డా ఫలం దక్కాలనే భావనలో ఉన్నారు తెలంగాణ జనసమితి నాయకులు. స్వతంత్రంగా పోటీ చేస్తాము . అందరికీ టిక్కెట్లు దక్కుతాయనే అంచనాల్లో కొందరు నాయకులు నియోజకవర్గాల వారీ పనిచేసుకుంటూ వచ్చారు. ఆర్థిక , అంగబలాల సంగతి పక్కనపెట్టినా ఉద్యోగసంఘాలు, నిరుద్యోగ యువకులు కొంతవరకూ తెలంగాణ జనసమితికి మద్దతునిస్తూ వచ్చారు. టీజేఎస్ లో చాలావరకూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఇతర రాజకీయ పార్టీలలో ఎటువంటి ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం లేని నేతలు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లీడర్షిప్ ను నిర్మించుకోవాలనేది పార్టీలోని మెజార్టీ అభిప్రాయం. గెలుపు సాధ్యం కాదన్న సంగతి నాయకులకు తెలుసు. అయితే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలనే తపన ఉంది. మహాకూటమిలో చేరికతో పోటీచేసే అవకాశాన్నికోల్పోతారు. పల్లకి మోయాల్సిన బోయీల పాత్రకు తెలంగాణ జనసమితి పరిమితమవుతుంది. దీనిని టీజేఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోదండరామ్ వంటివారు వాస్తవిక థృక్పథంతో నాయకులను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ముందస్తు ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్య. మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోలేకపోయినా, ఒక్క సీటూ గెలవలేకపోయినా పార్టీ అస్తిత్వం కనుమరుగైపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకోవాలని కోదండరామ్ సూచిస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కాలంటే కనీసం కూటమి నుంచి 18 సీట్లు పొందాలని నాయకులు డిమాండు చేస్తున్నారు. ఇది సాధ్యం కాదని కాంగ్రెసు తేల్చేస్తోంది.

గత వైభవమే....

వామపక్షాల్లో ఒంటరిగా మిగిలిపోయిన సీపీఐ ది గతవైభవమే అని చెప్పవచ్చు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట కూటమి కట్టి భావసారూప్యం ఉన్న విప్లవ పార్టీలను, ప్రజాసంఘాలను సీపీఎం ఆకర్షిస్తోంది. అక్కడ ఆపార్టీదే పెద్దన్న పాత్ర. సీపీఐతో ఇతర వామపక్షాలు జతకట్టే సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. కూటమితో కలిసి నడవడం లేదా ఒంటరిగా వెళ్లడమనే రెండు ఆప్షన్లు మాత్రమే దానిముందున్నాయి. పార్టీ నిర్మాణ పరంగా తెలంగాణలో సీపీఎం బలంగా ఉంది. ఒకటి రెండు సీట్లు గెలవాలన్నా ఏదో ఒక ప్రధానపార్టీతో చేతులు కలపాల్సిందే. లేదంటే సీపీఐ, సీపీఎం వామపక్షాలు కూటమి కడితే ఒక బలమైన శక్తిగా నిలిచేందుకు అవకాశాలున్నాయి. సీపీఎం ఇప్పటికే తన సొంతకుంపటితో దూరం జరిగిపోయింది. కాంగ్రెసుతో చెలిమికి తహతహలాడింది సీపీఐ. ఏదోరకంగా కాంగ్రెసుతో కలిసినడవాల్సిన అనివార్యత వెన్నాడుతోంది. నాలుగైదు సీట్లు మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెసు చెబుతోంది. దానికి అంగీకరించకతప్పదు. లేకపోతే ఒంటరి పోరు ఆత్మహత్యాసదృశమే. ఇప్పుడు బీఎల్ఎఫ్ కూటమి వైపు వెళ్లాలంటే తనను తాను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది సీపీఐ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. గత వైభవాన్ని తలచుకుంటూ రాజీ పడుతుందా? లేక తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఒంటరి పోరాటం చేస్తుందా? అన్నది కమ్యూనిస్టు పార్టీ చాయిస్ కే వదిలేస్తోంది మహాకూటమి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News