జైలూ.. జగనూ … దెబ్బతినిపోతారేమో…!!

జైలు.. జగన్ ఈ మాటలను ఇంకా టీడీపీ బట్టీ పడుతోంది. ఆ పార్టీకి జగన్ మీద అంత కోపంగా ఉంది కాబోలు. మాట వస్తే చాలు జగన్ [more]

Update: 2019-07-20 02:00 GMT

జైలు.. జగన్ ఈ మాటలను ఇంకా టీడీపీ బట్టీ పడుతోంది. ఆ పార్టీకి జగన్ మీద అంత కోపంగా ఉంది కాబోలు. మాట వస్తే చాలు జగన్ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారని రచ్చ చేస్తూంటారు. జగన్ జైల్ రెండూ నిజమే. ఇపుడు జనం ఆయన్ని సీఎం చేసింది కూడా నిజమే, ఈ నిజం ఒప్పుకోలేక ఆ పాత మాటనే పదే పదే వల్లిస్తూ అక్కసు తీర్చుకుంటున్నారు. ట్విట్టర్లోనూ జగన్ జైలుకు వెళ్ళి వచ్చారు, ఆయన నీతులు చెప్పడమేంటని నారా వారి సుపుత్రుడు లోకేష్ అన్నారు. జగన్ నుంచి నీతి పాఠాలు చెప్పించుకునే స్థితిలో మేం లేమంటూ సెటైర్లు వేశారు. ఇపుడు నిండు సభలో కూడా లోకేష్ అలాగే మాట్లాడుతున్నారు. జైలుకెళ్ళివచ్చిన వారి పాలనలో బతకడం జనం దౌర్భాగ్యం అంటూ ఆయన ప్రజల తీర్పుని పరిహసిస్తున్నారు. వారిని కూడా పరోక్షంగా తిడుతున్నారు. మరి లోకేష్ మరచిపోయినవి, కావాలని పక్కన పెట్టినవి ఆ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అంటున్నారు వైసీపీ నేతలు.

బాబు స్టేల విషయం….

ఏకంగా 18 కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్న సంగతి లోకేష్ కి తెలియదనుకోవాలేమో అంటున్నారు. ఇక లోకేష్ రాజకీయంగాబాగా యాక్టివ్ గా ఉన్నపుడే కదా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కునదని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఇపుడు అయిదేళ్ల పాలన పూర్తయింది. పోలవరం, అమరావతి రాజధాని కధలు, నీరు చెట్టు అవినీతి బాగోతాలు బయటకు తీస్తే ఎవరు జైలుకు వెళ్తారో చూద్దామని కూడా సవాల్ చేస్తున్నారు. ఇక జగన్ జైల్ కు వెళ్ళడం అన్నది ఎంత నిజమో దాని వెనక రాజకీ కుట్ర ఉందన్నది కూడా అంతే నిజమని అంటున్నారు. అప్పట్లో సోనియాగాంధీతో బాబు కుమ్మక్కై కేసులు పెట్టించారని కూడా గుర్తు చేస్తున్నారు. పోనీ అవన్నీ సామాన్య జనాలకు తెలియవనుకున్నా కాంగ్రెస్ నేత శంకరరావు పెట్టిన కేసులో టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి రాజు వంటి వారు ఇంప్లీడ్ కావడం బట్టి చూసినా రెండు పార్టీలు కలసి కధ నడిపించాయని క్లియర్ గానే అర్ధమవుతోంది కదా అంటున్నారు

పవన్ తీరు ఇంతే….

ఇక టీడీపీ తో రాజకీయ దోస్తీ కట్టిన పవన్ కళ్యాణ్ తీరు కూడా అచ్చం ఇలాగే ఉంది. మాటకొస్తే జైలుకు వెళ్ళిన వారు అంటూ ఆయన కూడా అనేస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైన ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉన్నపుడు కేసులు ఉంటాయి, జైళ్లు ఉంటాయి. అయితే తప్పు చేసినట్లుగా నిరూపణ కావాల్సింది న్యాయ స్థానాలలో. అక్కడ తీర్పు వచ్చే వరకూ కూడా ఎవరి వ్యక్తిత్వాన్ని కూడా మరొకరు హననం చేసే హక్కు లేదు. 2014 ఎన్నికల్లో జగన్ అవినీతి విషయంలో జనం కొంత నమ్మి అధికారానికి దూరం పెట్టవచ్చు, ఇపుడు తాజా ఎన్నికల్లో ఆయన్నే కోరుకున్నాక రాజకీయ నేతలు ఇంకా పాత పాటే పాడితే వారికే దెబ్బ పడిపోతుందన్నది గ్రహిస్తే మంచిదేమో. వైసీపీ పాలనలో తప్పులుంటే విమర్శలు చేయవచ్చు కానీ ఇలాంటి వెకిలి విమర్శలతో తమకే చేటు అన్నది కూడా అర్ధం చేసుకోవాలి.

Tags:    

Similar News