ఎనకొచ్చిన వారు ఎక్కడో?

ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయాలు ఎలా మారాయో.. నేత‌లు కూడా అదేవిధంగా మారిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌ను ఆహా .. ఓహో .. అన్న నాయ‌కులు [more]

Update: 2019-10-18 08:00 GMT

ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయాలు ఎలా మారాయో.. నేత‌లు కూడా అదేవిధంగా మారిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌ను ఆహా .. ఓహో .. అన్న నాయ‌కులు ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. క‌నీసం టీడీపీ ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు కానీ, టీడీపీని ఎలా న‌డిపించాల‌నే వ్యూహాన్ని తెర‌మీదికి తెచ్చేందుకు కానీ ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి ఉంది. అయితే, వీరంతా ఏమీ నిన్న మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కాదు. చాలా సీనియ‌ర్లు. గ‌తంలో ఒక‌రిద్దరు మంత్రులుగా చ‌క్రం తిప్పిన నాయ‌కులే కావ‌డం కూడా గ‌మ‌నార్హం.

ఎన్నికలకు ముందు…..

గ‌తంలో కాంగ్రెస్‌లో ఉండి.. ఆ పార్టీలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు త‌ర్వాత కాలంలో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పార్టీ మారిపోయారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ఆరునెల‌ల వ్యవ‌ధిలో టీడీపీకి జై కొట్టారు. అప్పటి సీఎం చంద్రబాబును ఆహా .. ఓహో.. అంటూ కీర్తించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకుని టీడీపీ త‌ర‌ఫున టికెట్లు సొంతం చేసుకున్నారు. వారిలో నెల్లూరు జిల్లాలో బొల్లినేని కృష్ణయ్య, క‌డ‌ప జిల్లా రాజంపేట‌కు చెందిన బ‌త్యాల చంగ‌ల్రాయుడు (వాస్తవానికి ఈయ‌న‌కు అప్పట్లోనే వైసీపీ మంచి ఆఫ‌ర్ ఇచ్చింది. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే.. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామ‌ని పార్టీ గెలుపుకోసం కృషి చేయాల‌ని సూచించింది. అయితే, ఆయ‌న వైసీపీని కాద‌ని టీడీపీలోకి వెళ్లి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ఓడిపోయారు.)

పోటీ చేసి ఓడిపోయి….

గ‌తంలో 1999లో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని కృష్ణయ్యను చాలా ఏళ్ల త‌ర్వాత బాబు రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చి ఆత్మకూరు సీటు ఇచ్చినా ఆయ‌న ప్రస్తుత మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక రైల్వేకోడూరుకు చెందిన చెంగ‌ల్రాయుడు వైఎస్ టైంలో ఓ వెలుగు వెలిగారు. ఈ ఎన్నిక‌ల్లో బాబు మాట విని టీడీపీలోకి వెళ్లి రాజంపేట నుంచి పోటీ చేసి ఓడారు. ఎన్నిక‌ల్లో ఓటమి త‌ర్వాత ఆయ‌న అడ్రస్ లేరు.

పేరున్న నేతలయినా…..

అదేవిధంగా, క‌ర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి సుజ‌ాత‌మ్మలు కూడా టీడీపీకి జైకొట్టారు. ద‌శాబ్దాలుగా కేఈ కృష్ణమూర్తి కుటుంబంతో ఉన్న వైరాన్ని సైతం ప‌క్కన పెట్టి వారు కాంగ్రెస్‌ను కాల‌దోసి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో ఎంపీగా ఒక‌రు, ఎమ్మెల్యేగా ఒక‌రు పోటీ చేసారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు వీరు ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, విశాఖ‌లో భీమిలి నుంచి పోటీ చేసిన స‌బ్బం హ‌రి కూడా కాంగ్రెస్ మాజీ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న వైసీపీలోకి వెళితే ఖ‌చ్చితంగా విశాఖ లేదా అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ద‌క్కి ఉండేది. చివ‌ర్లో ఆయ‌న టీడీపీకి జై కొట్టి భీమిలిలో ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడారు. ఇక కాంగ్రెస్‌లో మాజీ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కొండ్రు ముర‌ళి రాజాంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. .. ఇలా ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చిన వీరంతా ఓట‌మి త‌ర్వాత అడ్రస్ లేకుండా పోయారు. పార్టీలో ఎంతో నిబ‌ద్ధత‌తో ఉంటామ‌ని చెప్పిన వీరే ఇప్పుడు అధినేత ఫోన్‌కు కూడా క‌ల‌వ‌డం లేదు. మ‌రి వీరి అడుగులు ఎటు ప‌డ‌తాయో చూడాలి.

Tags:    

Similar News