అల్లుడికంటే...అంకుల్ అదుర్స్....!

Update: 2018-10-02 15:30 GMT

‘ఒక్కవైపే చూడు. రెండోవైపు చూడొద్దు.’ అంటూ తనదైన బాణిలో దూసుకుపోయే బాలయ్యను ఈసారి తెలంగాణలో తమ స్టార్ క్యాంపెయినర్ గా ఎంచుకుంది టీడీపీ. ఈ రాష్ట్ర ప్రజల్లో ఎన్టీయార్ పట్ల సానుకూల దృక్పథం ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో తెలంగాణలో ప్రచార విషయంలో కొంత ఇబ్బందికరపరిస్థితులున్నాయి. ముందుగా రంగప్రవేశం చేస్తే నెగిటివ్ ఇంపాక్టు పడే అవకాశం ఉంది. వారసుడులోకేశ్ ను ప్రవేశపెడదామంటే ఆయనకున్న ఆదరణ అంతంతమాత్రమే. వ్యతిరేకత వ్యక్తమైతే ముందుగానే చేతులెత్తేసినట్లవుతుంది. గతంలో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను లోకేశ్ కు అప్పగించారు. మంచి పట్టు ఉంది అనుకున్న నగరంలోనే ఘోర వైఫల్యం ఎదురైంది. ఇప్పుడు లోకేశ్ ను ముందు పెడితే నాయకత్వ సామర్థ్య లోపాలు బయటపడితే 2019 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని పార్టీ అంచనా వేసింది. దాంతో ఆయనకు ఎన్నికల నాయకత్వ బాధ్యతలు అప్పగించకూడదని నిశ్చయించింది. ఆ లోపం తెలియకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించింది.

సొంతబలం చాటేందుకే...

నిన్నామొన్నటివరకూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక కీలకపక్షం. ఎంతో క్లిష్టమైన 2014 ఎన్నికల్లో సైతం 15 సీట్లతో మూడో పెద్దపార్టీగా నిలిచింది. ఆ తర్వాత క్రమేపీ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ షాక్ తర్వాత ఇటువైపు తొంగిచూసే సాహసం చేయలేదు. రేవంత్ నిష్క్రమణ తర్వాత పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అయితే మూలాలు మాత్రం బలంగానే ఉన్నాయి. ఎంతోకొంత ఓటింగు శాతం ఉంది. దీనిని సంఘటిత పరచుకోవాల్సి ఉంది. ప్రజల్లో నమ్మకం కలిగిస్తేనే ఓట్లు పడతాయి. దీనికిగాను పార్టీకి ఆదరణ ఉందని నిరూపించుకోవాలి. ఈ లక్ష్యం సాధించడానికి బాలయ్యకు ఉన్న సినిమా గ్లామర్ తోడ్పడుతుందని టీడీపీ భావిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో నందమూరి బాలకృష్ణను పర్యటింపచేయడం ద్వారా జనాకర్షణను ప్రదర్శించాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలను పెద్ద ఎత్తున చేపట్టాలని యోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే దీనికి శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ప్రాబల్యం ఉండే నియోజకవర్గాలలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. పరోక్ష పద్ధతిలో బాలకృష్ణ ద్వారా టీడీపీ తన బలాన్ని చాటుకోవాలని చూస్తోంది.

నాయకుల నియోజకవర్గాలు...

కాంగ్రెసుతో జట్టుకడితే గెలుపు అవకాశాలున్న 20 నియోజకవర్గాలను టీడీపీ గుర్తించింది. కాంగ్రెసు, సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీల మహాకూటమి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనపై కసరత్తు సాగుతోంది. దీని తర్వాత పొత్తులలో పంచే సీట్ల సంఖ్య , నియోజక వర్గాల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలను క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపుగానే తమకు బలమున్న నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించాలని టీడీపీ తలపోస్తోంది. ప్రజల్లో తిరుగుతూ ముందుగానే బల ప్రదర్శనలు చేయగలిగితే ఆయా స్థానాల కోసం పోటీపడుతున్న కాంగ్రెసు నాయకులకు చెక్ చెప్పవచ్చనేది అంచనా. అందుకే అక్టోబర్ రెండో వారం నుంచే నియోజకవర్గాల్లో తిరగాలని, పాదయాత్రలు చేపట్టాలని, ప్రచార సభలు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్దేశించింది. మహాకూటమి పొత్తులతో ఈ ప్రచారానికి సంబంధం లేదు. కూటమిలో సీట్ల బేరసారాలకు ఈ ప్రచారం ఉపకరిస్తుందనుకుంటున్నారు. 20 సీట్లపై కన్నేస్తే కనీసం 15 స్థానాలు దక్కుతాయి. అవి కూడా తాము కోరుకున్నవి రావాలంటే ముందుగా చొరవ చూపాల్సిందేననేది టీడీపీ భావన. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే తెలంగాణలో పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. తమ నేతలు ప్రజల్లో ఉంటే కాంగ్రెసు దిగొస్తుందని చెబుతున్నారు.

మూడో దశలో ముఖ్యులు...

చంద్రబాబు, లోకేశ్ లేకపోతే టీడీపీ ఎన్నికల రంగంలో ఉన్నట్లే కాదు. తెలంగాణను పూర్తిగా పక్కనపెట్టేశారన్న ప్రచారం సాగితే ప్రతికూల ప్రభావం పడుతుంది. టీడీపీ క్యాడర్ లో నైతిక స్థైర్యం లోపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి చంద్రబాబు, లోకేశ్ లు సైతం రంగంలోకి దిగుతారని నాయకులు చెబుతున్నారు. ఈలోపుగానే సీట్ల సంఖ్య, స్థానాలు ఖరారు అవుతాయి. చంద్రబాబు, లోకేశ్ లు ఆయా ప్రాంతాల్లోనే ప్రచారానికి పరిమితమవుతారంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న బాలకృష్ణ మాత్రం కాంగ్రెసు నియోజకవర్గాల్లో కూడా తిరిగేలా ప్రచార ప్రణాళికను సిద్దం చేస్తామని టీటీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ఎదురీత తప్పదనుకుంటున్న సైకిల్ పార్టీకి కాంగ్రెసు స్నేహహస్తం చేదోడుగా నిలుస్తుందని చెప్పవచ్చు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News