కాలు మోపేందుకే గజగజ వణుకుతున్నారా?

తెలుగుదేశం పార్టీ నేతలు హ్యాండ్సప్ అనేశారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. వరస కేసులు నమోదు కావడం, భద్రతను కుదించడం [more]

Update: 2020-03-23 14:30 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు హ్యాండ్సప్ అనేశారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. వరస కేసులు నమోదు కావడం, భద్రతను కుదించడం వంటి వాటితో ఎక్కువ మంది నేతలు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేశారు. అధికార పార్టీ ఆగడాలతో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు. ఇందులో సీనియర్ నేతలే ఎక్కువగా ఉండటం విశేషం.

నామినేషన్లు వేసేందుకు…..

కనీసం నామినేషన్ వేసేందుకు కూడా ముందుకు రాలేదు. నాయకులే అధైర్యపడటంతో కిందిస్థాయి నేతలు ఇక తమకెందుకన్న ధోరణిలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారు. స్థానికసంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరే పోరాడుతున్నారు. ఆయన జిల్లాల పర్యటనలు చేయకపోయినా అమరావతిలో ఉండి క్యాడర్ కు ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు. సీనియర్ నేతలు కేఈ కృష్ణమూర్తి, అమర్ నాధ్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, బొజ్జల కుటుంబం, కోడెల కుటుంబం, యరపతినేని శ్రీనివాసరావు లాంటి నేతలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

సీనియర్ నేతలు సయితం….

కేఈ కృష్ణమూర్తికి పత్తికొండ, డోన్ నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ ఆయన ఎన్నికలకు దూరమని ప్రకటించారు. ఇక జేసీ దివాకర్ రెడ్డి ముందే ఎన్నికలకు దూరమని ప్రకటించినా కొందరు నామినేషన్లు వేశారు. వారిచేత తర్వాత ఉపసంహరించారని తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో సతీష్ రెడ్డి రాజీనామాతో అక్కడ పార్టీకి దిక్కులేకుండా పోయింది. బీటెక్ రవిని ఇన్ చార్జిగా పెట్టినా ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేకపోయారు.

ముందే ప్రకటించేసి….

ఇక ఆళ్లగడ్డలో అఖిలప్రియ అధికార పార్టీ దెబ్బకు తట్టుకోలేక కాంప్రమైజ్ అయినట్లు చెబుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి కాలుమోపలేదు. ఇక్కడ ఆయన మరదలు అనీషారెడ్డి ఇన్ ఛార్జిగా ఉన్నా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒకరోజు వచ్చి హడావిడి చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. రాప్తాడులో మాత్రం పరిటాల సునీత కొద్దోగొప్పో నామినేషన్లను వేయించగలిగారు. మొత్తం మీద సీనియర్ నేతలందరూ చేతులెత్తేయడంతో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయంటున్నారు.

Tags:    

Similar News